వృద్ధ తల్లిని హింసించిన కొడుకుకు జరిమానా

ABN , First Publish Date - 2021-08-01T22:47:05+05:30 IST

వృద్ధురాలైన తల్లిని వేధిస్తూ, ఇంటి నుంచి వెళ్ళగొట్టేందుకు ప్రయత్నించిన

వృద్ధ తల్లిని హింసించిన కొడుకుకు జరిమానా

న్యూఢిల్లీ : వృద్ధురాలైన తల్లిని వేధిస్తూ, ఇంటి నుంచి వెళ్ళగొట్టేందుకు ప్రయత్నించిన కొడుకుపై పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తన తల్లి, మేనమామల నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఇది చాలా దురదృష్టకరమైన పిటిషన్ అని చెప్తూ, ఖర్చుల క్రింద రెండు నెలల్లోగా రూ.1 లక్ష చెల్లించాలని ఆదేశించింది. 


సన్నీ గోయల్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆయన తండ్రి రాజేశ్ గోయల్ తన భార్యకు వీలునామా రాశారు. 2013 నవంబరు 11న రాసిన ఈ వీలునామాలో తన వ్యాపారంలో 100 శాతం, ఇంటిలో 50 శాతం వాటాలను సన్నీ గోయల్‌కు రాశారు. ఇంటిలో మిగిలిన 50 శాతం వాటాను తన భార్యకు రాజేశ్ గోయల్ రాశారు. పిటిషనర్ సన్నీ గోయల్ నిజాయితీ లేకుండా తన తల్లి చేత తనకు అనుకూలంగా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) రాయించుకున్నారు. ఈ పిటిషన్‌ను వక్రబుద్ధితో దాఖలు చేశారని హైకోర్టు తెలిపింది. వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిని ఇంటి నుంచి వెళ్ళ గొట్టడానికి, ఆమె వాటాను అమ్మేయడానికి ఈ పిటిషన్‌ను ఆధారంగా చేసుకోవాలనే దుర్బుద్ధి కనిపిస్తోందని పేర్కొంది. పిటిషనర్ దురాశ, వక్రబుద్ధి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోనూ, ప్రస్తుత పిటిషన్‌లోనూ కనిపిస్తున్నాయని పేర్కొంది. ఖర్చుల క్రింద రూ.1 లక్ష చెల్లించాలని ఆదేశిస్తూ, పిటిషనర్ నుంచి ఈ సొమ్మును రెండు నెలల్లోగా రాబట్టాలని మొహాలీ, ఎస్ఏఎస్ నగర్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్‌ను ఆదేశించింది. ఆ సొమ్మును పిటిషనర్ తల్లికి అందజేయాలని ఆదేశించింది. 


Updated Date - 2021-08-01T22:47:05+05:30 IST