చితిపై..పత్తి

ABN , First Publish Date - 2020-10-16T06:10:44+05:30 IST

రాష్ట్రంలో ఆదిలాబాద్‌, నల్గొండతో పాటు నాగర్‌కర్నూల్‌ జిల్లాలో వానాకాలం సీజన్‌లో పత్తి ప్రధానమైన పంట. ప్రభుత్వం కూడా ఈ సీజన్‌లో పత్తి పంట వేయాలని, వారికే రైతుబంధు సాయం అందిస్తామని స్పష్టం చేసింది. దీంతో జిల్లాలోని

చితిపై..పత్తి

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు

దాదాపు రెండు లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పత్తి పంటలు

పత్తిపైనే మొలకెత్తుతున్న విత్తులు

చేతికి కూడా రాని పెట్టుబడులు

తీవ్రంగా పడిపోనున్న దిగుబుడులు

భారీ నష్టాలతో పత్తి రైతు చిత్తు

ప్రభుత్వ సాయంపైనే ఆశలు


జూన్‌, జూలైలో కురిసిన వర్షాలు అనుకూలించాయి.. ఆగస్టులో కురిసిన భారీ వర్షాలు పంటపై కొంత ప్రభావాన్ని చూపాయి.. మళ్లీ సెప్టెంబరులో పడిన వానలు దిగుబడులపై ప్రతాపం చూపాయి.. తీరా ఇప్పుడున్న అరకొర పంట చేతికొచ్చే సమయంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు పత్తి రైతులను నిండా ముంచాయి.. చేళ్లలోనే పత్తికాయలకు మొలకలు వస్తున్నాయి.. కాలువలు, చెరువులు తెగి దాదాపు లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.. కనీసం పెట్టుబడులు కూడా చేతికొచ్చే పరిస్థితి లేకపోవడంతో ఛితిపై పత్తిని పేర్చాలిన పరిస్థితి అన్నదాతలకు దాపురించింది..


నాగర్‌కర్నూల్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ఆదిలాబాద్‌, నల్గొండతో పాటు నాగర్‌కర్నూల్‌ జిల్లాలో వానాకాలం సీజన్‌లో పత్తి ప్రధానమైన పంట. ప్రభుత్వం కూడా ఈ సీజన్‌లో పత్తి పంట వేయాలని, వారికే రైతుబంధు సాయం అందిస్తామని స్పష్టం చేసింది. దీంతో జిల్లాలోని నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్‌ నియోజకవర్గాలలో దాదాపు ఐదు లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంట రైతులు సాగు చేశారు. సీజన్‌ ప్రారంభంలో సకాలంలో వర్షాలు కురవడంతో అంతా సవ్యంగా జరిగిపోతుందని, కష్టాల నుంచి గట్టెక్కుతామని ఆశిస్తున్న తరుణంలో, భారీ వర్షాలు పత్తి రైతులను ఆగమాగం చేశాయి. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన భారీ వర్షాలకు కొంత మేర పంటలు దెబ్బతినగా, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతులను కొలుకోలేని దెబ్బతిశాయి. అధికారికంగా జిల్లాలో దాదాపు 67,385 ఎకరాల్లో పత్తి పంటలు దెబ్బతిన్నాయని అధికారులు చెబుతుండగా, అనధికారికంగా దాదాపు రెండు లక్షలకుపై పంటలు దెబ్బతిన్నట్లు సమాచారం.


అతివృష్టి కారణంగా ఉత్పన్నమైన పరిస్థితుల నేపథ్యంలో పత్తి పండించిన రైతాంగానికి పెట్టుబడులు రావడం కూడా గగనంగా మారింది. సాధారణంగా ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉంది. ఒక ఎకరాలో పత్తి పంట సాగు చేయడానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడి ఖర్చవుతుంది. పది రోజుల కిందట ముసురు వానలతో పంట దెబ్బతిన్న ఒక్కో మొక్కకు కాసిన 10 నుంచి 12 గూడల ద్వారా వచ్చే దిగుబడితో పెట్టుబడులైనా దక్కుతాయని ఆశించిన రైతాంగానికి నిరాశే మిగిలింది. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో ప్రధానంగా పత్తిని సాగు చేసే బిజినేపల్లి, నాగర్‌కర్నూల్‌, తెలకపల్లి, తాడూరు, అమ్రాబాద్‌, అచ్చంపేట, కల్వకుర్తి, వెల్దండ, చారకొండ, పదర మండలాల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పత్తిని ఏరే పరిస్థితి లేకుండా పోవడంతో వానకు తడిసి మొలకెత్తుతుండటం ఈ ప్రాంత రైతాంగాన్ని తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. దీంతో ఎకరాకు రెండు నుంచి మూడు క్వింటాళ్లు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేకుండా పోకయింది. సరిగ్గా పత్తి ఏరే సమయంలో అతివృష్టి ఏర్పడటం తమను ఆర్థికంగా బాగా దెబ్బతీస్తోందని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది.


ప్రభుత్వం ఆదుకోవాలి 

ఇటీవల కురుస్తున్న నిరంతర వర్షాలతో పత్తి రైతులకు తీరని నష్టం జరుగుతోంది. ఈ సంవత్సరం నేను నాలుగెకరాల్లో పత్తి సాగు చేయగా పెట్టుబడులు సైతం రావు. ప్రభుత్వం దయ తలచి పత్తి నష్టపోయిన రైతులను గుర్తించి నష్టపరిహారం ఇవ్వాలి.

- పర్వతాలు, పాపగల్‌ గ్రామం


రూ.25 వేల పరిహారం ఇవ్వాలి

భారీ వర్షాలకు పత్తి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చేతికందే సమయంలో పత్తి మొలకెత్తి అపార నష్టం జరిగే ప్రమాదం ఉంది. పత్తి రైతులను ప్రభుత్వం ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.

- కృష్ణయ్య, సిర్సవాడ


పురుగుల మందు తాగి పత్తి రైతు ఆత్మహత్య

తెలకపల్లి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. హెడ్‌కానిస్టేబుల్‌ జి.వెంకటేశ్వర్లు కథనం మేరకు.. నాగర్‌కర్నూల్‌ జిల్లా తెలకలపల్లి మండలం బొప్పల్లి గ్రామానికి చెందిన రెడ్డి భాష (58) అనే రైతు తనకున్న నాలుగు ఎకరాల్లో గతేడాది అప్పు చేసి పత్తి పంటను సాగు చేశాడు. కానీ, సరైన దిగుబడులు రాక నష్టపోయాడు. ఈ ఏడాది కూడా అప్పులు చేసి నాలుగెకరాల్లో మళ్లీ పత్తి పంటను సాగు చేశాడు. అయితే, ఇటీవల కురుస్తున్న వర్షాలకు పంట మొత్తం నీట మునిగి తీవ్రంగా నష్టపోయాడు. పంటల పెట్టుబడుల కోసం ఈ రెండేళ్లలో దాదాపు రూ.4.80 లక్షలు అప్పు చేశాడు.


ఈ అప్పును ఎలా తీర్చాలో అర్థం కాక మనస్తాపానికి గురయ్యాడు. గత సోమవారం ఇంట్లోనే పరుగులు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని కుటుబం సభ్యులు నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్‌నగర్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున రెడ్డిభాష మృతి చెందినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ తెలిపారు. మృతుడి భార్య తిరుపతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2020-10-16T06:10:44+05:30 IST