ముడతలు వీడి.. మచ్చలు తొలగి.. అందంగా కనిపించాలంటే!

ABN , First Publish Date - 2022-03-22T19:15:57+05:30 IST

అద్దంలో మన ప్రతిబింబం ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ఉండాలి. అందుకు ముడతలు, అవాంఛితరోమాలు, మచ్చలు లాంటి అదనపు ఇబ్బందులు అడ్డు పడుతుంటే,

ముడతలు వీడి.. మచ్చలు తొలగి.. అందంగా కనిపించాలంటే!

ఆంధ్రజ్యోతి(22-03-2022)

అద్దంలో మన ప్రతిబింబం ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ఉండాలి. అందుకు ముడతలు, అవాంఛితరోమాలు, మచ్చలు లాంటి అదనపు ఇబ్బందులు అడ్డు పడుతుంటే, వాటిని వదిలించుకునే మార్గాలను ఎంచుకోవాలి. ఇందుకు తోడ్పడేవే కాస్మటిక్‌ ప్రొసీజర్స్‌. సురక్షితమైన, విశ్వసనీయమైన ఆ సౌందర్య చికిత్సల గురించి తెలుసుకుందాం! 


పెరిగే వయసు, కాలుష్యం, జీవనశైలి... 

ఇలా లెక్కలేనన్ని అంశాలు మన చర్మ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తూ ఉంటాయి. కళ్ల కింద వలయాలు, చర్మం సాగడం, ముడతలు ఏర్పడడం మూలంగా స్ర్టెచ్‌ మార్క్స్‌, రింకిల్స్‌.. ఇవన్నీ ఏదో ఒక సమయంలో అందర్నీ వేధించేవే! వీటితో ఆత్మన్యూనతకు లోనయ్యే బదులు, అందుబాటులో ఉన్న సౌందర్య చికిత్సలతో సులువుగా తొలగించుకునే వీలుంది.


డబుల్‌ చిన్‌ మటుమాయం

డబుల్‌ చిన్‌కు మెడి ఫేసియల్‌తో చక్కని ఫలితం దక్కుతుంది. ఇది చేతుల మర్దనతో సాగే సాధారణ ఫేసియల్‌ కాదు. వైద్య చికిత్స లాంటిది. యాంటీ ఏజింగ్‌ మెడి ఫేసియల్‌తో మొటిమల మచ్చలు, పిగ్మెంటేషన్‌తో పాటు డబుల్‌ చిన్‌ను తొలగించుకోవచ్చు. మెడి ఫేసియల్‌లో భాగంగా అల్‌ థెరపీ ట్రీట్మెంట్‌, థర్మల్‌ మాస్క్‌లను ఉపయోగించడం జరుగుతుంది. అలాగే మీసో థెరపీ సొల్యూషన్‌ను ఉపయోగించి, మైక్రో నీడ్లింగ్‌ ట్రీట్మెంట్‌ ద్వారా కూడా డబుల్‌ చిన్‌ను తొలగించుకోవచ్చు. ఈ సొల్యూషన్‌ను గడ్డం దిగువన ఉండే డబుల్‌ చిన్‌లో ఇంజెక్ట్‌ చేయడం వల్ల క్రమేపీ కొవ్వు కణాలు కరిగి, డబుల్‌ చిన్‌ తగ్గిపోతుంది. కొవ్వు కరగడంతో పాటు, ఆ ప్రదేశంలోని చర్మం బిగుతుగా కూడా మారుతుంది. అయితే ప్రొసీజర్‌ తదనంతరం కొన్ని ముఖ వ్యాయామాలు చేయడంతో పాటు, కొన్ని సీరమ్‌లను ఉపయోగించవలసి ఉంటుంది. 


కళ్ల కింద నలుపు 

దీన్ని పెరి ఆర్బిటల్‌ పైపర్‌ పిగ్మెంటేషన్‌ అంటారు. దీన్ని కెమికల్‌ పీల్స్‌తో, కొన్ని క్లినికల్‌ సొల్యూషన్స్‌తో తొలగించుకోవచ్చు. వీటిని అప్లై చేసి, కొన్ని నిమిషాల తర్వాత, తొలగించడం జరుగుతుంది. కళ్ల నలుపు తీవ్రతను బట్టి అవసరమైన పీల్‌ను ఎంచుకోవలసి ఉంటుంది. అలాగే డెర్మాఫ్రాక్‌ మైక్రో ఛానెలింగ్‌ ట్రీట్మెంట్‌లో భాగంగా ఐదు రకాల సీరమ్స్‌లను ఉపయోగించి కళ్ల కింది నలుపును తొలగించవచ్చు. ఈ ప్రక్రియలో0.25 మిల్లీమీటర్ల సన్నని నీడిల్స్‌ను ఉపయోగించి, సీరమ్‌లను చర్మం అడుగుకి ఇంజెక్ట్‌ చేయడం వల్ల, కళ్ల కింద నలుపు 60ు మేరకు తగ్గుతుంది. నాలుగు సెషన్లలో ఈ ప్రక్రియను ముగించవచ్చు.


