Abn logo
Mar 6 2021 @ 00:00AM

అవినీతి ఆ‘కలికాలం’ !

కలియుగంలో పరిస్థితులు ఎలా ఉంటాయో కలి పురుషుడు ముందుగానే హెచ్చరించాడు. కలి పురుషుడు చెప్పినవన్నీ ఇప్పుడు మనకు అనుభవంలోకి వస్తున్నాయి. ద్వాపర యుగాంతంలో ఒక రోజున పంచపాండవులలో చివరివాడైన సహదేవుడు గుర్రాల సంతలో ఒక అందమైన గుర్రాన్ని చూశాడు. దాని ధర ఎంత అని యజమానిని అడిగాడు. ‘గుర్రాన్ని  ఎవరికీ అమ్మను. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెబితే వారికి ఉచితంగా ఇస్తాను’ అని యజమాని చెప్పాడు. దీంతో సహదేవుడు ఏ ప్రశ్న అయినా సమాధానం చెప్తానని ధీమాగా అన్నాడు. దీంతో యజమాని... పెద్ద బావి ఉంది. అందులోని నీటితో ఏడు చిన్న బావులను నింపవచ్చు. కానీ, ఆ ఏడు బావులలోని నీటితో పెద్ద బావిని నింపలేం. ఎందుకు? అని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక సహదేవుడు సంతలోనే ఉండిపోయాడు. దీంతో సహదేవుడిని వెతుక్కుంటూ నకులుడు కూడా సంతకు చేరుకున్నాడు. ఏం జరిగిందో తెలుసుకున్నాడు. ఆ గుర్రం యజమానిని పిలిచి మరో ప్రశ్న అడిగితే తాను సమాధానం చెబుతానని అన్నాడు. దీంతో యజమాని తన రెండో ప్రశ్న సంధించాడు. అది... మనం బట్టలు కుట్టడానికి ఉపయోగించే సూది రంధ్రంలోకి పెద్ద ఏనుగు దూరగలిగింది. కానీ, ఏనుగు తోక మాత్రం సూది రంధ్రం దాటి వెళ్లలేకపోయింది. అలా ఎందుకు జరిగింది? అని గుర్రం యజమాని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు నకులుడు కూడా సమాధానం చెప్పలేక సంతలోనే ఉండిపోయాడు. దీంతో తమ్ముళ్లను వెతికి తీసుకురావలసిందిగా భీముడిని ధర్మరాజు ఆదేశించాడు. తమ్ముళ్ల నుంచి విషయం తెలుసుకున్న భీమసేనుడు మరో ప్రశ్న అడిగితే తాను సమాధానం చెబుతానని అన్నాడు. దీంతో యజమాని... ఒక పొలంలో ధాన్యం బాగా పండింది. ధాన్యం చుట్టూ పెద్ద గట్లు కూడా ఉన్నాయి. అయితే, పంట కోసే సమయానికి ధాన్యం మాయమైపోయింది. అలా ఎందుకు జరిగింది అని అడిగిన ప్రశ్నకు భీముడు కూడా సమాధానం చెప్పలేక, తమ్ముళ్లను తీసుకొని ధర్మరాజు దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్పాడు. ఆ ప్రశ్నలు విన్న ధర్మరాజుకు భయంతో చెమటలు పట్టాయి. ఇది గమనించి, మీరు కూడా సమాధానం చెప్పలేక భయపడుతున్నారా? అని తమ్ముళ్లు ప్రశ్నించారు. ‘‘నేను సమాధానం చెప్పలేక భయపడటం లేదు. మిమ్మల్ని ఆ ప్రశ్నలు అడిగిన వ్యక్తి కలిపురుషుడు. కలియుగంలో జరగబోయే సంఘటనలను అతడు ప్రశ్నల రూపంలో మిమ్మల్ని అడిగాడు’’ అని ధర్మరాజు వివరించాడు. మొదటి ప్రశ్నకు సమాధానం... పెద్ద బావి అంటే తల్లిదండ్రులు, ఏడు చిన్న బావులు వారి పిల్లలు. పిల్లలు ఎంత మంది ఉన్నా తల్లిదండ్రులు ప్రేమ, ఆప్యాయతలతో పెంచి పోషిస్తారు. కానీ, అదే తల్లిదండ్రులు వృద్ధులు అయ్యాక పిల్లలు వారిని భారంగా చూస్తారు. రెండో ప్రశ్నకు సమాధానం... ఏనుగు అంటే పెద్ద అవినీతిపరులు, తోక అంటే చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు. భారీ అవినీతికి పాల్పడే వారు చట్టానికి దొరక్కుండా తప్పించుకుంటారు. చిల్లర దొంగలు మాత్రం దొరికిపోతారు. మూడో ప్రశ్నకు సమాధానం... ధాన్యం అంటే ప్రజలు, చుట్టూ ఉన్న పెద్ద గట్లు అంటే అధికారులు. ఎంత మంది అధికారులు ఉన్నప్పటికీ ప్రజలకు దక్కాల్సిన ఫలాలను వారే స్వాహా చేస్తారు. అంటే, ధాన్యం మాయమైనట్టే... ప్రజలకు దక్కాల్సిన ఫలాలు కూడా మాయమవుతాయి. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలనే కలిపురుషుడు మీకు ముందుగా తెలియజేశాడని ధర్మరాజు తన తమ్ముళ్లకు వివరించాడు. మహాభారతంలో భాగంగా చెప్పే ఈ కథ ఇప్పుడు మనకు నిత్యం అనుభవంలోకి వస్తోంది కదా! కలియుగం అంతం కాబోతున్నదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కూడా ఈ మధ్యనే ప్రకటించారు. అది కూడా నిజం కాబోతున్నట్టుగా ఉంది. 


