కమర్షియల్‌ ట్యాప్‌లలో అవినీతి ప్రవాహం

ABN , First Publish Date - 2022-06-25T06:41:22+05:30 IST

అనంతపురం నగరపాలక సంస్థలో కమర్షియల్‌ దొంగలు తయారయ్యారు. కార్పొరేషన సొమ్ముకు గండి కొడుతున్నారు.

కమర్షియల్‌ ట్యాప్‌లలో అవినీతి ప్రవాహం

నీటి పన్ను వసూళ్లలో భారీగా గోల్‌మాల్‌

ముడుపులు పుచ్చుకుని బకాయిల తగ్గింపు

ఓ ఇంజనీర్‌, ముగ్గురు ఉద్యోగులే కీలకం?

కార్పొరేషన ఆదాయానికి  రూ.లక్షల్లో గండి


నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లే దారిలో ఓ లాడ్జికి కమర్షియల్‌ వాటర్‌ ట్యాప్‌ కనెక్షన ఉంది. దీనికి సంబంధించి నగరపాలక సంస్థకు రూ.2 లక్షల నీటి పన్ను చెల్లించాల్సి ఉంది. నగరపాలక సంస్థ సిబ్బందిలో కొందరు లాడ్జి యాజమాన్యంతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. పన్ను రూ.80 వేలు కట్టించుకున్నారు. రూ.50 వేలు ముడుపులు తీసుకు న్నారు. లాడ్జివారికి రూ.70 వేలు మిగిల్చారు. ఇదొక్కటే కాదు.. ఇలాంటివి బోలెడు జరిగాయి.


అనంతపురం క్రైం: 

అనంతపురం నగరపాలక సంస్థలో కమర్షియల్‌ దొంగలు తయారయ్యారు. కార్పొరేషన సొమ్ముకు గండి కొడుతున్నారు. నీటి పన్ను వసూళ్లలో గోల్‌మాల్‌ చేస్తున్నారు. పెద్ద పెద్ద భవనాలవారు బకాయి ఉన్న భారీ మొత్తాలను, ముడుపులు తీసుకుని తగ్గిస్తున్నారు. కమర్షియల్‌ ట్యాప్‌ కనెక్షన్స మీటర్‌ రేట్‌ విభాగంలో ఈ దందా జరుగుతోంది. పన్ను వసూలు చేయాల్సింది రెవెన్యూ విభాగం. కానీ తాగునీటి సరఫరా విభాగం వారు తోడై.. అవినీతికి పాల్పడుతున్నారు. ఫిక్స్‌ చేసిన డిమాండ్‌కు.. చెల్లించే మొత్తానికి చాలా తేడా ఉంటోందని తెలిసింది. కార్పొరేషన కార్యాలయంలో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అవినీతిని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కమర్షియల్‌ భవనాలకు సంబంధించిన ఈ వ్యవహారమంతా ఆఫ్‌లైనలోనే జరుగుతుంది. ఇదే అదనుగా గుట్టుచప్పుడు కాకుం డా వసూళ్లకు తెరలేపారు. రికార్డు బుక్స్‌లో వైట్‌ ఫ్లూయిడ్‌తో నెంబర్లను చెరిపేసి (రాసిన అక్షరాలను చెరిపేసి), తమకు తోసిన లెక్కలు రాసేస్తున్నారు. ఈ బాగోతమంతా ఆడిట్‌ అధికారుల తనిఖీలో వెలుగు చూసినట్లు సమాచారం. ఓ ఇంజనీర్‌, ఇద్దరు ఉద్యోగులు ఇందులో కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. 


వైట్‌ ఫ్లూయిడ్‌ వేసి..

కమర్షియల్‌ భవనాల నీటి పన్ను రికార్డు రిజిస్టర్‌ అంతా ఆఫ్‌లైనలోనే జరుగుతోంది. మాన్యువల్‌గానే ఉంటుంది. ఆ రిజిస్టర్‌లో రాసిన లెక్కలను వైట్‌ ఫ్లూయిడ్‌తో చెరిపేసి, తాము ఎంత చెల్లిస్తున్నామో ఆ లెక్కనే రాసేస్తున్నారు. తాగునీటి సరఫరా విభాగం ఇంజనీర్‌కు ఆ పన్ను వసూలు చేసే అధికారం లేదు. ఇద్దరు అసిస్టెంట్ల  ద్వారా ఆ ఇంజనీరు ఈ కలెక్షన్లు సాగిస్తున్నట్లు సమాచారం. ఆడిట్‌ అధికారులు నగరపాలక సంస్థలో మూడు వారాలుగా ఆడిట్‌ చేస్తున్నారు. ఆ తనిఖీల్లో అక్రమాలు బయట పడినట్లు సమాచారం. వైట్‌ ఫ్లూయిడ్‌ పూయడం, కొన్ని లెక్కలపై సందేహాలు రావడంతో ఆడిట్‌ అధికారులు గట్టిగా వివరణ కోరినట్లు తెలిసింది. అక్రమాలలో కీలకంగా ఉన్న ఆ ముగ్గురు.. ఆడిట్‌ సమయంలో అక్కడక్కడే తచ్చాడుతుండటం గమనార్హం. 


