టౌన్‌ప్లానింగ్‌లో అవకతవకలు

ABN , First Publish Date - 2020-02-20T11:05:40+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్‌ కార్యాలయాల్లోని పట్టణ ప్రణాళికా విభాగాల్లో ఏసీబీ తనిఖీలు బుధవారం కొనసాగాయి. గుంటూరు కార్పొరేషన్‌లో అధికారుల పరిశీలనలో భారీ అక్రమాలు వెలుగులోకి...

టౌన్‌ప్లానింగ్‌లో అవకతవకలు

  • గుంటూరులో 8.20కోట్ల అవినీతి 
  • ప్రొద్దుటూరులో 132 ఫైళ్లు సీజ్‌
  • అస్తవ్యస్తంగా రికార్డుల నిర్వహణ
  • రెండోరోజు కొనసాగిన ఏసీబీ తనిఖీలు 



(ఆంధ్రజ్యోతి న్యూస్‌లైన్‌ నెట్‌వర్క్‌) : రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్‌ కార్యాలయాల్లోని పట్టణ ప్రణాళికా విభాగాల్లో ఏసీబీ తనిఖీలు బుధవారం కొనసాగాయి. గుంటూరు కార్పొరేషన్‌లో అధికారుల పరిశీలనలో భారీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విభాగంలో 2013- 16వరకు రూ.8.20కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. కటాఫ్‌ డేట్‌ ముగిసిన తర్వాత ప్లాన్లు తీసుకున్న అనేక భవనాలకు కూడా బీపీఎస్‌ వర్తింపజేసి ప్లాన్లు మంజూరు చేశారని, పదేళ్లుగా బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు, సూపర్‌వైజర్లు అడ్డగోలుగా వ్యవహరించారని తేలింది. అనధికారికంగా నిర్మాణాలు, బీపీఎస్‌ అప్రూవల్స్‌, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల మంజూరు వంటివి అడ్డగోలుగా చేసినట్లు చెబుతున్నారు. 2018 అక్టోబరులో ప్లాన్‌ తీసుకున్న ఒక భవన యజమానికి బీపీఎస్‌ కింద అక్రమ కట్టడాన్ని క్రమబద్ధీకరించారు. ఈ వ్యవహారంలో రూ.లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు గుర్తించారు. అనంతపురం జిల్లా కదిరి మున్సిపాల్టీలోని టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో అన్నీ అవకతవకలే ఉన్నాయని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.


పదేళ్ల నుంచి రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందన్నారు. బిల్డింగ్‌ ప్లాన్లు లేకుండానే అనేకచోట్ల భవనాలు నిర్మించారని, తీసుకున్న ప్లాన్‌కు, నిర్మాణానికి సంబంధం లేకుండా వ్యవహరించారని తెలిపారు. అనేకచోట్ల ప్రతి నిర్మాణంలోనూ అవకతవకలకు పాల్పడినట్లు స్పష్టమవుతోందన్నారు. కీలక రికార్డులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఏసీబీ అధికారులు మున్సిపల్‌ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. మైదుకూరు రోడ్డులోని రెండు ప్రాంతాల్లో, శ్రీరాములపేట, గాంధీరోడ్డులోని ఒక్కో ప్రాంతంలో నిర్మించిన కట్టడాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని గుర్తించారు. నిర్మాణాల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న 132 పైళ్లల్లో అక్రమాలు గుర్తించి సీజ్‌ చేశారు. తాడేపల్లిగూడెంలోని ఎఫ్‌సీఐ కాలనీలోని ఓ భవనానికి సంబంధించి అనుమతుల్లో ఉన్నదానికంటే ఎత్తుగా, అదనంగా మరో అంతస్తు నిర్మించినట్టు తేలింది. ఏలూరు రోడ్డులోని 21వ వార్డులో ఒక భవనానికి వాణిజ్య నిర్మాణాలకు అనుమతి తీసకొని నివాస యోగ్యమైన భవనాన్ని నిర్మించారు. సంబంధిత యజమానికి నోటీసులు ఇవ్వలేదు. శ్రీకాకుళం నగరంలోని కత్తెరవీధిలో గుడ్ల కేశవరావు, రామకృష్ణానగర్‌లో డబ్బీరు వెంకట సంతో్‌షకుమార్‌, మంగువారితోటలో చెన్నా శ్రీనివాసరావు, నాగుల చంద్రరావు, మహలక్ష్మీ నగర్‌ కాలనీలో సూరపు చలపతిరావు అనుమతులు లేకుండానే భవన నిర్మాణాలు చేపట్టినట్లు ధ్రువీకరించారు.


చెన్నా శ్రీనివాసరావు ఏకంగా ప్రభుత్వ స్థలాన్ని సైతం ఆక్రమించినట్లు నివేదికలో పేర్కొన్నారు. విజయనగరం రింగురోడ్డు ప్రాంతంలో రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న లియోపారడైజ్‌ ఫంక్షన్‌ హాల్‌కు కనీస అనుమతులు లేవని తేల్చారు. 2016లో నిర్మాణం జరిగితే ఇప్పటివరకూ ఒక్క నోటీసు కూడా ఎందుకు ఇవ్వలేదో ఆరా తీశారు. శంకరమఠం రోడ్డులో ఒక భవనానికి జీప్లస్‌ 2 అనుమతులు తీసుకుని జీప్ల్‌స3తో పాటు కింద సెల్లార్‌లో కూడా గదులు నిర్మించినట్లు గుర్తించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అనుమతులు లేని భవన నిర్మాణాలు, రెసిడెన్షియల్‌ ఏరియాలో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు, జీ+1 అనుమతులు తీసుకుని జీ+2, జీ+3 నిర్మాణాలు, వంకలను ఆక్రమించిన కట్టడాలతో పాటు పట్టణ శివార్లలో 8 నాన్‌లే అవుట్‌ వెంచర్లు గుర్తించారు. వీటిపై ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక పంపుతున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. 


Updated Date - 2020-02-20T11:05:40+05:30 IST