విశ్వ కీర్తి

ABN , First Publish Date - 2021-11-18T09:26:59+05:30 IST

హైదరాబాద్‌కు నలభైఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చేనేత గ్రామం పోచంపల్లికి ప్రపంచస్థాయి గుర్తింపు దక్కడం సంతోషం కలిగించే వార్త. ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్-యూఎన్ డబ్ల్యుటీవో) పోచంపల్లిని...

విశ్వ కీర్తి

హైదరాబాద్‌కు నలభైఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చేనేత గ్రామం పోచంపల్లికి ప్రపంచస్థాయి గుర్తింపు దక్కడం సంతోషం కలిగించే వార్త. ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్-యూఎన్ డబ్ల్యుటీవో) పోచంపల్లిని ప్రపంచ పర్యాటక గ్రామాల్లో ఒకటిగా గుర్తించడంతో ఇప్పటికే మంచిపేరున్న ఈ గ్రామం కీర్తి మరింత ప్రపంచవ్యాప్తమవుతుంది. ప్రపంచ పర్యాటక సంస్థ డిసెంబరు 2న జరుపుకోబోతున్న 24వ సర్వసభ్య సమావేశంలో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. గ్రామీణ పర్యాటకాన్ని పెంచడం, అక్కడి ప్రజల జీవనశైలిని ప్రపంచానికి పరిచయం చేయడం ఇత్యాది ఉద్దేశాలతో డబ్ల్యూటీవో ప్రతిపాదించిన ‘బెస్ట్ టూరిజం విలేజ్’గుర్తింపునకు 159 దేశాలనుంచి ప్రతిపాదనలు వెళ్ళాయి. ప్రతీదేశమూ మూడింటిని ప్రతిపాదించింది. కేంద్రపర్యాటకశాఖ పోచంపల్లితో పాటు, మధ్యప్రదేశ్‌లోని లత్పురాఖాస్, మేఘాలయలోని కాంగ్ థాంగ్ గ్రామాలను సెప్టెంబరులో నామినేట్ చేసింది. ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తింపు పొందిన పోచంపల్లిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని నిధుల కేటాయింపుతో తీర్చిదిద్దితే విదేశీయుల రాకపోకలు ఇంకా పెరిగి అది ఖండాంతర ఖ్యాతి గడిస్తుంది. 


సమున్నత సాంస్కృతిక వారసత్వం, ఘనచరిత్రా గల గ్రామం ఇది. అరబ్ దేశాలకు గాజులు, పూసలు ఎగుమతి చేసిన కాలంలో గాజుల పోచంపల్లిగా పేరొందింది. స్వాతంత్ర్యం అనంతరం వినోబాభావే భూదానోద్యమానికి పునాదిగా నిలచి,  వెదిరె రామచంద్రారెడ్డి వంద ఎకరాల భూదానంతో దేశవ్యాప్తంగా ఆ ఉద్యమం ఉవ్వెత్తున సాగేట్టు చేసి భూదాన్ పోచంపల్లిగా చరిత్రలో చిరస్థాయిగా నిలబడింది. గ్రామమే అయినా సిల్క్ సిటీగా గుర్తింపు పొందిన భూదాన్ పోచంపల్లి చుట్టూ కొండలూ, చెట్లు, పొలాలు, అందమైన పార్కులు, చేనేత వస్త్రాల కొనుగోలు కోసం వచ్చే ప్రజలతో నిత్యమూ కళకళలాడుతూనే ఉంటుంది. ఇక్కత్ శైలికి ప్రసిద్ధిచెందిన ఇక్కడి చేనేత కళాకారుల పనితనానికి 2004లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) గుర్తింపు వచ్చి మరింత ప్రఖ్యాతి పొందింది. ఇప్పటి కొత్త గౌరవం దానిని పర్యాటక కల్పవల్లిగా తీర్చిదిద్దేందుకు ఉపకరిస్తుంది.  ఆంధ్రప్రదేశ్‌లో పొందూరు, ఉప్పాడ, వెంకటగిరి, మంగళగిరి, పెడన ఇలా ఆయా ప్రత్యేకతలతో ప్రసిద్ది చెందిన అనేక వస్త్ర తయారీ కేంద్రాలున్నాయి. తెలంగాణలో పోచంపల్లితోపాటు గద్వాల, కొండాపూర్, కొత్తపల్లి, భువనగిరి వంటివనేకం అద్భుత నైపుణ్యాలకు ప్రసిద్ధిచెందాయి. అందమైన వస్త్రాలు నేసే నేతన్నల కష్టనష్టాలకు, వారి దుర్భరమైన జీవితాలకు మల్లేశం సినిమా అద్దం పడుతుంది. ఘనమైన చేనేత మరమగ్గాలు వచ్చిన తరువాత నాటి ప్రాభవాన్ని కోల్పోయి, నేత కార్మికుల జీవితాలు నేలచూపులు చూడటం  మొదలైంది. చీరలు, స్కూలు డ్రస్సుల తయారీ వంటివి అదనంగా అప్పగిస్తూ కార్మికులకు కాస్తంత ఉపాధి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తమవంతుగా ప్రయత్నిస్తున్నాయి. నేతన్నకు ఆర్థికంగా చేయూతనిచ్చే ఏవేవో పథకాలూ అమలు జరుగుతున్నాయి. తాము ఎంత ప్రార్థిస్తున్నా కేంద్రం తనవంతు సహాయసహకారాలు అందించడం లేదన్న విమర్శలూ రాష్ట్రాల నుంచి వినిపిస్తున్నాయి. ఎన్నికల కాలంలో నేతన్న కేంద్రంగా నడిచే రాజకీయమూ తక్కువేమీ కాదు. 


పూర్వకాలంలోలాగా సాంప్రదాయక మగ్గాల మీద సాధారణ వస్త్రాలు నేస్తూ వేలాదిమంది తమ జీవితాలను కొనసాగించగలిగే రోజులు కావివి. చేనేత ద్వారా ప్రత్యేక కోవకు చెందిన మేలురకమైన వస్త్రాలను తయారుచేయడం, ఉన్నత ఆదాయవర్గాలవారినీ వారి అభిరుచులనూ అవసరాలనూ దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగినప్పుడు ఆ నైపుణ్యాలు దీర్ఘకాలం నిలబడే అవకాశం ఉన్నది. ప్రత్యేకతలకు మరిన్ని పరిశోధనలు తోడైనప్పుడు ఉత్పత్తి మెరుగుపడుతుంది. సాంప్రదాయిక నైపుణ్యాలనూ ఆధునిక అవసరాలనూ సరైన రీతిలో మేళవించగలిగినప్పుడు ఈ కళ కలకాలం నిలబడుతుంది.

Updated Date - 2021-11-18T09:26:59+05:30 IST