దాదా.. దందా..

ABN , First Publish Date - 2022-01-29T06:29:34+05:30 IST

దాదా.. దందా..

దాదా.. దందా..
ఫ్లాట్‌ఫాం ఆక్రమించి కొత్తగా వెలిసిన చెరుకు రసం బళ్లు

లెనిన్‌ సెంటర్‌పై వాలిన బీసెంట్‌ రోడ్డు గద్దలు

అధికార పార్టీ మాటున అడ్డగోలు ఆక్రమణలు

చిరు వ్యాపారులకు అద్దెకిచ్చి భారీగా వసూళ్లు

కాల్‌మనీ కేటుగాళ్లతో హాకర్లకు అప్పులు

ఆనక ముక్కు పిండి వసూళ్లు

కులం, సంఘం గుర్తింపు కార్డులతో హల్‌చల్‌

అగ్రనేత అండతో దోచుకుంటున్న యువనేత


చిన్న స్టాల్‌ నడుపుకొనే స్థాయి నుంచి బీసెంట్‌ రోడ్డు, లెనిన్‌ సెంటర్‌ను శాసించే స్థాయికి ఎదిగిన అధికార పార్టీ యువ నాయకుడతడు. అధికారంలో ఉన్నా లేకున్నా ఓ నేత వ్యక్తిగత పనులు చేస్తూ పర్సనల్‌ అయ్యాడు. భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టిస్తూ మెప్పు సంపాదించాడు. అధినాయకుడి పార్టీ అధికారంలోకి రావడంతో అదుపు తప్పాడు. పేదల అవసరాలు ఆసరాగా దందాలతో దాదాగా మారాడు. ఇంకేముంది పార్టీ, సంఘం, సామాజికవర్గం పేరుతో ఐడీ కార్డులు వచ్చిపడ్డాయి. క్రిమినల్‌ చరిత్ర కనుమరుగై క్లీన్‌ చరిత్ర దరిచేరింది. కాల్‌మనీ కేటుగాళ్లతో కుమ్మక్కై పేదల శ్రమను దోచుకుంటున్నాడు. లెనిన్‌సెంటర్‌ వేదికగా దాదా సాగిస్తున్న అక్రమ దందాలు నేడు పతాకస్థాయికి చేరాయి. 

గవర్నర్‌పేట : బీసెంట్‌ రోడ్డు, లెనిన్‌ సెంటర్‌ ప్రాంతాల్లో రోడ్డు మీద వ్యాపారం చేసుకుని పొట్ట నింపుకుందామని వచ్చే పేదలే దాదా టార్గెట్‌. వీరికి స్థలం ఇప్పించడం, కాల్‌మనీ వ్యాపారుల నుంచి అప్పు ఇప్పించి తోపుడు బళ్లు కొనిపించడం, చెట్టు పేరిట కరెంట్‌ కనెక్షన్‌ ఇప్పించటం వెంటవెంటనే జరిగిపోతాయి. తనకు కట్టాల్సిన అద్దె కోసం మరోసారి కాల్‌మనీ వ్యాపారి నుంచి అప్పు ఇప్పించి, రోజూ చీటీ కట్టేలా చేయడం ఇక్కడ నిత్యం జరుగుతున్న తంతు. కాల్‌మనీ జలగల చేతిలో చిక్కుకుపోయిన పేదలు సంపాదించిన దానిలో అగ్రభాగాన్ని ఈ దాదాకే సమర్పించుకుంటున్నారు. 

