పత్తి సాగు.. మరింత భారం

ABN , First Publish Date - 2022-05-24T06:45:31+05:30 IST

రైతులకు తెల్లబంగారం సాగు మరింత భారంగా మారనుంది.

పత్తి సాగు.. మరింత భారం

 పెరిగిన విత్తనాలు, ఎరువుల ధరలు ఫ విత్తనాల ప్యాకెట్‌కు రూ.43 పెంపు

 కాంప్లెక్స్‌ బస్తాపైన రూ.200 పెంపు 

రైతులకు తెల్లబంగారం సాగు మరింత భారంగా మారనుంది.  పెరిగిన విత్తనాలు, ఎరువుల ధరలు రైతు నెత్తిన గుదిబండలా పడనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీ పెంచినట్లు ఇటీవల వార్తలు రావడంతో ఎరువుల ధరలు తగ్గవచ్చని రైతులు భావించారు. కానీ బస్తాకు రూ.100 నుంచి రూ.200 పెరిగాయి. పత్తి ప్యాకెట్‌ ధర రూ.43 పెరిగింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే డీజిల్‌ ధరలు పెరిగినందున ట్రాక్టర్‌తో దున్నకం రేట్లు, కూలీల రేట్లు కూడా పెరిగాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో పత్తి రైతులపై సుమారు రూ.106.74కోట్ల భారం పడనుంది. 

మోత్కూరు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైతులు సాగు చేసే ప్రధాన మెట్టపంట పత్తి. నీటి వసతి ఉన్న రైతులు వరి సాగు చేస్తుండగా, వర్షాధారంపై సాగుచేసే రైతులంతా ప్రధానంగా పత్తినే సాగుచేస్తారు. ఈ సంవత్సరం విత్తనాలు, ఎరువుల ధరల పెరుగుదలతో పత్తిసాగు మరింత భారం కానుంది. ఈ నెల 25వ తేదీ నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుంది. ఇప్పటికే కురిసిన అకాల వర్షాలకు పత్తి సాగుకోసం దుక్కులు దున్ని సిద్ధంచేసి పెట్టారు. రోహిణి కార్తెలో ఎప్పుడు భారీ వర్షం కురిసినా పత్తి విత్తనాలు విత్తడానికి రైతులు సన్నద్ధమవుతున్నారు. 


ఉమ్మడి జిల్లా రైతులపై రూ.106.74 కోట్ల అదనపు భారం

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విత్తనాలు, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెరిగిన కారణంగా పత్తి రైతులపై రూ.106.74కోట్ల అదనపు భారం పడనుంది. నల్లగొండ జిల్లాలో 6.50 లక్షలు, సూర్యాపేట జిల్లాలో లక్ష, యాదాద్రి భువనగిరి జిల్లాలో 1.50 లక్షల ఎకరాల చొప్పున ఉమ్మడి నల్లగొండ జిలాల్లో సుమారు 9 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. ఎకరాకు రెండు ప్యాకెట్ల విత్తనాలు విత్తుతారు. ఒక్కో ప్యాకెట్‌ ధర రూ.43 పెరిగింది. ఉమ్మడి జిల్లాలో 9 లక్షల ఎకరాలకు 18 లక్షల ప్యాకెట్లు అవసరమవుతాయి. ఒక్కో ప్యాకెట్‌పై పెరిగిన ధర రూ.43 ప్రకారం రైతులపై రూ.7కోట్ల 74 లక్షల అదనపు భారం పడుతుంది. ప్రతీ రైతు సగటున ఎకరాకు ఒక బస్తా డీఏపీ, రెండు బస్తాల కాంప్లెక్స్‌ ఎరువులు వినియోగిస్తారు. డీఏపీ బస్తా రూ.100 కాంప్లెక్స్‌ ఎరువులపై బస్తాకు రూ.200 పెరిగాయి. ఉమ్మడి జిల్లాలో సాగయ్యే 9 లక్షల ఎకరాల్లో రైతులపై డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువులకు రూ.27 కోట్ల అదనపు భారం పడనుంది. పొటాష్‌ ధర కూడా పెరిగిందంటున్నారు. అది కూడా రైతులపై అదనపు భారమే అవుతుంది. దీనికి పెరిగిన కూలి రేట్లు, డీజిల్‌ ధరల పెరుగుదలతో పెరిగిన దున్నకం రేట్లు తోడుకానున్నాయి. విత్తనాలు, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏటా పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నట్టుగా పత్తి మద్దతు ధర పెరగడం లేదు. కేంద్రం పునరాలోచించి పెంచిన విత్తనాలు, ఎరువుల ధరలు తగ్గించాలని రైతులు కోరుతున్నారు.


