‘పత్తి’ డబుల్‌..!

ABN , First Publish Date - 2022-05-23T05:55:33+05:30 IST

‘పత్తి’ డబుల్‌..!

‘పత్తి’ డబుల్‌..!

జిల్లాలో రెట్టింపు కానునున్న సాగు విస్తీర్ణం 

ఈ వానాకాలంలో 1,40,600 ఎకరాల్లో పంట వేయనున్న రైతులు

ప్రణాళికను సిద్ధం చేసిన వ్యవసాయ అధికారులు


మహబూబాబాద్‌ అగ్రికల్చర్‌, మే 23 : వానాకాలం సమీపిస్తుంది.. ఈ సారి ముందుగానే రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెల్పడంతో రైతులు సమయాత్తం అవుతున్నారు. కాగా, ఈ వానాకాలంలో ఏఏ పంటలు వేయాలనే విషయంపై జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. మహబూబాబాద్‌ జిల్లాలో గత వానాకాలంలో 4,51,812 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా, ఈసారి 4,60,580 పంటలు వేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. మిర్చిపంట వేసి, తీవ్రంగా నష్టపోయిన రైతులు ఈ వానాకాలంలో మిర్చివైపు దృష్టి సారించకుండా.. పత్తి వేయడానికి సన్నద్ధమవుతున్నారు. దీంతో ఈసారి పత్తిపంట విస్తీర్ణం రెట్టింపు అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.


పెరగనున్న పత్తి విస్తీర్ణం..

గత సీజన్‌లో మిర్చి పంటను వేసిన రైతులు ఆర్థికంగా నష్టపోయారు. విదేశాల నుంచి రసం పీల్చే నల్ల తామరపురుగు తెగులు, జిల్లాలోని మిర్చిచేన్లను ఆశించడంతో పంటలు దెబ్బతిన్నాయి. చేన్ల నుంచి మూడుసార్లు పత్తి తీయాల్సి ఉండగా, ఒక్కసారి మాత్రమే దూదిని తీసి, ట్రాక్టర్లతో దున్ని ఈ సారి మొక్కజొన్న పంట వేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి పంట దిగుబడి తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి  డిమాండ్‌ పెరిగింది. క్వింటా పత్తి రూ.14 వేల చేరువలో ఉండటంతో ఈ వానాకాలంలో రైతులు పత్తి పంట వేయడానికే జిల్లాలోని రైతులు మొగ్గు చూపుతున్నారు.


ఈ సారి పంటలు ఇలా..

ఈ వానాకాలంలో వరిసాగు కొంత మేరకు విస్తీర్ణం తగ్గనున్నది. గత ఏడాది 2,14,342 ఎకరాల్లో పొలం చేయగా.. ఇప్పుడు 1,80,200 ఎకరాల్లో వరి వేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పత్తి 73, 572 ఎకరాల్లో గతేడాది వేయగా ఈసారి 1,40,600 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.మొక్కజొన్నలు 54,239 గతేడాది సాగు చేయగా, ఇప్పుడు 32,630, కందులు 4,921 ఎకరాలకు గాను 12,036 ఎకరాలు, పెసర్లు 4,909 గతేడాది వేయగా, ఈసారి 8,284, వేరుశనగ 240 ఎకరాలు వేయగా ఈ సారి 610 ఎకరాల్లో రైతులు సాగు చేస్తారని భావిస్తున్నారు. మిర్చి 82,760 ఎకరాల్లో సాగు చేయగా, ఇప్పుడు 65,200 ఎకరాల్లో, పసుపు 4,401కి గాను 4,620 ఎకరాల్లో, ఇతర పంటలు 12,828 గాను 16,400 ఎకరాల్లో వేస్తారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. 


సేంద్రియ విధానంలో వరిసాగు..

జిల్లాలోని రైతులు సేంద్రియ పద్ధతిలో దేశీయ వరిసాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆరోగ్యకరమైన పంటలు, ఔషధ గుణాలు, పోషకాలు ఉన్న దేశీరకాలైన కూజపటాలియా, నువ్వారంగ్‌, రెడ్‌రైస్‌, బ్లాక్‌ రైస్‌, బాస్మతి, చిట్టిముత్యాలు లాంటి ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ కలిగిన విత్తనాలను ఆవుమూత్రం, పేడ, పప్పు ధాన్యాల పిండి, బెల్లం, మురగబెట్టిన సల్లాతో ఈ దేశీయా పంటలను సాగు చేయనున్నారు. 


