బీడీ పరిశ్రమపై కోట్పా కొరడా

ABN , First Publish Date - 2022-08-09T05:49:19+05:30 IST

నాలుగు దశాబ్దాలుగా ఉపాధినిస్తున్న బీడీ పరిశ్రమ ప్రస్తుతం సంక్షోభంలో కూరుకుపోతుంది. దశాబ్ద కాలంగా ఒడిదుడుకులతో సాగుతున్న పరిశ్రమ ప్రభుత్వాల తీరుతో ప్రస్తుతం మూసివేత దిశగా పయనిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కోట్పా చట్టం బీడీ పరిశ్రమను ప్రశ్నార్థకంగా మార్చుతుంది.

బీడీ పరిశ్రమపై కోట్పా కొరడా

జిల్లాలోని 60 వేల మంది కార్మికులపై ప్రభావం 

ఇప్పటికే జీఎస్టీ వడ్డింపుతో సతమతం

యాజమాన్యం తీరుతో కార్మికుల వేతన దోపిడీ


దుబ్బాక, ఆగస్టు 8 : నాలుగు దశాబ్దాలుగా ఉపాధినిస్తున్న బీడీ పరిశ్రమ ప్రస్తుతం సంక్షోభంలో కూరుకుపోతుంది. దశాబ్ద కాలంగా ఒడిదుడుకులతో సాగుతున్న పరిశ్రమ ప్రభుత్వాల తీరుతో ప్రస్తుతం మూసివేత దిశగా పయనిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కోట్పా చట్టం బీడీ పరిశ్రమను ప్రశ్నార్థకంగా మార్చుతుంది. సిద్దిపేట జిల్లాలోని సుమారు 8 రకాల బీడీ పరిశ్రమల్లో పనిచేస్తున్న 60 వేల మంది కార్మికులు వీధిన పడే పరిస్థితి దాపురించింది. జిల్లాలో సుమారు 228 శాఖలలో పని చేస్తున్న వివిధ రంగాల కార్మికులు అయోమయంలోకి నెట్టవేయబడుతున్నారు. 


కోట్పా చట్టం ప్రభావం ఇలా..

ఇటీవల కేంద్ర ప్రభుత్వం సిగరేట్స్‌ అండ్‌ అదర్‌ టోబాకో ప్రొడక్ట్‌ యాక్టు(సీవోటీపీఏ)ను తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా ముడిసరుకు అయిన పొగాకు ఉత్పత్తుల ఎగుమతిపై రాజస్థాన్‌, గుజరాత్‌ ప్రభుత్వాలు నిషేధం విధించాయి. అంతేగాక బీడీ కట్టలను బహిరంగంగా పాన్‌షాపుల్లో, దుకాణాల్లో అమ్మడం నిషేధించింది. దీని మూలంగా పూర్తిగా బీడీల అమ్మకాన్ని కొనసాగించడం సాధ్యం కాదు. ఇదే సాకుగా పరిశ్రమను లాకౌట్‌ దిశగా నడిపించేందుకు ప్రేరేపించినట్లవుతుంది.


జీఎస్టీ పెంపుతో మరింత భారం

ఇప్పటికే బీడీ పరిశ్రమపై జీఎస్టీ పెంచడంతో కార్మికులపై అధిక భారం పడుతున్నది. గతంలో 18 శాతం తునికాకు మీద, 12 శాతం పొగాకు మీద జీఎస్టీ ఉండేది. ప్రస్తుతం తునికాను 28 శాతం, పొగాకును 18 శాతం పన్నులోకి తీసుకొచ్చింది. వీటి పెంపుతో కార్మికులకు సరైన వేతనం ఇవ్వలేని పరిస్థితి యాజమాన్యానికి కల్పించారు. అంతేగాక నాణ్యమైన తంబాకు, ఆకు ఇవ్వలేకపోవడంతో కార్మికుల వేతనంలో కోత పడుతున్నది.


వేతన అమలేది?

ప్రభుత్వ నిబంధనను అనుసరించి జీవో 41 ప్రకారం నెలసరి కనీస వేతనం రూ.23 వేల వరకు, తలసరి రోజుకు రూ.600 చొప్పున అందించాలి. అయితే ప్రభుత్వం చట్టాన్ని అమలు చేయకుండా, బీడీ పరిశ్రమపై అసలుకు ఎసరు పెట్టడంతో కార్మికులు అయోమయంలో పడుతున్నారు. ప్రస్తుతం పోరాడి సాధించుకున్న వేతనాలను కూడా అమలు చేయడంలేదు. యాజమాన్యంతో కుదుర్చుకున్న వేతన ఒప్పందం ప్రకారం మే 1 నుంచి పెరిగిన వేతనాలు అమలు కావాల్సి ఉంది. బీడీ ప్యాకర్లకు పాత వేతనంపైన రూ.2800 పెంచాల్సి ఉంది. నెలసరి ఉద్యోగులకు రూ.1500, టేకేదారులకు కమిషన్‌ రూ.15 నుంచి రూ.18 వరకు పెంచాల్సి ఉండేది. బీడీ కార్మికులకు వెయ్యి బీడీలకు రూ.3 చొప్పున, గతంలో ఉన్న రూ.218 నుంచి రూ.221 వరకు పెంచాల్సి ఉంది. అయితే రెండు నెలల నుంచి యాజమాన్యం కోట్పా చట్టాన్ని సాకుగా చూపి కార్మికుల పొట్టకొడుతుంది. మూడు నెలల ఏరియల్స్‌ ఎగవేతకు యాజమాన్యం పూనుకుంటుంది. టేకేదారులకు అందాల్సిన రూ.7.50 కోతపెట్టడంతో ఆభారాన్ని కార్మికులపై రుద్దుతున్నారు. సుమారు 2 వేల బీడీల నుంచి 2500 బీడీలను చాట్‌పేరుతో కోత విధిస్తున్నారు.


Updated Date - 2022-08-09T05:49:19+05:30 IST