ముడతలు, గీతలు

కొందరికి నవ్వినప్పుడు కళ్ల చివర్లలో, పెదవుల చివర్లలో ముడతలు, గీతలు పడుతూ ఉంటాయి. ఇలాంటి క్రోస్‌ ఫీట్‌, లాఫింగ్‌ లైన్లను లేజర్‌ చికిత్సతో తొలగించుకోవచ్చు. ఇది విడతల వారీగా చేపట్టే చికిత్స. లైన్లు, ముడతలు క్రమేపీ తగ్గడానికి కొన్ని సెషన్ల చికిత్సను అనుసరించవలసి ఉంటుంది. ఒకవేళ తక్షణ ఫలితం కావాలనుకుంటే, బొటాక్స్‌ ఇంజెక్షన్లను తీసుకోవచ్చు. 


స్ట్రెచ్‌ మార్క్స్‌

చర్మం సాగినా, కుంచించుకుపోయినా ఆ ప్రదేశంలో స్ట్రెచ్‌ మార్క్స్‌ ఏర్పడతాయి. లావుగా ఉన్నవాళ్లు హఠాత్తుగా బరువు తగ్గినా, సన్నగా ఉన్నవాళ్లు బరువు పెరిగినా ఈ మచ్చలు ఏర్పడతాయి. చర్మం అడుగున కొల్లాజెన్‌ తగ్గినా ఇలాగే జరుగుతుంది. అయితే ఇలాంటి మచ్చలకు పిఆర్‌పి చికిత్స సత్ఫలితాన్ని ఇస్తుంది. రక్తం నుంచి గ్రోత్‌ ఫ్యాక్టర్లను వేరు చేసి, తిరిగి వాటిని  మైక్రో ఛానెలింగ్‌ లేదా ఇంజెక్షన్ల ద్వారా చర్మంలోకి ఇంజెక్ట్‌ చేయడం జరుగుతుంది. ఈ చికిత్సతో పాటు లేజర్‌ ట్రీట్మెంట్‌తో రెండు నుంచి మూడు సెషన్లలోనే ఎంతో మంచి ఫలితం కనిపిస్తుంది. అయితే చర్మ తత్వం మీద ఫలితం ఆధారపడి ఉంటుంది. కొందరికి నూటికి నూరు శాతం మచ్చలు మటుమాయమైతే, మరికొందరికి 80 నుంచి 90ు మచ్చల తీవ్రత తగ్గుతుంది. కొందరు చికిత్స అనంతరం చర్మానికి పూసుకునే లోషన్లను వాడుకోవలసి ఉంటుంది. అలాగే కొన్ని క్లినికల్‌ కాన్‌సెంట్రేట్స్‌లను అప్లై చేసి, ఆ తర్వాత మైక్రో నీడ్లింగ్‌ చేసినప్పుడే స్ట్రెచ్‌ మార్క్స్‌ తగ్గుతాయి. స్ట్రెచ్‌ మార్క్‌లు తాజావి అయితే ఈ చికిత్సలో దేన్ని ఎంచుకున్నా మెరుగైన ఫలితాలు దక్కుతాయి. మచ్చలు పాతబడే కొద్దీ అవి కొంత మొండిగా మారి, లోతైన చికిత్సలు అవసరపడతాయి. కాబట్టి చర్మ తత్వాన్ని బట్టి, మచ్చల వయసునుబట్టి తగిన చికిత్సను ఎంచుకోవలసి ఉంటుంది. 


యాంటీ ఏజింగ్‌ కోసం...