అర్థాలు వేరులే... 

దేశంలోని మిగతా రాష్ర్టాల సంగతి ఏమోగానీ, ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ పాలనలో అన్నిటికీ అర్థాలు మారిపోయాయి. ఇప్పుడు ఆ రాష్ట్రంలో మంచితనం అంటే చేతగానితనం, తెలివి తేటలంటే నమ్మకద్రోహం, కష్టపడటం అంటే వెర్రితనం, ధర్మరక్షణ అంటే చాదస్తం, వాక్చాతుర్యం అంటే మాయమాటలు చెప్పడం, చిరునవ్వంటే ఎగతాళి చేయడం అని అర్థం చేసుకోవాల్సివస్తోంది. నిజాలు అబద్ధాలుగా ప్రచారం జరిగిపోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న తీరునే తీసుకుందాం. పంచాయతీరాజ్‌ వ్యవస్థను పటిష్ఠం చేయడానికి చట్టాలు చేసి, ‘మీ ప్రాంతాన్ని మీరే పాలించుకోండి’ అని ప్రజలకు అవకాశం కల్పించారు. అయితే, ఏపీలో ఇప్పుడు ఇందుకు పూర్తి భిన్నంగా జరిగింది, జరుగుతోంది. తమ ప్రతినిధిని ఎన్నుకునే అవకాశం ప్రజలకు ఇవ్వకుండా సర్పంచులుగా ఎవరుండాలో పాలకులే నిర్ణయించారు. ఇప్పుడు జరుగుతున్న మునిసిపల్‌ ఎన్నికల్లోనూ ఇదే తంతు! ప్రత్యర్థి పార్టీలకు అభ్యర్థులే దొరక్కుండా చేస్తున్నారు. ఎవరైనా ముందుకొచ్చి నామినేషన్లు వేసినా, దాన్ని ఉపసంహరించుకోకపోతే చంపుతామని హెచ్చరికలు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలకు ఓటు వేసే అవకాశం ఉందన్న అనుమానం కలిగిన వారిపై నిఘా పెడుతున్నారు. అధికార పార్టీని కాదంటే ఏం చేస్తారో చెప్పి భయపెడుతున్నారు. మొత్తమ్మీద ప్రజాస్వామ్యం అన్న పదానికి నిర్వచనాన్నే మార్చి పడేశారు. కలియుగాంతంలో ఇలాగే ఉంటుందేమో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చెబితే బాగుంటుంది. విశాఖపట్నం నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఓడిపోతే మంత్రులు వాళ్ల ముఖాలను కూడా తనకు చూపించాల్సిన అవసరం లేదని, అక్కడి నుంచే రాజీనామాలు చేయాలని జగన్మోహన్‌ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారట! అంతే కాదు... తాను ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌గా ప్రకటించిన విశాఖను గెలిపించుకోలేకపోతే శాసనసభను సైతం రద్దు చేయడానికి వెనుకాడనని ముఖ్యమంత్రి అల్టిమేటం కూడా ఇచ్చారని చెబుతున్నారు. ‘‘మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. విశాఖలో గెలిచితీరాలి. ఈ విషయంలో మీ చర్యలను విమర్శిస్తూ మీడియాలో వార్తలు వచ్చినా నేను పట్టించుకోను. మీరు మంచివాళ్లుగా ఉండటం కంటే ప్రత్యర్థులను కట్టడి చేయడానికి అరాచకంగా వ్యవహరించడాన్నే ఇష్టపడతాను’’ అని మంత్రులు, శాసనసభ్యులను ఉద్దేశించి జగన్‌ రెడ్డి అన్నారని వినబడుతోంది. జగన్‌ రెడ్డి నిర్వచిస్తున్న ప్రజాస్వామ్యం ఇది! ముఖ్యమంత్రి అంతరంగం అవగతం కావడంతో ఎంపీ విజయసాయి రెడ్డి నాయకత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. సామ దాన భేద దండోపాయాలతోపాటు మాయోపాయాన్ని కూడా అమలు చేస్తున్నారు. ప్రతిపక్షాలను, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సంస్కార హీనంగా దూషిస్తున్న మంత్రులను ముఖ్యమంత్రి ఎందుకు కట్టడి చేయడం లేదు అని కొంతమంది అమాయకులు ప్రశ్నిస్తున్నారు గానీ, చంద్రబాబును ఎంత తిడితే జగన్‌ అంత సంతోషిస్తారని ఇప్పుడు తెలుస్తోంది. ద్వాపర యుగాంతంలో కలి పురుషుడు చెప్పినదానికంటే దారుణంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఉన్నాయి. జగన్‌ రెడ్డి ముఖంలో కనిపించే నవ్వులో ఎగతాళి కనిపిస్తోంది. తనకు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేతగానివాడుగా మిగిలిపోయారు.