వాసాలకు, చెట్లకూ కరెంట్‌ మీటర్లు

మొబైల్‌ తోపుడు బళ్లు బీసెంట్‌ రోడ్డు, లెనిన్‌ సెంటర్‌ను టచ్‌ చేస్తే రోజుకు రూ.150 చెల్లించుకోవాలి. అడ్డాలో అడుగు పెడితే కప్పం కట్టాలి. వెళ్లిపోతామని బతిమాలుకున్నా వదలరు. వినకుంటే తనకు రోజువారీ కప్పం కట్టే స్థానిక చిరు వ్యాపారులతో గొడవ చేయిస్తాడు. బీసెంట్‌ రోడ్డులో ఆక్రమణలకు చోటు మిగలకపోవడంతో కన్ను లెనిన్‌ సెంటర్‌పై పడింది. ఏళ్లుగా రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకునే వారిని తమ పార్టీవారు కాదనే సాకు చూపించి, వెళ్లగొట్టి, కొత్తవారికి లీజుకు ఇస్తున్నాడు. తనవైపునకు వచ్చిన పాతవారిని రోజువారీ కప్పం కట్టేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నాడు. ఇంటికి కనెక్షన్‌ ఇవ్వడానికి అనేక పత్రాలు తీసుకునే విద్యుత్‌ శాఖ అధికారులు యువనాయకుడి సిఫార్సుతో చెట్టు, వాసాలకు కూడా కనెక్షన్లు ఇచ్చేస్తున్నారు. 

పోలీసు సబ్‌ కంట్రోల్‌ రూమ్‌నూ వదలక.. 

లెనిన్‌ సెంటర్‌ గతంలో ధర్నాలకు వేదికగా ఉండటంతో నగర పోలీసులు సబ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ధర్నా సెంటర్‌ను ఇక్కడి నుంచి అలంకార్‌ థియేటర్‌వైపు మార్చడంతో ఈ ఖాళీ స్థలం ఏర్పడింది. ఆటో కార్మికులు దాన్ని స్టాండ్‌గా ఏర్పాటు చేసుకున్నారు. వారిని కూడా అక్కడి నుంచి వెళ్లగొట్టి మార్కింగ్‌ వ్యాపారం మొదలుపెట్టారు దాదా అనుచరులు. పోలీసు సబ్‌ కంట్రోల్‌ రూమ్‌ ముందు కూడా ఆక్రమించి స్థలాన్ని అద్దెకు ఇచ్చాడు. పోలీసులే తనను ఏమీ చేయలేరనే బిల్డప్‌ ఇక్కడి వ్యాపారుల్లో కల్పించాడు. లెనిన్‌ సెంటర్‌లో హాకర్ల మధ్య తగాదాలు తలెత్తితే పోలీసు స్టేషన్‌లో సెటిల్‌మెంట్‌ చేసే స్థాయికి ఎదగడంతో వీధి వ్యాపారులు యువనాయకుడి చెంత చేరిపోయారు. తన ఫొటో లేకుండా సొంత పార్టీ నేతలు బ్యానర్లు కట్టినా వాటిని చింపించే ఏర్పాట్లు చేసుకున్నాడు. 

సంఘం, కులమే కవచాలు

చిరు వ్యాపార సంఘాల్లో, కుల సంఘాల్లో పదవులు సంపాదించాడు ఈ దాదా. ట్యాగ్‌లు, ఐడీలు తగిలించుకోవడంతో అధినాయకుడి వద్ద పరపతి పెరిగింది. కులం కార్డు, సంఘ ఐడీ కవచాలుగా చెలరేగిపోతున్న యువ నాయకుడు ఆగడాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టి కోర్డుకు ఈడుస్తా.. అంటూ బెదిరిస్తున్నారు.

భవన నిర్మాణాల్లోనూ భారీగా..

గవర్నర్‌పేట ప్రాంతంలో ఎవరైనా ఇళ్లు నిర్మించుకోవాలంటే యువ నాయకుడిని సంప్రదించాలి. కొత్తగా పార్టీలో చేరి, స్థానిక సంస్థల ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుని, భంగపడిన నాయకుడిని వెంట బెట్టుకుని ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్మాణం అక్రమమైనా, సక్రమమైనా వీరికి సెటిల్‌మెంట్‌ కావాల్సిందే. 




Updated Date - 2022-01-29T06:29:34+05:30 IST