ఫైళ్లతో రండి

ABN , First Publish Date - 2022-05-05T06:23:53+05:30 IST

జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్‌) ప్రజారోగ్యాన్ని ఫణంగా పెట్టి నాసిరకంగా చేపట్టిన రక్షిత మంచినీటి పథకం పనులపై రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ముత్యాలనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫైళ్లతో రండి

రక్షిత నీటి పథకం పనులపై పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి దృష్టి 

బాధ్యులను తన ఎదుట హాజరు పరచాలని  ఆదేశం

ఈఎన్‌సీ నుంచి జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈకి ఫోన్‌ 

నేడు మంత్రి ఎదుట హాజరు కావాలని బాధ్యులైన అధికారులకు ఫోన్లు 

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌


జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్‌)  ప్రజారోగ్యాన్ని ఫణంగా పెట్టి నాసిరకంగా చేపట్టిన రక్షిత మంచినీటి పథకం పనులపై రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ముత్యాలనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన అధికారులందరూ గురువారం తన ఎదుట ఫైళ్లతో హాజరు కావాలని ఆదేశించారు. ప్రజారోగ్యానికి సంబంధించిన పనుల్లో చోటుచేసుకున్న అవినీతి వ్యవహారాలపై ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌ఎసీ)తో మాట్లాడిన మంత్రి తక్షణం బాధ్యులైన వారందరినీ రికార్డులతో సహా తన ఎదుట హాజరు పరచాలని ఆదేశించారు. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రక్షిత మంచినీటి పథకం పనులకు సంబంధించిన రికార్డులతో రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ముత్యాలనాయుడును కలవాలని జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఎన్‌సీ నుంచి జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు ఫోన్‌ కాల్స్‌ వెళ్లాయి. దీంతో అధికారులు కంగుతిన్నారు. ఏమి చేయాలో తోచక ఆందోళన చెందుతున్నారు. మైలవరం సబ్‌ డివిజన్‌ డీఈఈ ద్వారా బాధ్యులైన అధికారులకు బుధవారం ఫోన్లు వెళ్లాయి. నందిగామ సబ్‌ డివిజన్‌ డీఈఈ, కంచికచర్ల ఏఈ, చందర్లపాడు ఏఈ, విజయవాడ సబ్‌ డివిజన్‌ డీఈఈ, ఏఈ, రాయనపాడు, పైడూరుపాడు గ్రామాల ఈవోలు, చందర్లపాడు మండలంలోని మూడు గ్రామాల పంచాయతీ ఈవోలు, కంచికచర్ల ఈవో, జిల్లావ్యాప్తంగా టెక్నికల్‌ శాంక్షన్‌ ఇచ్చిన ఈవోలు తగిన రికార్డులు, ఫైల్స్‌తో మంత్రి ఎదుట హాజరు కావాలని చెప్పటంతో ఆర్‌డబ్ల్యూఎస్‌ విభాగంలో అలజడి మొదలయింది. ఈ వ్యవహారాల్లో ప్రధాన పాత్రధారిగా ఉన్న విజయవాడ ఈఈని పిలవకపోవటంపై విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ముత్యాలనాయుడు నుంచి ఇలాంటి స్పందన వస్తుందని అధికారులెవరూ భావించలేదు. మంత్రి ముత్యాలనాయుడుకు ఈ సబ్జెక్టుపై మంచి అవగాహన ఉంది. ఆయన పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ల పనులను, విధానాలను క్షేత్రస్థాయిలో చూసిన వ్యక్తి. కాబట్టి సూటిగా విషయంలోకి వచ్చే సరికి ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయి. తమ పరిధిలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ద్వారా మంత్రిని శాంతింపజేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఒక్క మైలవరం ప్రజాప్రతినిధి తప్ప అధికారపక్ష ఎమ్మెల్యేల్లో మిగిలినవారెవరూ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవటానికి ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది. 


విజిలెన్స్‌ విచారణకు ఆదేశించే అవకాశం

బాధ్యులైన అధికారులందరినీ తన ఎదుట ఫైళ్లతో సహా హాజరు పరచాలని మంత్రి ముత్యాలనాయుడు ఆదేశించడం చూస్తే, జరిగిన వ్యవహారాలపై ఆయన రాష్ట్ర ఉన్నతాధికారుల సమక్షంలో ప్రాథమిక విచారణ చేపడతారని అర్థమవుతోంది. విచారణలో గుర్తించిన అంశాల ప్రాతిపదికన ఆయన విజిలెన్స్‌ విచారణకు ఆదేశించే అవకాశాలు లేకపోలేదు. సింగిల్‌ పనులను అడ్డగోలుగా విభజించి నామినేషన్‌ విధానంలో టెండర్లు పిలవడం,  పనులకు సంబంధించిన మెటీరియల్‌కు ఇన్వాయిస్‌లు లేకపోవటం, నాణ్యమైనవి లేకపోవడం, ఎంబుక్‌లలో నమోదు చేయకపోవడం, కొన్ని ఎంబుక్‌లను ట్యాంపరింగ్‌ చేయడం, సీఎఫ్‌ఎంఎస్‌లో మాత్రం వేరే అంశాలు నమోదు కావడం ఇవన్నీ మంత్రి పరిశీలిస్తే.. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల బాగోతం తేలిగ్గా బయట పడుతుంది. ఇదే జరిగితే మంత్రి విజిలెన్స్‌ విచారణకు ఆదేశించే అవకాశాలు ఉంటాయి.


మంత్రి నిర్ణయంపై కాంట్రాక్టర్ల హర్షం  

ఆర్‌డబ్ల్యూఎస్‌లో అవినీతి పనులకు బాధ్యులైన వారిని మంత్రి ముత్యాలనాయుడు విచారణకు ఆహ్వానించటాన్ని కాంట్రాక్టర్లు స్వాగతించారు. మంత్రి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, తమ వాదనలను వినిపించటానికి కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌లో జరిగిన అవినీతి వ్యవహారాలపై తాము ఫిర్యాదు చేసి ఉన్నామని, తమను కూడా విచారణకు ఆహ్వానిస్తే, జరిగిన వ్యవహారాలను మంత్రికి సమగ్రంగా తెలియజేస్తామని చెప్పారు. 

Read more