అభివృద్ధి అజెండా ‘అంతం’

రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలవడానికి అభివృద్ధి నమూనా పనికిరాదని పలువురు మేధావులు ఇదివరకే ప్రకటించారు. అయితే, అభివృద్ధి నమూనానే నమ్ముకున్న చంద్రబాబు 2004లో ఒకసారి, 2019లో మరోసారి ఘోరంగా ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన జగన్‌ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లలో ప్రజలను తనవైపు తిప్పుకొనే మెళకువలను ఆకళింపు చేసుకున్నారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడును బీజేపీ నుంచి దూరం చేయడంలో సఫలమయ్యారు. జగన్‌ రెడ్డి విసిరిన ఉచ్చులో చిక్కుకున్న చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం తన పార్టీకి చెందిన ఇద్దరు కేంద్రమంత్రులతో రాజీనామా చేయించారు. దీంతో భారతీయ జనతాపార్టీకి జగన్‌ రెడ్డి సన్నిహితమయ్యారు. ఎన్నికలలో గెలుపొందడానికి అవసరమైన అన్ని వ్యూహాలను అమలు చేశారు. చంద్రబాబు ఒంటరిగా మిగిలిపోయారు. ఫలితం ఏమిటో మనం చూశాం. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ ఎంపీలు రాజీనామా చేయవచ్చుగా అని విలేకరులు ప్రశ్నించగా, ‘రాజీనామాలు చేస్తే ఏం వస్తుంది? మీరు కూడా మమ్మల్ని గౌరవించరు’ అని విజయసాయిరెడ్డి కుండబద్దలు కొట్టారు. అప్పుడు ఈ మాటను చంద్రబాబు అనలేకపోయారు. జగన్‌ కోరుకున్నట్టుగా 22 మంది ఎంపీలను ప్రజలు గెలిపించారు. అయినా, అప్పుడు జగన్‌ చెప్పిన మాటలు ప్రజలకు గుర్తుకు రావడం లేదు. విశాఖ రైల్వేజోన్‌ గాలికి పోయింది. ప్రత్యేక హోదా ఊసే లేదు. అయినా ప్రజలకు ఆ స్పృహ కూడా లేదు. కలియుగ ధర్మాన్ని జగన్‌ రెడ్డి బాగా ఒంటబట్టించుకున్నారు. చంద్రబాబుకు అది చేతగాలేదు. కలియుగంలో తమకు ఏం కావాలో పాలకులకు బాగా తెలుసు గానీ, ప్రజలకే తమకేం కావాలో తెలియదని కలి పురుషుడు కూడా ఊహించి ఉండడు.


కొత్త ఎత్తులతో జగన్‌...

