పత్తిపై రాకాసి పురుగు దాడి

ABN , First Publish Date - 2021-08-06T06:41:05+05:30 IST

జిల్లాలో తొలిసారిగా 2017 పంట సీజన్‌ చివర్లో ఈ పురుగు కనిపించింది.

పత్తిపై రాకాసి పురుగు దాడి
పత్తి పొలాన్ని పరిశీలిస్తున్న శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు, ఏవో సురేష్‌ తదితరులు

 నందిగామ వ్యవసాయ డివిజన్‌లో 31,775 ఎకరాల్లో  పత్తి సాగు 

 40 నుంచి 55 రోజుల పంటనే ఆశిస్తోంది 

 గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రం 

కంచికచర్ల :  జిల్లాలో తొలిసారిగా 2017 పంట సీజన్‌ చివర్లో ఈ పురుగు కనిపించింది. అప్పటికే పంట చేతికి రావటంతో రైతులకు పెద్దగా నష్టం రాలేదు. 2018, 2019లో పురుగు జాడ లేదు. గత ఏడాది 2020 పంట సీజన్‌లో వంద రోజుల తర్వాత  పురుగు ఉధృతంగా వచ్చింది. 90 శాతం మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రైతులు  పత్తి సాగు గణనీయంగా తగ్గించారు. జిల్లాలో 1,14,525 ఎకరాల్లో పత్తి సాగైంది. నందిగామ వ్యవసాయ డివిజన్‌లోని కంచికచర్ల మండలంలో 7.625 ఎకరాల్లో,  నందిగామ మండలంలో 6,150ఎకరాల్లో,  చందర్లపాడు  మండలంలో 11,500 ఎకరాల్లో, వీరులపాడు మండలాల్లో  6,500  ఎకరాల్లో మొత్తం 31,775 ఎకరాల్లో  పత్తి సాగు చేశారు. 40 శాతం మంది రైతులు జూన్‌లో, మిగతా 60 శాతం మంది రైతులు జూలైలో సాగు చేశారు. జూన్‌లో  వేసిన పొలంపై మహమ్మారి పురుగు దాడి చేసింది. ప్రస్తుతం ఈ  చేలు పూత, పిందె దశకు చేరుకున్నాయి. పురుగు ఉధృతంగా కనిపిస్తోంది. పూత, పిందెలను కరకర నమిలేస్తున్నాయి. పిందెల్లోకి జోరబడి తినేస్తున్నాయి. కళ్ల ముందే పొలం నాశనమవుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఎకరానికి కౌలుతో కలుపుకుని 25 వేల రూపాయల వరకు పెట్టుబడి అయింది. వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు పొలాలను పరిశీలించి పలు సూచనలు చేసినా పురుగు అదుపులోకి వస్తుందన్న నమ్మకం లేదు. దీంతో ఏం  చేయాలో అర్థంకాక రైతులు సతమతమవుతున్నారు. దున్ని.. మరో పంట సాగు చేయటమే ఉత్తమమన్న అభిప్రాయాన్ని పలువురు రైతులు నుంచి వ్యక్తమవుతోంది. 


పురుగు ఇంకా ఉధృతం కావచ్చు..

కొద్ది రోజుల్లోనే గులాబీ రంగు పురుగు ఇంకా ఉధృతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు వాతావరణం కూడా అనుకూలంగా ఉందంటున్నారు. గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ వెంకటేశ్వరరావు, కంచికచర్ల మండల వ్యవసాయాధికారి రెంటపల్లి సురేష్‌ పలు గ్రామాల్లో  గురువారం పర్యటించి పత్తి పొలాలను  పరిశీలించారు. 40 నుంచి 55 రోజులు వయసున్న పొలాలను చేలను పురుగు ఆశించినట్టుగా గమనించారు.  గత ఏడాది అవశేషాలను సమూలంగా ధ్వంసం (తగలబెట్టనందున) చేయకపోవటంతో  ఆ సీజన్‌లో ఆశించిన పురుగు చావలేదన్నారు. అయితే 20 నుంచి 30 రోజులున్న లేత పొలాలకు కూడా ఈ పురుగు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పత్తిలో పురుగు ఉనికిని గమనించటానికి ఎకరానికి నాలుగు నుంచి పది లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలని సూచించారు. ఈ బుట్టల్లో రోజుకి ఎనిమిది రెక్కల పురుగులు పడితే ఉధృతి ఎక్కువగా ఉందని గుర్తించి, పురుగు మందులు పిచికారి చేయాలన్నారు. పది పువ్వులకు ఒక గుడ్డి పువ్వు ఉన్నా వేపనూనె లీటర్‌ లేదా క్లోరిపైరిఫాస్‌ 500 మి.లీ., లేదా తయోడికార్బ్‌ 200 గ్రాముల మందును ఎకరానికి పిచికారి చేయాలని సూచించారు. 


Updated Date - 2021-08-06T06:41:05+05:30 IST