అవినీతి అధికారులకు విజిలెన్స్‌ షాక్‌!

ABN , First Publish Date - 2022-05-07T06:38:38+05:30 IST

రక్షిత మంచినీటి పథకం పనుల్లో అవినీతికి పాల్పడిన ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి షాక్‌ ఇచ్చారు.

అవినీతి అధికారులకు విజిలెన్స్‌ షాక్‌!

రక్షిత నీటి పథకాల్లో అవినీతిపై విజిలెన్స్‌ అధికారి విచారణ 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): రక్షిత మంచినీటి పథకం పనుల్లో అవినీతికి పాల్పడిన ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి షాక్‌ ఇచ్చారు. రాష్ట్ర ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఎన్‌సీ ఆఫీసులోని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌  డిప్యూటీ ఏఈ శ్రీనివాస్‌ ఎంబుక్‌ల మాయాజాలంపై నిలదీయడంతో బాధ్యులైన అధికారులు నీళ్లు నములుతున్నారు. గొల్లపూడిలోని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ కార్యాలయంలో క్వాలిటీ కంట్రోల్‌ అండ్‌ విజిలెన్స్‌ డిప్యూటీ ఈఈ శ్రీనివాస్‌ జిల్లాలో రక్షిత మంచినీటి పథకం పనుల్లో చోటుచేసుకున్న అక్రమాల పంచనామా పూర్తి చేశారు. నందిగామ సబ్‌ డివిజన్‌  పరిధిలోని మూడు గ్రామాల్లో పైపులైన్ల పనులన్నింటిలోనూ అవినీతిని ఆయన పసిగట్టినట్టు తెలుస్తోంది. ఈ పనులను క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించే అవకాశాలున్నాయి. కంచికచర్ల బైపాస్‌ రోడ్డు నుంచి చర్చి వరకు జరిగిన పనుల్లో జరిగిన అవకతవకల గురించి విజిలెన్స్‌ అధికారి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కంచికచర్ల గ్రామ పంచాయతీలో నాలుగు పనులు చేశారు. పనులన్నీ నాసిరకంగా జరిగినట్టు ప్రాథమిక విచారణలో బయటపడినట్టు తెలుస్తోంది. విజయవాడ రూరల్‌ మండలంలోని రాయనపాడు, పైడూరుపాడు గ్రామ పంచాయతీల్లో జరిగిన పైపులైన్ల పనులు కూడా అడ్డగోలుగా ఉన్నట్టు తేలింది. తన విచారణలో వెలుగు చూసిన అంశాలన్నింటిపై ఆ అధికారి నివేదిక సమర్పించనున్నారని తెలుస్తోంది. 

Read more