ధర ఉన్నా.. ఫలితం శూన్యం

ABN , First Publish Date - 2021-10-29T05:25:27+05:30 IST

తెల్ల బంగారంపై రైతులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. తుపాను ప్రభావంతో కురిసిన అధిక వర్షాలు నష్టాన్ని మిగిల్చాయి. దిగుబడిపై ప్రభావం చూపడంతో అవేదన చెందుతున్నారు.

ధర ఉన్నా.. ఫలితం శూన్యం

- మద్దతు ధరకు మించి రేటు 

-  వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంట 

-  తుపాను ప్రభావంతో భారీగా పడిపోయిన దిగుబడి

  (ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)  

తెల్ల బంగారంపై రైతులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. తుపాను ప్రభావంతో కురిసిన అధిక వర్షాలు నష్టాన్ని మిగిల్చాయి. దిగుబడిపై ప్రభావం చూపడంతో అవేదన చెందుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో పత్తి మద్దతు ధరకు మించి పలుకు తుండడంతో పంట నష్టపోయిన  రైతులు తీవ్ర నిరాశకు గరవుతున్నారు. ఈ సారి  రైతులు వరి సాగుపై ఎక్కువ ఆసక్తి చూపడం, వర్షాలతో దిగుబడి తగ్గడం, అంతర్జాతీయ  మార్కెట్‌లోనూ పత్తి నిల్వలు తగ్గిపోవడంతో మన దేశ పత్తికి డిమాండ్‌ పెరిగినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాల్‌ పత్తి ధర 8వేలకు పైనే పలుకుతోంది. 

ప్రకృతి కన్నెర్ర

రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పత్తి రైతులపై ప్రకృతి కన్నెర్ర జేసిందని భావిస్తున్నారు. అధిక వర్షాలకు తెగుళ్లతోపాటు పంట నష్టం చవిచూశారు. ఈ సారి పత్తిలో మంచి దిగుబడి వస్తుందని, అధిక లాభాలు వస్తాయని భావించారు. కానీ పత్తి పంట తడిసి రంగు సైతం మారిపోయింది. నాణ్యత లేకపోవడంతో రైతులు తెల్లబోయే పరిస్థితి ఏర్పడింది.  జిల్లా వ్యాప్తంగా వానాకాలం 2.41 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. ఇందులో  69,225 ఎకరాల్లో పత్తి వేశారు. ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో భారీగా కురిసిన వర్షాలు తుఫానుకు జిల్లాలో 6710 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. తుపాను  ప్రభావానికి ఇల్లంతకుంట మండలంలో 300 ఎకరాలు, సిరిసిల్లలో 10 ఎకరాలు, తంగళ్లపల్లిలో 35 ఎకరాలు, బోయినపల్లిలో 40 ఎకరాలు, చందుర్తిలో 250 ఎకరాలు, కోనరావుపేటలో 250 ఎకరాలు, రుద్రంగిలో 250 ఎకరాలు, వేములవాడలో 450 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 500 ఎకరాలు, గంభీరావుపేటలో 35 ఎకరాలు, ముస్తాబాద్‌లో 80 ఎకరాలు, వీర్నపల్లిలో 10 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 220 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల కంటే పత్తి పంట భారీగానే దెబ్బతిందని రైతులు వాపోతున్నారు. పంట నష్టం అంచనాలతో సరిపోతోందని, మూడేళ్లుగా పరిహారం  అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

కౌలు రైతుకు భారీగా నష్టం

తుపాను ప్రభావంతో కౌలు రైతు కుదేలయ్యాడు. కౌలు రైతులకు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ సాయం లేకపోవడంతో వడ్డీలకు డబ్బులు తెచ్చి పంటలు సాగు చేస్తున్నారు. ఎంతో కష్టాలకు ఓర్చి పంటలు సాగు చేసిన రైతులకు చివరి దశలో నష్టాలే మిగులుతున్నాయి. జిల్లాలో ఈసారి భారీ వర్షాలతో వరి, పత్తి పంటలు దెబ్బతినడంతో కౌలు రైతులకు పెట్టుబడి కూడా దక్కుతుందో లేదోనని ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో దాదాపు 60 వేల మంది కౌలు రైతులు వ్యవసాయం పైనే ఆధారపడి భూమిని కౌలుకు తీసుకొని జీవనం సాగిస్తున్నారు.  ఎకరానికి రూ.12 నుంచి 15 వేల వరకు కౌలు చెల్లించి సాగు చేస్తున్న రైతులకు ఈసారి పత్తి పంట ఎక్కు నష్టాన్ని మిల్చినట్లు భావిస్తున్నారు. ప్రభుత్వం పంట నష్టపరిహారాన్ని అందించాలని కోరుతున్నారు. 


Updated Date - 2021-10-29T05:25:27+05:30 IST