‘ఖద్దరు’ తొడుగు!

ABN , First Publish Date - 2020-07-13T05:30:00+05:30 IST

ఖద్దరు... ఒంటిపై ఒదిగిపోయే వస్త్రంగానే కాదు... ఇప్పుడు కాలి కింద చెప్పుగానూ మారిపోయింది. ఆశ్చర్యం వద్దు. కావాలంటే మీరూ ఆ ‘స్వదేశీ’ స్టయిల్‌లో ‘అడుగులు’ వేయవచ్చు. ఇప్పటికే ఖద్దరు వాచీలు మార్కెట్‌లో మెరుస్తున్న వేళ...

‘ఖద్దరు’ తొడుగు!

ఖద్దరు... ఒంటిపై ఒదిగిపోయే వస్త్రంగానే కాదు... ఇప్పుడు కాలి కింద చెప్పుగానూ మారిపోయింది. ఆశ్చర్యం వద్దు. కావాలంటే మీరూ ఆ ‘స్వదేశీ’ స్టయిల్‌లో ‘అడుగులు’ వేయవచ్చు. ఇప్పటికే ఖద్దరు వాచీలు మార్కెట్‌లో మెరుస్తున్న వేళ... డిఫరెంట్‌ లుక్‌తో ఈ పాదరక్షలు నయా ట్రెండ్‌ సెట్‌ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. 


ఖద్దరు బట్టలు వేసుకొంటే ఎంతో హుందాగానే కాదు... చాలా హాయిగా... సౌకర్యంగా కూడా ఉంటుంది.  అలాంటి అనుభూతినే కాళ్లకు కూడా ఇవ్వగలిగితే ఎలా ఉంటుంది? ఆ ఆలోచనలో నుంచి పుట్టినవే ఖద్దరు పాదరక్షలు. ట్రెండ్‌కు తగ్గట్టు ఈ మెటీరియల్‌తో ఎప్పటికప్పుడు వినూత్న ఉత్పత్తులను రూపొందించడంలో ‘కేవీఐసీ’ (ఖాదీ అండ్‌ విలేజ్‌ ఇండస్ర్టీస్‌ కమిషన్‌) ముందుంటోంది. అందులో భాగంగానే ఇటీవల ఈ ఖద్దరు చెప్పులను విడుదల చేసింది. 

ఆగ్రాలోని అతిపెద్ద షూ తయారీ కంపెనీ ‘దవార్‌’ ప్రస్తుతానికి 26 రకాల డిజైన్లలో ఇలాంటి పాదరక్షలు ఉత్పత్తి చేస్తోంది. ‘త్రిశూల్‌ గ్రూప్‌’ అధినేత శ్రుతీ కౌల్‌ డిజైన్‌ చేశారు. ‘ఇప్పటివరకు జనపనారతో చేసిన చెప్పులను ఎగుమతి చేసేవాళ్లం. ఇకపై ఈ ఖద్దరువి ట్రెండ్‌ సెట్టర్‌! వీటిని హ్యాండ్‌వాష్‌ కూడా చేసుకోవచ్చు. పెళ్లిళ్ల డ్రెస్‌కు ఖద్దరు బూట్లు సరిగ్గా సరిపోతాయి’ అంటారు శ్రుతి. ఈ ఎగుమతులకు మంచి డిమాండ్‌ వస్తుందనేది ‘దవార్‌’ సంస్థ అంచనా. ‘ఎందుకంటే... చేతితో నేసే ఖద్దరుకు విదేశాల్లో మంచి ఆదరణ ఉంది’ అంటారాయన. 


వాచీలూ ఉన్నాయి... 

ఖద్దరు చెప్పులంటే కొత్తగా ఉందేమో కానీ... ఇప్పటికే ‘ఖాదీ ఇండియా’ నుంచి ఖద్దరు వాచీలు వచ్చేశాయి. ప్రముఖ వాచీల బ్రాండ్‌ ‘టైటాన్‌’ ఈ ఏడాది ఆరంభంలో వీటిని లిమిటెడ్‌ ఎడిషన్‌గా మార్కెట్‌లోకి వదిలింది. ‘కేవీఐసీ’తో కలిసి ‘టైటాన్‌’ రూపొందించిన ఈ కలెక్షన్‌లో దేనికదే ప్రత్యేకం. మొట్టమొదటిసారిగా డయల్‌, స్ర్టాప్‌లను కూడా ఖద్దరుతో చేశారు. ఇవి ఎక్కువ కాలం మన్నేలా స్ట్రాప్స్‌కు కోటింగ్‌ ఉంటుంది. మగువలకు అలాగే మగవారికీ నప్పేలా రెండు రకాలలో దొరుకుతున్న వీటి ధర రూ.4995. 

వాచీల మాటెలా ఉన్నా... వాస్తవానికి ఫ్యాబ్రిక్‌తో పాదరక్షలు కొత్త విషయం కాదు. కాన్వాస్‌తో షూస్‌ కొరియా ఎప్పుడో తీసుకువచ్చింది. అమెరికాలోలో అయితే కొన్ని ఆన్‌లైన్‌ స్టోర్స్‌లో ఖద్దరు షూస్‌ అందుబాటులో ఉన్నాయి. ఒక సంస్థ ఆ ఉత్పత్తి వర్ణనలో ఖద్దరుకున్న ప్రత్యేకత, భారత స్వదేశీ ఉద్యమంలో దాని పాత్ర, మహాత్మాగాంధీ రాట్నంతో నూలు వడికిన విషయాలను గొప్పగా రాసుకొచ్చింది. 

‘ఖాదీ అండ్‌ విలేజ్‌ ఇండస్ర్టీస్‌ కమిషన్‌’ (కేవీఐసీ)ఈ ఖద్దరు చెప్పులను తొలిసారిగా అందుబాటులోకి తెచ్చింది. 


Updated Date - 2020-07-13T05:30:00+05:30 IST