విచారణ నీరుగార్చి..

ABN , First Publish Date - 2022-05-09T06:24:13+05:30 IST

విచారణ నీరుగార్చి..

విచారణ నీరుగార్చి..

రక్షిత మంచినీటి పథకం అవినీతిలో మరో కోణం

విచారణ పూర్తిచేసినా.. నివేదిక ఇవ్వకుండా మోకాలడ్డు

తెరపైకి ఎస్‌ఈతో విచారణ చేయాలనే ప్రతిపాదన

ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఎన్‌సీ అధికారుల వ్యూహం

కాలాతీతం చేసేందుకే ఈ కొత్త పథక రచన

పనిలో పనిగా వసూళ్లపర్వానికి శ్రీకారం


తాడిని తన్నేవాడు ఒకడైతే.. వాడి తలదన్నేవాడు మరొకడు. తప్పు చేసింది ఒకడైతే.. ఆ తప్పును బూచిగా చూపి సొమ్ము చేసుకోవాలనుకునేది మరొకడు. ఎన్టీఆర్‌ జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్‌ విభాగంలో చేపట్టిన రక్షిత మంచినీటి పథకాల అవినీతి వ్యవహారాల్లో ఇది సరికొత్త ట్విస్ట్‌. ఒకరిని కాపాడటానికి మరొకరు.. ఇంకొకరు.. ఇలా కేసును నీరుగార్చే ప్రయత్నాలకు పూనుకుంటున్నారు.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఆర్‌డబ్ల్యూఎస్‌ విభాగంలో చేపట్టిన రక్షిత మంచినీటి పథకాల అవినీతి వ్యవహారంలో విచారణను నీరుగారుస్తున్నారు. ఈ అవినీతి వ్యవహారాలపై రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ముత్యాలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేసి, విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆయన ఆదేశాల మేరకు క్వాలిటీ కంట్రోల్‌-విజిలెన్స్‌ విభాగం అధికారితో విచారణ చేయించారు. క్వాలిటీ కంట్రోల్‌-విజిలెన్స్‌ డీఈఈ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విచారణ జరిగి నివేదిక ఇవ్వడానికి సిద్ధం కానుండగా, ఈఎన్‌సీ కార్యాలయ ఉన్నతాధికారులు మోకాలడ్డారు. జిల్లా ఎస్‌ఈ విచారణ పేరుతో వీలైనంత కాలం జాప్యం చేయించటం ద్వారా కేసును మరుగుపరచాలన్నది వారి వ్యూహంగా కనిపిస్తోంది. ఇదే సందర్భంలో బాధ్యులైన అధికారుల నుంచి వసూళ్లకు దిగాలన్నది కూడా వారి మరో ప్రణాళిక. 

మంత్రి ఆదేశాలను బేఖాతరు చేస్తూ..

ఈ అవినీతి వ్యవహారాలపై రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ముత్యాలనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, ఈఎన్‌సీ (ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌) అధికారులను గట్టిగా నిలదీసి తన ఎదుట హాజరుపరచాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే ప్రాథమిక విచారణకు ఆదేశించారు. ఉన్నతాధికారి నివేదిక ఇవ్వకుండా అడ్డుకోవడంతో మంత్రి ఆదేశాలను కూడా బేఖాతరు చేశారు. ఇప్పటికే  అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు అధికార పార్టీ ప్రజాప్రతినిధులను జోక్యం చేయించారు. దీనిని అడ్డం పెట్టుకుని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిని మభ్య పెట్టాలన్నది ఈఎన్‌సీ అధికారుల మరో వ్యూహంగా ఉంది. 

కాలాతీతం చేసేందుకే.. 

