ఖర్చు తగ్గించిన కరోనా!

ABN , First Publish Date - 2020-11-28T07:35:25+05:30 IST

ఓ డివిజన్‌ నుంచి జాతీయ పార్టీ తరఫున ఓ అభ్యర్థి 2016 గ్రేటర్‌ ఎన్నికల బరిలో నిలిచారు. హంగూ ఆర్భాటాలు చేశారు.

ఖర్చు తగ్గించిన కరోనా!

ఈసారి ప్రచారాల్లో హంగూ ఆర్భాటాల్లేవ్‌

సినీ తారల తళుకు బెళుకులూ కరువు

నామినేషన్ల నుంచి సాదాసీదాగా ప్రచారం

కార్యకర్తల భోజనం ఖర్చులోనూ కోతలు

ముందు నుంచే ప్రారంభమైన ప్రలోభాలు

అపార్ట్‌మెంట్లు, అసోసియేషన్లకు స్వీట్లు

గంపగుత్త ఓట్లకు భారీ అగ్రిమెంట్లు


బంజారాహిల్స్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఓ డివిజన్‌ నుంచి జాతీయ పార్టీ తరఫున ఓ అభ్యర్థి 2016 గ్రేటర్‌ ఎన్నికల బరిలో నిలిచారు. హంగూ ఆర్భాటాలు చేశారు. సినీ తారల తళుక్కులతో ప్రచారం నిర్వహించారు. ఎక్కడ ప్రచారానికి వెళ్లినా కాన్వాయ్‌లో కనీసం పదికి తక్కువ కాకుండా వాహనాలు పెట్టారు. ఎల్‌ఈడీ హోర్డింగ్‌లు, బ్యానర్లకు కొదవ లేదు. కేవలం ప్రచారం కోసమే ఆయన 30 లక్షలుపైగా ఖర్చు చేశారు. ఈసారి అదే అభ్యర్థి మరోసారి గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రధానపార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.

గత ఎన్నికల మాదిరిగా ఈసారి హంగూ ఆర్భాటాలు లేవు. కేవలం రెండు వాహనాలు.. అందులో పది మంది కార్యకర్తలతోనే ప్రచారం జరిగిపోతోంది. తారల తళుకు బెళుకుల జోలికీ వెళ్లలేదు. అవసరమున్నచోట మాత్రమే బ్యానర్లు పెట్టారు. ఎల్‌ఈడీ ఊసే లేదు. దీంతో ఖర్చు పూర్తిగా తగ్గిపోయింది. గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రచార తంతు రెండు రోజుల్లో ముగియనుంది. అభ్యర్థులు కూడా కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇందుకు కారణం.. కరోనా కారణంగా ఖర్చు కలిసి రావడమే.


2016 గ్రేటర్‌ ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి ప్రచార ఖర్చు భారీగా తగ్గిందని వివిధ పార్టీల సీనియర్‌ నేతలు చెబుతున్నారు. కరోనా కారణంగా హడావుడి చేయడం లేదు. రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో రియల్‌ ఎస్టేట్‌ కుదేలైంది. దాంతో, అభ్యర్థులు ఖర్చుకూ వెనకాడుతున్నారు. దీనికితోడు, కార్పొరేటర్లకు ప్రత్యేక నిధులు కేటాయించలేదని, భారీగా ఖర్చు చేసినా ఒరిగేది ఏమీ లేదని అభ్యర్థులు నిర్ధారణకు వచ్చారని తెలిపారు. వెరసి, ప్రచార సామగ్రి నుంచి ర్యాలీలు, భోజనాల వరకు ఎన్నికల ఖర్చును బాగా తగ్గించేశారు.



నామినేషన్ల నుంచే..

ప్రధాన పార్టీ అభ్యర్థులంతా నామినేషన్‌ను ప్రచారాస్త్రంగా ఉపయోగించుకునేవారు. భారీ ర్యాలీలు, గుర్రాల స్వారీలు, కళాకారుల నృత్యాలు.. ఇలా ఒకటేంటి అవకాశం ఉన్నంతమేర హంగూ ఆర్భాటాలు చేసేవారు. కేవలం నామినేషన్‌ ర్యాలీ కోసం రూ.10-15 లక్షలు ఖర్చు చేసిన దాఖలాలు లేకపోలేదు. ఈసారి మెజారిటీ అభ్యర్థులు సాదాసీదాగా నామినేషన్లు వేశారు. 