వసూళ్ల దందా

కమర్షియల్‌ అపార్ట్‌మెంట్‌ లేదా భవనానికి డిపాజిట్‌ కట్టించుకుని, కమిషనర్‌ అప్రూవల్‌ ఇచ్చిన తరువాత ట్యాప్‌ కనెక్షన ఇస్తారు. మీటర్‌ రేట్‌ విభాగంలో కమర్షియల్‌ ట్యాప్‌ కనెక్షన కింద అపార్ట్‌మెంట్లు, హాస్పిటల్స్‌, నర్సింగ్‌ హోమ్స్‌, లాడ్జిలు తదితర భవనాలు వస్తాయి. తొలుత తాగునీటి సరఫరా విభాగం డీఈ, ఏఈలు డిమాండ్‌ విధిస్తారు. ఒక్కో ప్లాట్‌కు రూ.100 చొప్పున ఫిక్స్‌ చేస్తారు. నీటి పన్ను ఆరు నెలలకు ఒకసారి చెల్లించాలి. ఒక్కో అపార్ట్‌మెంట్‌లో 40 ప్లాట్‌లు ఉన్నాయనుకుంటే.. ప్రతి నెలా రూ.4,000 టాక్స్‌ కట్టాలి. ఆరు నెలలకు ఒకసారి రూ.24 వేలు అవుతుంది. ఏడాదికైతే రూ.48 వేలు అవుతుంది. బకాయిలు పేరుకుపోయినా.. వడ్డీ విధించరు. బకాయిలు పేరుకుపోయిన చోట దందాలకు తెరలేపుతున్నారు. రూ.2లక్షల బకాయి ఉంటే రూ.60 వేలు ముడుపులు తీసుకుని పన్ను కింద రూ.50 వేలు కట్టించిన సందర్భాలూ ఉన్నాయని సమాచారం. ఈ అవినీతి వ్యవహారాలు భవన యజమానులకు, వసూళ్లకు పాల్పడే అధికారులకు లాభసాటి అవుతున్నాయి. కానీ నగరపాలిక ఆదాయానికి గండి పడుతోంది. నగర పరిధిలో 500పైగా కమర్షియల్‌ భవనాలు ఉన్నాయి. ఈ క్రమంలో అవినీతి భారీగా జరిగినట్లు సమాచారం. 


వాటర్‌ సెక్షనలోకి ఎలా...?

కమర్షియల్‌ వాటర్‌ టాక్స్‌కు సంబంధించి మీటర్‌ రేట్‌ విభాగంలో ప్రత్యేకంగా డిమాండ్‌ రిజిస్టర్‌ నిర్వహిస్తారు. ఏడాదిన్నర క్రితం వరకు ఆ రికార్డు రెవెన్యూ విభాగంలోనే ఉండేది. ఆ విభాగం సిబ్బందే వసూలు చేసేవారు. ఒకసారి డిమాండ్‌ ఫిక్స్‌ చేసిన తరువాత ఇంజనీరింగ్‌ విభాగానికి సంబంధం లేదు. కేవలం రెవెన్యూ విభాగం అధికారులే ఆ టాక్స్‌ వసూలు చేయాల్సి ఉంటుం ది. కానీ కొంత కాలంగా ఆ రికార్డు తాగునీటి సరఫరా విభాగంలో అధికారుల చేతుల్లో ఉంటోంది. ఇదే అదనుగా ఓ ఇంజనీర్‌ అంతా తానై వ్యవహారం నడిపిస్తున్నారు. రెవెన్యూ విభాగంలో పనిచేసే మరో ఉద్యోగి ఆయనకు సహకరిస్తున్నారు. తాగునీటి సరఫరాలో పనిచేసే మరో కీలక ఉద్యోగి, ఇద్దరు అసిస్టెంట్లతో వసూళ్ల వ్యవహారం నడిపిస్తున్నారని తెలిసింది. ఒక్కో కమర్షియల్‌ భవంతి నుంచి రూ.50 వేలకు తక్కువ కాకుండా వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పెద్ద మొత్తంలో బకాయి ఉంటే లక్షలు దండుకుంటున్నారని తెలిసింది. రికార్డు రిజిస్టర్‌ కిందకు రావడం అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయం తమకు తెలియదన్నట్లు కొందరు రెవెన్యూ విభాగం అధికారులు వ్యవహరిస్తున్నారు. కానీ ఓ కీలక ఉద్యోగి నేతృత్వంలోనే ఆ రికార్డు కింద కు దిగివచ్చినట్లు సమాచారం. ఆయన ఎక్కడుంటే ఆ రికార్డు అక్కడ ఉంటుందని అంటున్నారు. రెవె న్యూ నుంచి వాటర్‌ సెక్షనకు రికార్డు ఎలా వచ్చిందని ఆడిట్‌ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. 

Updated Date - 2022-06-25T06:41:22+05:30 IST