నెల్లూరులో సిటీ ప్లానింగ్‌ ‘ప్యాకేజీ’ దందా

ABN , First Publish Date - 2021-03-05T08:09:38+05:30 IST

నెల్లూరు నగర పాలక సంస్థలోని సిటీ ప్లానింగ్‌లో అవినీతి దందా పంథా మారింది. భవన నిర్మాణాల విస్తీర్ణాన్ని బట్టి వసూళ్లు చేసే విధానానికి స్వస్తి పలికిన టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్లు (టీపీఎస్‌)లు తాజాగా ప్యాకేజీ పద్ధతిని అమల్లోకి తెచ్చారు.

నెల్లూరులో సిటీ ప్లానింగ్‌ ‘ప్యాకేజీ’ దందా

భవన నిర్మాణ అనుమతులకు భారీగా వసూళ్లు

కొలతలు ఎలా ఉన్నా ప్యాకేజీ పక్కా..

ఇళ్లు, అపార్టుమెంట్లు అన్నిటికీ కట్టాల్సిందే..

లైసెన్సుడ్‌ ఇంజనీర్లతో కలిసి టీపీఎస్‌ల అక్రమాలు


నెల్లూరు (సిటీ), మార్చి 4 : 

నెల్లూరు నగర పాలక సంస్థలోని సిటీ ప్లానింగ్‌లో అవినీతి దందా పంథా మారింది. భవన నిర్మాణాల విస్తీర్ణాన్ని బట్టి వసూళ్లు చేసే విధానానికి స్వస్తి పలికిన టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్లు (టీపీఎస్‌)లు తాజాగా ప్యాకేజీ పద్ధతిని అమల్లోకి తెచ్చారు. అది అపార్టుమెంటైనా, విడి ఇల్లయినా సరే ప్యాకేజీ మొత్తాన్ని చెల్లించాల్సిందే. ఈ దందాలో లైసెన్సుడ్‌ ఇంజనీర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. కార్పొరేషన్‌లోని కొందరు ఉన్నతాధికారులు తెరవెనుక నడిపిస్తున్న ట్లు సమాచారం. 


కార్పొరేషన్‌కు ఆదాయాన్ని సమకూర్చే విభాగాల్లో కీలకమైనది సిటీ ప్లానింగ్‌. నగరంలో ఎవరు ఎలాంటి నిర్మాణం చేపట్టాలన్న ముందుగా ఈ విభాగం నుంచి  తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. నిర్మాణ విస్తీర్ణాన్ని బట్టి చదరపు మీటర్‌కు రూ.50 చొప్పున అప్రూవల్‌ ఫీజు ఉంటుంది. అలాగే తదుపరి పన్నులు కూడా ఉంటా యి. దీనిని ఆసరాగా తీసుకుంటున్న ఆ విభాగం సిబ్బంది భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారు. వాస్తవంగా ఉన్న నిర్మాణ కొలతలను తక్కువగా చూపించి నిర్మాణ దారుల నుంచి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో ఉండేదే అయినప్పటికీ గతంలో భవన నిర్మాణ విస్తీర్ణాన్ని బట్టి టీపీఎస్‌లు మామూళ్లు వసూలు చేసే వాళ్లు. కానీ ఇప్పుడు ప్యాకేజీ పద్ధతిని అమలు చేస్తున్నారు. ఈ ప్యాకేజీ కూడా ఏరియాను బట్టి మారుతోంది. జీ+5 అపార్టుమెంట్‌ నిర్మిస్తే విలీన, శివారు ప్రాంతాల్లో రూ.50 వేలు వసూలు చేస్తుండగా, నగరంలో అయితే రూ.లక్షకు పైగా అడుగుతున్నారు. ఇక ఇండివిడ్యువల్‌ ఇళ్లకైతే విలీన, శివారు ప్రాంతాల్లో రూ.20 వేలు, నగరంలో రూ.50 వేల వరకు తీసుకుంటున్నారు. ఈ అవినీతి ప్రవాహానికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులే అక్రమార్కులను ప్రొత్సహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


లైసెన్సుడ్‌ ఇంజనీర్లదే అంతా...

నగర పాలక సంస్థలోని సిటీ ప్లానింగ్‌ విభాగాన్ని లైసెన్సుడ్‌ ఇంజనీర్లే శాసిస్తున్నార న్న ఆరోపణలున్నాయి. వారి నుంచి ఇళ్ల నిర్మాణ ఫైల్‌ పోతే తప్ప అనుమతులు మంజూరు కాని పరిస్థితి నెలకొంది. ఎవరైనా నిర్మాణదారులు లైసెన్సుడ్‌ ఇంజనీర్ల ద్వారా కాకుండా దరఖాస్తు చేసుకుంటే దానికి కొర్రీలు పెట్టి తిరిగి ఇంజనీర్ల వద్దకే చేరేవిధంగా టీపీఎస్‌లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా ఇళ్ల నిర్మాణ అనుమతికి సంబంధించి కార్పొరేషన్‌కు చెల్లించాల్సిన ఫీజును, అవినీతి సొమ్ము ను కూడా కొందరు లైసెన్సుడ్‌ ఇంజనీర్లే వసూలు చేసి ఆపై టీపీఎస్‌లకు చేరుస్తున్నా రన్న విమర్శలున్నాయి. 


ఆ టీపీఎస్‌ రూటే సెప‘రేటు’ 

నగరానికి దక్షిణ ప్రాంతంలో టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజరుగా పని చేస్తున్న ఓ  అధికారి అవినీతి దందాలో అందరికన్నా ఓ అడుగు ముందుకేసి నిర్మాణదారులను హడలెత్తిస్తున్నారు. ఆయన పని చేసేది శివారు ప్రాంతమైనప్పటికీ మిగతా టీపీఎస్‌ లతో పోల్చితే డబుల్‌ రేటు వసూలు చేస్తున్నారన్న వాదన ఉంది. ఇండివిడ్యువల్‌ ఇంటికి రూ.70 వేలు డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. ఇక  అపార్టుమెంట్‌కైతే లక్షల్లోనే గుంజుతున్నట్లు కార్పొరేషన్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Updated Date - 2021-03-05T08:09:38+05:30 IST