కక్కా ముక్కాలోనూ కోత

ప్రచారానికి వెళ్లేటప్పుడు గతంలో 50 నుంచి వందమంది వరకూ బస్తీలోకి వెళ్లేవారు. ఇప్పుడు ఈ సంఖ్య సగానికి పడిపోయింది. కరోనా కారణంగా కార్యకర్తలు ఎవరి ప్రాంతాల్లో వారే ప్రచారం చేసుకోవాలని అభ్యర్థులు ముందే సూచించారు. కార్యకర్తలకు మధ్యాహ్నం, రాత్రి భోజనం విషయంలో కూడా అభ్యర్థులు కాస్త తగ్గారు. గతంలోలా ప్రతిరోజూ మాంసాహారం కాకుండా రెండు మూడు రోజులకోసారి మటన్‌, చికెన్‌ పెడుతున్నారు.


2016లో ఒక్కో అభ్యర్థి ప్రతిరోజు కనీసం వెయ్యి మందికి వంట చేయించాల్సి వచ్చేది. ఇప్పుడు 200 మందితో సరిపెడుతున్నారు. కొందరు కార్యకర్తలు కూడా కరోనా భయానికి ఇంటి వద్ద తినేందుకు మొగ్గు చూపిస్తుండటంతో అభ్యర్థుల ఖర్చులు మరింత తగ్గాయి. ఎన్నికల్లో మాస్‌ ఓటర్లను ఆకట్టుకునేందుకు గతంలో పార్టీలన్నీ సినీ గ్లామర్‌ను వినియోగించుకునేవి. చిన్నస్థాయి నటుల నుంచి బడా హీరోల వరకు ఎంతో కొంత చెల్లించి బస్తీల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించేవి. భారీ రోడ్డు షోలు ఏర్పాటు చేసేవి. వీటికి 20 లక్షలకుపైగా ఖర్చయ్యేది. సభకు వచ్చే వారికి రోజుకు ఏడు వందలకుపైగా ఇచ్చేవారు. కరోనా భయంతో తారలు ఇళ్లు వదిలి బయటకు రావడం లేదు. 




ఓటర్ల డిమాండ్‌... 2000

ఇప్పటికే వరదల కారణంగా తాము తీవ్రంగా నష్టపోయామని, రూ.2వేల నోటు ఇస్తేనే ఓటు వేస్తామని కొందరు ఓటర్లు డిమాండ్‌ చేస్తున్నారు. కూకట్‌పల్లి పరిధిలోని ఓ అభ్యర్థికి ఈ పరిస్థితి ఎదురవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు. ఉన్న ఫళంగా సొంత భవనాన్ని అమ్మకానికి పెట్టినట్లు తెలిసింది. పోటీలో ఉన్న చాలామంది అభ్యర్థులు గంపగుత్త ఓట్లకే  ప్రాధాన్యమిస్తున్నారు. 




ఖరీదైన స్వీటు.. రెండు వేల నోటు!

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రచారం సందర్భంగా తగ్గించిన ఖర్చును కొంతమంది అభ్యర్థులు ప్రలోభాలకు ఉపయోగిస్తున్నారు. ఈసారి నోటు తీసుకునే వారికి నోటు.. మిగిలిన వారికి స్వీటు పద్ధతిని పాటిస్తున్నారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, వెంకటేశ్వర కాలనీ, మాదాపూర్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి, అమీర్‌పేట, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లోని  ఓటర్లకు టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు రూ.1000-1500 వరకూ ఖరీదు కలిగిన స్వీట్లను ఇస్తున్నారు. కొంతమందికి  రూ.2వేల వరకూ విలువైన మద్యం బాటిల్‌ను కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది.


కాగా, స్వీట్ల పంపిణీలో బీజేపీ కంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే ముందున్నట్లు సమాచారం. ఒక్కో డివిజన్‌ పరిధిలో ఇప్పటికే 20వేల మంది ఓటర్లకు స్వీట్లు పంపిణీ  చేసినట్లు తెలిసింది. మరోవైపు, మురికివాడలు, బస్తీలు, కాలనీల ప్రజలకు నేరుగా రూ.2 వేల నోటు ఇస్తున్నారు. ఇంట్లో 5 ఓట్లు ఉంటే ఏకంగా రూ.10వేలు ఇస్తున్నారు. వరద సాయం కూడా ఇప్పిస్తామని ప్రమాణాలు చేస్తున్నారు.


కాగా, నగదు పంపిణీని కొంతమంది నాయకులకు అప్పగిస్తుండగా, వారు రూ.1000 తీసుకుని మిగతా రూ.1000మాత్రమే ఓటర్లకు ఇస్తున్నట్లు తెలిసింది. మూసాపేటలో ఇలాంటి ఘటన జరగడంతో పంపిణీ బాధ్యతను వేరే వారికి అప్పగించారు.


Updated Date - 2020-11-28T07:35:25+05:30 IST