ఎరువులు.. విత్తనాల కేటాయింపు

జిల్లాలో యూరియా 69,087 మెట్రిక్‌ టన్నులు అవసరం ఉండగా, వివిధ దుకాణాల్లో 1,494 మెట్రిక్‌ టన్నులో మాత్రమే అందుబాటుల్లో ఉంది. డీఏపీ 23,030 అవసరం ఉండగా, 902 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 46,060 గాను 4,890 మెట్రిక్‌టన్నులు నిల్వలు ఉన్నాయి. ఎంఓపీ 23,030 అవసరం ఉండగా 902 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉన్నా యి. వరి విత్తనాలు 54,100, పత్తి 261 క్విం టాళ్లు, మొక్కజొన్నలు 28,100 ప్యాకెట్లు, పెసర్లు 332 క్విం టాళ్లు, కందులు 610 క్వింటాళ్లు, వేరుశనగ 482 క్విం టాళ్లు, మిర్చి 65 క్వింటాళ్లు, పసుపు 4800, ఇతర పం టలు 650 క్వింటాళ్లు అవసరం ఉంది. 


ఆధునిక పద్ధతిలో విత్తన పరీక్షలు..

గతంలో ఏనాడులేని విధంగా నకిలీ విత్తనాలపై ప్రభుత్వంతో పాటు టాస్క్‌ఫోర్స్‌ అధికారులు నూతన పద్ధతుల ద్వారా అరికట్టేందుకు సిద్ధమయ్యారు. గతంలో వివిధ దుకాణాల్లో సేకరించిన విత్తనాలను హైదరాబాద్‌లోని ల్యాబ్‌లకు పంపించి పరీక్షలు నిర్వహించేవారు అలాంటి ఇలా కాకుండా ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్‌ అధికారుల వెంటనే అధునాతన యంత్రాలను తీసుకువచ్చి అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించి అవి నకిలీవా.. ఆస్లీవా తేల్చనున్నారు. నకిలీ అని తేలితే దుకాణాదారులపై కేసులు నమోదు చేస్తారు. 


నాలుగేళ్లుగా దేశీయ వరిసాగు.. : సొల్లెటి జైపాల్‌రెడ్డి, అభ్యుదయ రైతు, తాళ్లపూసపల్లి, కేసముద్రం

భూసార, నాణ్యత పెంచేందుకు భూమిలో సేం ద్రియ కర్బన శాతం పెంచేందుకు ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గించి పర్యావరణాన్ని కాపాడేందుకుగాను గత నాలుగేళ్లుగా సేంద్రియ, దేశీయ వెరైటీలను పండిస్తున్నాను. ఈ పర్యావరణ పరిరక్షణ కోసం ఎరువులు, పురుగుల మందులు తగ్గించడానికి రైతుల్లో విస్తృత ప్రచారం చేపట్టి సేంద్రియ పద్ధతిలో వరిసాగు చేపట్టి రైతులనుచైతన్యపరుస్తున్నాను. ఆవుమూత్రం, పెడ, పప్పు ధాన్యాల పిండి, బెల్లం వీటితో వరి సాగుచేస్తున్న పురుగు మందుల నివారణకు మురగబెట్టిన సల్లాను పిచికారి చేస్తున్నా. ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఆరోగ్యకరమైన పంట కోసం చేస్తున్నాం. 


భూమి చల్లబడిన తర్వాతనే విత్తుకోవాలి : ఎం.లక్ష్మీనారాయణ, మహబూబాబాద్‌ డివిజన్‌ వ్యవసాయ సహాయ సంచాలకుడు

వానకాలం సీజన్‌లో వర్షాలు పడగానే ఆదరబాదరగా విత్తనాలు విత్తుకోవద్దు. 60 ఎంఎం శాతం వర్షపాతం నమోదయ్యేంత వరకు భూమి పూర్తిగా చల్లబడిన తర్వాత విత్తుకోవాలి. వరి పంట సాగును తగ్గించి పప్పు ధాన్యాలకు, పత్తికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. వానాకాలం పంటల సాగు ప్రణాళిక సిద్ధమై ప్రభుత్వానికి కూడ నివేదిక సమర్పించాం. వర్షాలు బాగా కురిసి పంటలు అధికంగా పండి రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలి. 

Updated Date - 2022-05-23T05:55:33+05:30 IST