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా జగన్మోహన్‌ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేయకముందే వినూత్నపోకడలతో తన టాలెంట్‌ను రుజువు చేసుకున్నారు. ఒకప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏఆర్‌ అంతూలే అనుసరించిన మోడల్‌ను అందరూ మరచిపోయారు. లంచాలను నేరుగా తీసుకోకుండా ‘ఇందిరా ప్రతిభా ప్రతిష్ఠాన్‌’ అనే ట్రస్టును ఏర్పాటు చేసి దాని కోసం విరాళాలు సేకరించిన అంతూలే, ఆ తర్వాత పదవిని కోల్పోయారు. ఆ మోడల్‌ను పరిశోధించిన జగన్‌ రెడ్డి తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇబ్బడిముబ్బడిగా కంపెనీలు ఏర్పాటుచేసి, ప్రభుత్వం నుంచి మేళ్లు పొందిన వారి నుంచి వాటిలో ‘పెట్టుబడులు’ పెట్టించారు. అప్పటిదాకా ఇది ఎవరికీ తట్టని ఆలోచన! తమ అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన రాజశేఖర్‌ రెడ్డి ఆ తర్వాత కాలంలో మహానాయకుడు అయ్యారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ రెడ్డి రెండు సరికొత్త మోడళ్లను ఎంచుకున్నారు. అధికారంలో ఉన్నందున మేళ్లు చేసి లబ్ధి పొందితే ఎప్పుడో ఒకప్పుడు దొరికిపోయే ప్రమాదం ఉన్నందున, మేళ్లు చేసే బదులు కీడు చేయకుండా ఉండడం కోసం కప్పం కట్టించుకుంటున్నట్టు బాధితులు వాపోతున్నారు. ఈ క్రమంలో వ్యాపార సంస్థలు చేతులు మారిపోతున్నాయి. అదే సమయంలో ‘మజ్జిగ మీకు మీగడ మాకు’ అన్న సూత్రాన్ని జగన్‌ రెడ్డి పకడ్బందీగా అమలు చేస్తున్నారు. దక్షిణాది రాష్ర్టాలలో ప్రభుత్వాలకు ఇబ్బడిముబ్బడిగా ఆదాయం వస్తుంటుంది. దీంతో పాలకులు అవినీతికి పాల్పడటమే కాకుండా ప్రజల దృష్టి మరల్చడానికి విపరీతంగా సంక్షేమ పథకాలను అమలు చేయడం మొదలుపెట్టారు. ఈ మోడల్లో ఇప్పుడు దక్షిణాదిలోనే టాప్‌ ముఖ్యమంత్రిగా జగన్‌రెడ్డి ఉన్నాడని చెప్పవచ్చు. సంక్షేమం పేరిట అడ్డమైన పథకాలు అమలు చేస్తూ బలమైన ఓటుబ్యాంకు ఏర్పాటుకు ఆయన ఎత్తుగడ వేశారు. అలవికాని సంక్షేమం కారణంగా రాష్ట్రం అప్పులపాలు అవుతున్నప్పటికీ పథకాల లబ్ధిదారులకు అవేమీ పట్టడంలేదు. తమకు సహాయం చేయడానికి ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోయినా, జగన్‌ రెడ్డి అప్పులు చేసి మరీ ఇస్తున్నాడని ఆయనపై సానుభూతి వ్యక్తం చేస్తున్న వారు కూడా లేకపోలేదు. కలికాలంలో జగన్‌ వంటి నాయకుడు ఇంతకుముందు లేడు. ఒక వైపు ప్రభుత్వ సంపదను కొల్లగొడుతూ మరోవైపు అప్పులు చేసి ప్రజలకు పంచి పెట్టడాన్నే మజ్జిగ మీకు మీగడ మాకు అంటారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులను జగన్‌ రెడ్డి తీర్చబోరు. ప్రజలు కూడా ఇవాళ తమకు ఏమి వస్తున్నదో అని చూసుకుంటున్నారు గానీ రేపటి గురించి ఆలోచించడం లేదు. ప్రజల అమాయకత్వంపై అంతులేని నమ్మకం ఉన్న జగన్‌ అండ్‌ కో తమ అధికారానికి ఢోకా లేదని విర్రవీగుతున్నారు. వ్యవస్థలన్నింటినీ చెరబడుతున్నారు. అయితే, అధికారంలో ఉన్నంత మాత్రాన అందరినీ, అన్ని వ్యవస్థలనూ అదుపు చేయలేరు. అలా అయితే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చేదా? అయితే అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. అప్పట్లో నాయకులతోపాటు ప్రజల్లో కూడా త్యాగనిరతి ఉండేది. ఇప్పటి నాయకులు ప్రజలను కూడా