పైబడే వయసుతో చర్మం సాగే గుణాన్ని కోల్పోతుంది. దాంతో ముడతలు ఏర్పడతాయి. వీటిని తొలగించడం కోసం మీసో థెరపీ, పిఆర్‌పి చికిత్స, థర్మాఫ్రాక్‌ చికిత్సలో భాగంగా రెజ్యువనేట్‌ సీరంతో మైక్రో ఛానెలింగ్‌ లాంటి చికిత్సలను ఎంచుకోవచ్చు. డెర్మా పెన్‌ లేదా డెర్మా రోలర్‌తో ఈ చికిత్సలను అందించడం జరుగుతుంది. అలాగే థర్మల్‌ మాస్క్‌లు, అల్‌ థెరపీ ప్రొసిజర్‌, లేజర్‌ స్కిన్‌ రెజ్యువనేషన్‌ మొదలైన చికిత్సలను ఎంచుకోవచ్చు. డయోడ్‌ లేజర్‌ను అవాంఛిత రోమాలను, గోధుమ రంగు మచ్చలను తొలగించడానికి ఉపయోగిస్తారు. మొటిమల మచ్చలు, పిగ్మెంటేషన్‌, యాంటీ ఏజింగ్‌, సర్జరీ మచ్చలు, స్ట్రెచ్‌ మార్క్‌లకు మరొక భిన్నమైన లేజర్‌లను కాస్మటాలజి్‌స్టలు ఉపయోగిస్తారు. 


వెంట్రుకలు ఊడుతుంటే...

విపరీతంగా వెంట్రుకలు ఊడడం, బట్టతల (ఆండ్రోజెనిక్‌ అలోపేసియా), జన్యుపరంగా బట్టతల సమస్య తలెత్తిన వాళ్లకూ, అలోపేసియా ఏరేటా ఉన్నవాళ్లకు పిఆర్‌పి అలా్ట్ర చికిత్సతో ఆ సమస్యలను సరిదిద్దవచ్చు. పిఆర్‌పి అలా్ట్రతో పిఆర్‌పిని మించిన మరింత మెరుగైన ఫలితాన్ని సాధించవచ్చు. సాధారణ పిఆర్‌పితో పోలిస్తే, పిఆర్‌పి అలా్ట్రలో 90ు నాణ్యతతో కూడిన గ్రోత్‌ ఫ్యాక్టర్‌ను సంగ్రహించే వీలుంటుంది. కాబట్టి ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయి.


అవాంఛిత రోమాలకు...

డయోడ్‌ లేజర్లతో అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు. మరే ఇతర లేజర్లతో శాశ్వత పరిష్కారం దక్కదు. లేజర్‌ చికిత్స చేయించుకున్న రెండు, మూడేళ్ల తర్వాత కొందర్లో తిరిగి రోమాలు పెరగడం మొదలవుతుంది. ఇందుకు ఆరోగ్య కారణాలను అన్వేషించవలసి ఉంటుంది. థైరాయిడ్‌, పీసీఓడి, గర్భధారణ మొదలైన పరిస్థితుల్లో అవాంఛిత ప్రదేశాల్లో రోమాలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, లేజర్‌ చికిత్స తీసుకున్న వాళ్లలో ఆ పెరుగుదల చాలా తక్కువగా ఉండే వీలుంది. అలాగే లేజర్‌ చికిత్స సక్రమంగా తీసుకోకపోయినా రోమాలు తిరిగి పెరుగుతాయి. ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే డయోడ్‌ లేజర్‌ను ఎంచుకోవాలి. ఈ చికిత్సకు కనీసం 8 సిట్టింగ్స్‌ పట్టవచ్చు. ప్రతీ సిట్టింగ్‌కూ రోమాలు సన్నబడుతూ, వాటి పరిమాణం క్రమేపీ తగ్గిపోతుంది. అయితే లేజర్‌ చర్మంలోని మెలనిన్‌ ప్రధానంగా పని చేస్తుంది. కాబట్టి ఈ చికత్సలో నలుపు రంగులోని అవాంఛిత రోమాలనే తొలగించే వీలుంటుంది. తెల్లని వెంట్రుకలకు లేజర్లు పని చేయవు. 

చర్మం సాగినా, కుంచించుకుపోయినా ఆ ప్రదేశంలో స్ట్రెచ్‌ మార్క్స్‌ ఏర్పడతాయి. లావుగా ఉన్నవాళ్లు హఠాత్తుగా బరువు తగ్గినా, సన్నగా ఉన్నవాళ్లు బరువు పెరిగినా ఈ మచ్చలు ఏర్పడతాయి. చర్మం అడుగున కొల్లాజెన్‌ తగ్గినా ఇలాగే జరుగుతుంది. అయితే ఇలాంటి మచ్చలకు పిఆర్‌పి చికిత్స సత్ఫలితాన్ని ఇస్తుంది. 


డాక్టర్‌ దివ్యా విశ్వనాథ్‌

ఈస్థటిక్‌ అండ్‌ స్కిన్‌కేర్‌ 

కాస్మటాలజిస్ట్‌,

డాక్టర్‌ రమేష్‌ డెర్మాటిక్‌, 

హైదరాబాద్‌.


Updated Date - 2022-03-22T19:15:57+05:30 IST