రియల్‌ వసూల్‌

ABN , First Publish Date - 2022-04-29T05:13:31+05:30 IST

రియల్‌ వసూల్‌

రియల్‌ వసూల్‌

పెనమలూరు నియోజకవర్గంలో వైసీపీ నేతల దందా

కొత్త వెంచర్‌ వేస్తే చాలు.. వాలిపోతున్న గద్దలు

పార్టీ కార్యక్రమాల నిర్వహణ పేరుతో అధికారిక వసూళ్లు

ఎకరాకు రూ.2 లక్షలు చొప్పున ఇచ్చి తీరాల్సిందే

లేదంటే.. అధికారులకు చెప్పి నోటీసులు

బెంబెలేత్తుతున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు 


‘మమ్మల్ని సార్‌ పంపారు. మీరు లే అవుట్‌ వేస్తున్నారంట కదా. మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేం చూస్తాం. పార్టీ కార్యక్రమాలకు కాస్త డబ్బు సర్దమని సార్‌ చెప్పారు.’ పెనమలూరు నియోజకవర్గంలో రియల్టర్లకు స్థానిక ప్రజాప్రతినిధి అనుచరుల ఆఫర్‌ ఇది. ఇలా.. హుకుం జారీ చేయడమే కాదు.. ఎంత ఇవ్వాలో కూడా వారే లెక్కలేసి చెప్పేస్తారు. అంతా ఓకే అయితేసరి. ఎవరైనా కాదు.. కూడదు.. అంటే స్థానిక రెవెన్యూ, సీఆర్డీయే అధికారులు ప్రత్యక్షమైపోతారు. ‘నాలా ఉందా.. లే అవుట్‌ ప్లాన్‌కు అనుమతి ఉందా..’ అంటూ మొదలుపెడతారు. వంక పెట్టడానికి ఏమీ లేదనుకుంటే.. ‘ఆ కాల్వపై తూము ఎందుకు వేశారు..’ అంటూ ఏదో ఒక వంక వారే సృష్టించి, నోటీసులిచ్చి పనులు అడ్డుకుంటారు. కేవలం కొత్త వెంచర్ల ద్వారానే అధికార పార్టీ నేతల నెల మామూళ్లు సుమారు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లు ఉంటాయని అంచనా. దీనికి అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు అదనం.


(విజయవాడ - ఆంధ్రజ్యోతి) : పెనమలూరు నియోజకవర్గంలో రియల్‌ వ్యాపారం శరవేగంగా సాగుతోంది. విజయవాడను ఆనుకుని ఉండటం, కాలుష్యరహిత ప్రాంతం కావడంతో కానూరు, తాడిగడప, పోరంకి, యనమలకుదురు, చోడవరం, పెనమలూరు ప్రాంతాల్లో రియల్‌ వ్యాపారం సాగుతోంది. ఇదే అధికార పార్టీ నేతల పాలిట కల్పవృక్షమైంది. కొత్త వెంచర్‌ వేస్తే క్షణాల్లో వాలిపోతున్నారు. ప్రజాప్రతినిధి పేరు చెప్పి ఎకరాకు రూ.2 లక్షలు వసూలు చేస్తారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ పేరుతో ఈ వసూళ్ల దందా అధికారికంగానే జరుగుతోంది. అధికార పార్టీ నేతలను కాదని వెంచర్‌ వేస్తే ఇక వారికి కష్టాలు తప్పవు. స్థానిక వీఆర్వో మొదలు సీఆర్డీయే అధికారుల వరకూ అందరూ రంగంలోకి దిగిపోతారు. నోటీసుల పరంపర మొదలు పెడతారు. అంతా సక్రమంగా ఉన్నా ఏదో ఒక కొర్రీ వేసి అడ్డుకుంటారు. 

అనుమతులున్నా..

చోడవరంలో ఓ రియల్టర్‌ 10 ఎకరాల వెంచర్‌ వేశారు. అన్ని అనుమతులతో పక్కాగా వెంచర్లు వేస్తారని ఆయన సంస్థకు మంచి పేరుంది. అధికార పార్టీ నేతలు ఆయన వద్దకు వెళ్లారు. మా సంగతి ఏమిటన్నారు. ఏదో పార్టీ చందాలకు వచ్చారనుకున్న ఆయన రూ.లక్ష ఇచ్చారు. వెంటనే అధికార పార్టీ నేతల స్వరం మారింది. ‘అన్నా పెనమలూరు నియోజకవర్గంలో రూల్స్‌ మీకు తెలియవనుకుంటా..’ అంటూ మొదలుపెట్టారు. 10 ఎకరాల వెంచర్‌కు రూ.20 లక్షలు ఇచ్చి తీరాల్సిందేనని పట్టుబట్టారు. దానికి సదరు రియల్టర్‌ ససేమిరా అనడంతో వెనుదిరిగిన అధికార పార్టీ నేతలు మరుసటి రోజే స్థానిక రెవెన్యూ, సీఆర్డీయే అధికారులను ఆయన వెంచర్‌ వద్దకు పంపారు. వెంచర్‌కు వెళ్లే దారిలో కాల్వను పూడ్చేసినట్లు పక్కనున్న రైతులు ఫిర్యాదు చేశారని, పనులు నిలిపివేయాలని హుకుం జారీ చేశారు. వాస్తవానికి ఆ కాల్వ కింద ఎలాంటి సాగు భూమి లేదు. ఆయన వెంచర్‌లోకి వెళ్లాలంటే కాల్వ దాటి వెళ్లడం తప్ప మార్గం లేదు. దీంతో పెద్ద తూము వేసి కాల్వ ప్రవాహానికి అడ్డులేకుండా ఆయన నడకదారి ఏర్పాటు చేసుకున్నారు. మిగిలినవన్నీ సక్రమంగా ఉండటంతో దాన్ని సాకుగా చూపి పనులు ఆపేయాలని అధికారులు హుకుం జారీ చేశారు. ఆయనకు విషయం అర్థమై చేసేదేమీ లేక అప్పటికే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఉండటంతో అధికార పార్టీ నేతలు అడిగినంత చెల్లించుకుని పనులు ప్రారంభించుకున్నారు. 

అధికారిక ఫీజుతో సమానంగా.. 

తాడిగడపలో మూడెకరాల విస్తీర్ణంలో ఓ రియల్టర్‌ లే అవుట్‌ వేశారు. దానికి సీఆర్డీయే నుంచి ఎలాంటి అనుమతి లేదు. కేవలం వ్యవసాయ భూమిని నివాసయోగ్యమైన భూమిగా మార్చి నాలా ఫీజు చెల్లించారు. నాలా ఫీజును రెవెన్యూ అధికారులకు చెల్లించే సమయంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి అనుచరులు గద్దల్లా వాలారు. ఎకరాకు రూ.2 లక్షలు డిమాండ్‌ చేశారు. వీరికితోడు స్థానిక రెవెన్యూ అధికారులదీ అదే తంతు. వారు ఎకరాకు రూ.50 వేలు చెల్లించాలని హుకుం జారీ చేశారు. దీంతో సదరు రియల్టర్‌ మూడెకరాలకు కలిపి రూ.7.5 లక్షలు మామూళ్ల రూపంలో సమర్పించుకోవాల్సి వచ్చింది. సీఆర్డీయే అనుమతికి ఫీజులు కూడా   ఆ స్థాయిలో ఉండవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-04-29T05:13:31+05:30 IST