పూర్తిగా చెడగొట్టారు. మనలో స్వార్థం పెరిగి భయం వెంటాడుతున్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కూడా భయం నీడన బతుకుతున్నారు. అభివృద్ధిని పూర్తిగా విస్మరించి సంక్షేమ మోడల్‌ను ఎంచుకోవడంలోనే జగన్‌ వ్యూహం దాగి ఉంది. అయితే, ఈ మోడల్‌ ఎంతకాలం సత్ఫలితాలను ఇస్తుందా అన్న ప్రశ్న కూడా ఉంది. మతం మత్తు వంటిది అంటారు. ఇప్పుడు సంక్షేమం కూడా మత్తు వంటిదేనని ఏపీలోని పరిస్థితులు సూచిస్తున్నాయి. సంక్షేమం మాటున పన్నుల భారం వేస్తున్నప్పటికీ, ప్రజలకు తమపై భారం పడిందన్న విషయమే తెలియడం లేదు. అధికార పార్టీ నాయకులందరూ సంక్షేమ పథకాల గురించే మాట్లాడుతున్నారు గానీ అభివృద్ధి ఊసే ఎత్తడం లేదు. ఈ రెండేళ్లలో తెలంగాణకంటే ఆంధ్రప్రదేశ్‌కే ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని ఆ రాష్ట్ర పరిశ్రమల మంత్రి గౌతంరెడ్డి చేసిన ప్రకటన చూసి హైదరాబాద్‌వాసులు పగలబడి నవ్వుతున్నారు. హైదరాబాద్‌ ఎంతగా అభివృద్ధి చెందుతున్నదో, ప్రజల ఆస్తుల విలువ ఏ స్థాయిలో పెరుగుతున్నదో అక్కడి ప్రజలకు తెలుసు కదా! అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇటీవల జరిగిన కొన్ని ఎన్నికల్లో పరాభవం ఎదురుకాగా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డికి రాజకీయ ఒడిదుడుకులు ఇంతవరకు ఎదురుకాలేదు. పోలీసులను, అధికార వ్యవస్థను అడ్డుపెట్టుకుని పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలను ఏకపక్షం చేసుకున్నారు. దీంతో ప్రజలు కూడా తమవైపే ఉన్నారని రుజువవుతున్నదని అధికార పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. నిజానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులు అధికార పార్టీకి అంత అనుకూలంగా ఏమీ లేవు. అధికారంతోపాటు డబ్బు కూడా పుష్కలంగా ఉన్నందున ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాయి. అప్పులు చేసి పంచుతున్న సొమ్మును ఆయాచితంగా పొందుతున్న వారిలో అత్యధికులు మాత్రం జగన్‌కు ఇప్పటికీ అనుకూలంగానే ఉన్నారు. కష్టాన్ని నమ్ముకున్న వారిలో మాత్రం ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్నది ఒక అంచనా. కానీ ముఖ్యమంత్రి అనుసరిస్తున్న మోడల్‌ ముందు ఈ అంచనాలు ప్రస్తుతానికి నిలబడకపోవచ్చు. కలియుగ ధర్మాన్ని బాగా ఒంటబట్టించుకున్న జగన్‌ రెడ్డిది ప్రస్తుతానికి పైచేయిగా ఉంటుంది. తన సోదరులను కలి పురుషుడు అడిగిన ప్రశ్నలు విన్న ధర్మరాజుకు కలియుగంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలిసి భయంతో చెమటలు పట్టాయి. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు, పరిణామాలు అప్పుడే తెలిసిఉంటే ధర్మరాజు స్పందన ఎలా ఉండేదో? కలియుగం అంతం కాబోతున్నదని జగనన్న చెబుతున్నారు కనుక పరిస్థితులు మున్ముందు మరింత దారుణంగా ఉండవచ్చు. ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల ద్వారా ఎన్నుకోబడవలసిన సంస్థలలోకి మరో రూపంలో చొరబడుతున్న వాళ్లు అధికారం చెలాయించడం కూడా కలియుగ ధర్మమే కాబోలు! అవినీతిపరులకు అందలం లభించడమే కలియుగ ధర్మమని సర్దిచెప్పుకుందామా!!

ఆర్కే

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Advertisement
Advertisement
Advertisement