పెరిగిన ధరలతో రైతులకు ఇబ్బందులు

పెరిగిన పత్తి విత్తనాలు, ఎరువుల ధరలతో రైతులకు ఆర్థిక ఇబ్బందులు తప్పేలా లేవు. పత్తి విత్తనాల ప్యాకెట్‌ ధర రూ.43 పెరిగింది. పత్తి విత్తనాల ప్యాకెట్‌ ధర 2020 వానాకాలంలో రూ.730, 2021లో రూ.767 ఉండగా ఇప్పుడు రూ.810కి చేరింది. కేంద్ర ప్రభుత్వం డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు బస్తాకు రూ.100 నుంచి రూ.200 పెంచింది. 


పెరిగిన దున్నకం రేట్లు

డీజిల్‌ ధర పెరిగిన కారణంగా ట్రాక్టర్లతో దున్నకంరేట్లు పెరిగాయి. గత సంవత్సరం ఎకరం ప్లౌ వేయడానికి రూ.2200 ఉండగా, ప్రస్తుతం రూ.2600కు పెంచారు. కల్టివేటర్‌తో దున్నకం గతంలో ఎకరానికి రూ.1200 ఉండగా, ఇప్పుడు రూ.1400కు పెంచారు. కల్టివేటర్‌తో రెండు సార్లు దున్నుతారు. ప్లౌ వేయడానికి ఎకరాకు రూ.400చొప్పున ఉమ్మడి జిల్లాలో 9లక్షల ఎకరాలకు రూ.36 కోట్లు, కల్టివేటర్‌తో రెండు సార్లు దున్నడానికి ఎకరాకు రూ.400 చొప్పున 9 లక్షల ఎకరాలకు 36 కోట్లు అదనపు భారం పడుతుంది.


పెరిగిన ధరలు ఇలా..

ఎరువులు గతవానాకాలం గతయాసంగి ప్రస్తుత రేటు  

డీఏపీ బస్తా            రూ.1200      రూ.1250    రూ.1350

14-35-14 రూ.1475      రూ.1700    రూ.1900

28-28-0 రూ.1475      రూ.1700      రూ.1900

20-20-0-13      రూ.950        రూ.1300      రూ.1450


గిట్టుబాటు కావడం లేదు: మర్రి మధు, పత్తి రైతు, మోత్కూరు

ప్రతి సంవత్సరం 15 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నా. గత రెండేళ్లుగా వాతావరణం అనుకూలించక పెట్టుబడులు కూడా చేతికి రాలేదు. గత సంవత్సరం ప్రభుత్వ మద్దతు ధర కన్నా ఓపెన్‌ మార్కెట్లో రేటు ఎక్కువగా ఉండి క్వింటా పత్తి రూ.8వేల వరకు అమ్మడంతో పెట్టుబడులు చేతికి వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వ పత్తి విత్తనాలు, కాంప్లెక్స్‌ ఎరువుల రేట్లు పెంచింది. కూలీ, దున్నకం, గుంటక తోలడం రేట్లు కూడా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో పత్తిసాగు భారంగా మారింది. ప్రభుత్వం పునరాలోచించి పెంచిన విత్తనాలు, ఎరువుల ధరలు తగ్గించాలి. 

Updated Date - 2022-05-24T06:45:31+05:30 IST