విచారణను కాలాతీతం చేసేందుకే ఈఎన్‌సీ ఆఫీసు కంకణం కట్టుకుంది. పాత్రధారులుగా ఉన్న అధికారుల అవినీతి బాగోతం క్వాలిటీ కంట్రోల్‌-విజిలెన్స్‌ డీఈఈ శ్రీనివాసరావు విచారణలో బయటపడింది. ఆయన రిపోర్టు ఇవ్వటమే తరువాయి. ఆయన నివేదిక ఇస్తే బాధ్యులైన అధికారులందరిపైనా సస్పెండ్‌ వేటు పడే అవకాశం ఉంది. తీవ్ర క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అవినీతి పనులకు పాల్పడిన అధికారుల పైరవీలకు లొంగిపోయిన ఈఎన్‌సీ అధికారులు ఈ కేసు విచారణను జాప్యం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కేసు విచారణను వీలైనంత కాలం జాప్యం చేయటం ద్వారా అవినీతి వ్యవహారాలను అందరూ మరిచిపోతారని, తద్వారా బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండవచ్చన్నది వారి పన్నాగం. దీనిని దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్‌ఈ నేతృత్వంలో విచారణ జరిపించాలన్న ప్రతిపాదనను తెచ్చారు. ఈ విచారణ ఎంతకాలం సాగుతుంది? సవ్యంగా జరుగుతుందా? అనేది ప్రశ్నార్థకమే. విజయవాడ రూరల్‌ మండలంలో జరిగిన రక్షిత మంచినీటి పథకం పనులపై వెలుగుచూసిన అవినీతి వ్యవహారాలపై సాక్షాత్తూ కలెక్టర్‌ దిల్లీరావు విచారణకు ఆదేశించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ ఏం చేశారు? అవినీతి మరక ఉన్న మరో అధికారిని విచారణాధికారిగా నియమించారు. వాస్తవానికి ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి ఆ అధికారే. ఆయనపై ఫిర్యాదులు వచ్చే సరికి సెలవు పెట్టేశారు. ఇప్పటికీ ఆ అధికారి విచారణ జరపలేదు. తన వ్యవహారాలు కూడా బయటపడతాయన్న కారణంతోనే ఆయన విచారణ నిలిపివేశారు. 

పైరవీలకు పెద్దపీట

ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఎన్‌సీ ఆఫీసు పరిధిలో పైరవీలకు పెద్దపీట వేస్తున్నారు. ఇటీవల కాలంలో శాఖాపరంగా డీఈఈలకు అడ్డగోలుగా వివిధ శాఖలకు డెప్యుటేషన్లు ఇచ్చేశారు. సర్వశిక్షా అభియాన్‌, మెడికల్‌ అండ్‌ హెల్త్‌, సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్లకు డెప్యుటేషన్‌ పద్ధతిలో డీఈఈలను పంపేశారు. దీని వెనుక భారీగా చేతులు మారాయి. డబ్బు ఇచ్చిన వారికి ఇచ్చినట్టుగా డెప్యుటేషన్‌పై బయటకు పంపారు. ఇలా డీఈఈలు వేరే శాఖలకు ఎందుకు వెళ్తున్నారంటే.. ఆయా శాఖల్లో ఇంజనీర్ల కొరతే కారణం. దీంతో డీఈఈలుగా వెళ్లినవారు అక్కడ  ఏకంగా ఈఈ పోస్టులు నిర్వహిస్తున్నారు. ఇలా ఆర్‌డబ్ల్యూఎస్‌లోని డీఈఈలు వరుసగా ఇతర శాఖలకు డెప్యుటేషన్‌పై వెళ్లిపోతున్నారు. దీంతో ఆర్‌డబ్ల్యూఎస్‌లో ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఏఈలను డీఈఈలుగా డెప్యుటేషన్‌ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఈ వ్యవహారంలో కూడా ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఎన్‌సీ అధికారులు వసూళ్లకు తెగపడ్డారు. అడ్డగోలుగా డబ్బు ఇచ్చిన వారికి పోస్టులు ఇచ్చేస్తున్నారు. 



Read more