మక్కలు పక్కకేనా?

ABN , First Publish Date - 2020-05-20T09:53:09+05:30 IST

వికారాబాద్‌ జిల్లాలో సాగు చేసే ప్రధాన పంటల్లో ఒకటైన మొక్కజొన్న సాగు విస్తీర్ణం ఇక తగ్గిపోనుంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో కూడా

మక్కలు పక్కకేనా?

వికారాబాద్‌ జిల్లాలో తగ్గనున్న మొక్కజొన్న సాగు విస్తీర్ణం 

గతంలో 30 వేల హెక్టార్లలో సాగు 

సాగుచేస్తే రైతుబంఽధు నిలిపేస్తామన్న సీఎం

ప్రత్యామ్నాయంగా పత్తి, కంది పంటల వైపు మొగ్గు 

1.70 లక్షల ఎకరాల్లో కంది.. 2.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు లక్ష్యం


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : వికారాబాద్‌ జిల్లాలో సాగు చేసే ప్రధాన పంటల్లో ఒకటైన మొక్కజొన్న సాగు విస్తీర్ణం ఇక తగ్గిపోనుంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో కూడా రైతులు ఈ పంటనే నమ్ముకుని సాగు చేసేవారు. ఖరీఫ్‌లో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 29,429 హెక్టార్లు ఉండగా, గత ఖరీఫ్‌లో 30,044 హెక్టార్లలో సాగు చేశారు. జిల్లా సాధారణ సాగు కంటే 615 హెక్టార్లలో మొక్కజొన్న పంట సాగైంది. యాసంగిలో 613 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారు. వానాకాలంలో మొక్కజొన్న సాగు చేస్తే రైతుబంధు నిలిపేస్తామని సీఎం కేసీఆర్‌  స్పష్టం చేయడంతో రైతులు అయోమయానికి గురవుతు న్నారు. మొక్కజొన్న పంట సాగు చేసేవారు ప్రత్యామ్నాయంగా పత్తి, కంది పంటల వైపు దృష్టి సారించే అవకాశం ఉంది.


వానాకాలంలో సాగయ్యే మొక్కజొన్న పంటతో పోలిస్తే యాసంగిలో చాలాతక్కువ విస్తీర్ణంలో పండి స్తారు. పరిగి, దోమ, కులకచర్ల, పూడూరు, వికారాబాద్‌, నవాబుపేట్‌, మర్పల్లి, బంట్వారం, ధారూరు మండలాల్లో రైతులు ఎక్కువగా మొక్కజొన్న పంట సాగు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నియంత్రిత వ్యవసాయ విధానంలో భాగంగా రైతులు మొక్కజొన్న సాగుకు బదులుగా పత్తి, పప్పు ధాన్యాల వైపు మొగ్గు చూపితే మాత్రం జిల్లాలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం చాలా వరకు తగ్గిపోనుంది. 


పెరగనున్న కంది, పత్తి విస్తీర్ణం

 ఈ ఏడాది జిల్లాలో పత్తి పంటతోపాటు పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పత్తి, కంది, పెసర, మినుము తదితర పంటల సాగు విస్తీర్ణం పెరిగేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. జిల్లాలో పత్తి సాధారణ విస్తీర్ణం 45,349 హెక్టార్లు ఉండగా, గతేడాది 75,110 హెక్టార్లలో సాగు చేశారు. కంది సాధారణ విస్తీర్ణం 56,721 హెక్టార్లు ఉండగా, 52,376.4 హెక్టార్లలో సాగు చేశారు. పెసర సాధారణ విస్తీర్ణం 8,013 హెక్టార్లు ఉండగా, 7,019.2 హెక్టార్లలో సాగు చేశారు. మినుము పంట సాధారణ విస్తీర్ణం 4,977 హెక్టార్లు ఉండగా, గతేడాది 3,200 హెక్టార్లలో సాగైంది. రాష్ట్ర ప్రభుత్వం పత్తి, కంది పంట సాగు విస్తీర్ణం పెంచే దిశగా చర్యలు చేపట్టింది.


జిల్లాలో ఈసారి 68,796 హెక్టార్లకు పెంచేలా కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి అదనంగా మరో 12,065 హెక్టార్లలో కంది సాగు పెంచనున్నారు. పత్తి పంట గత ఏడాది 75,110 హెక్టార్లలో సాగు చేయగా, ఈ ఏడాది 93,077 హెక్టార్లలో సాగు చేయాలనే లక్ష్యం నిర్దేశించారు. పెసర, మినుము పంట సాగు రెట్టింపయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. 20 వేల హెక్టార్లలో పెసర , 15 వేల హెక్టార్లలో మినుము పంటల సాగు పెంచేలా కార్యాచరణ రూపొందించనున్నారు.


Updated Date - 2020-05-20T09:53:09+05:30 IST