ఇరిగేషన్‌ పంపుల్లో అవినీతి

ABN , First Publish Date - 2020-09-03T08:12:57+05:30 IST

అవినీతి రహిత పాలన అందిస్తానన్న మీ వాగ్దానానికి విరుద్ధంగా మీ ప్రభుత్వంలోని కీలకమైన జలవనరుల శాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను...

ఇరిగేషన్‌ పంపుల్లో అవినీతి

గౌరవ ముఖ్యమంత్రి, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి

అవినీతి రహిత పాలన అందిస్తానన్న మీ వాగ్దానానికి విరుద్ధంగా మీ ప్రభుత్వంలోని కీలకమైన జలవనరుల శాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను మీ దృష్టికి తేవాలన్న సదుద్దేశంతో రాస్తున్న బహిరంగ లేఖల పరంపరలో ఇది రెండోది.


గోదావరి డెల్టాలో 2015–16 రబీ కాలంలో నదిలో నీటి లభ్యత తగినంత ఉండదన్న కారణంగా కాటన్ బ్యారేజికి దిగువ నుంచి ప్రధాన కాల్వలకు పంపుల ద్వారా నీరు తోడాలని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఇరిగేషన్ సలహా సంఘాల్లో నిర్ణయించారు. దీని కోసం ఐదు ప్రాంతాలను ఎంపిక చేసి పంపులు పెట్టారు. ఈ మొత్తం వ్యవహారంలో అవినీతి, అక్రమాలు జరిగినట్లు అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన వార్తపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ దర్యాప్తు చేసి రిపోర్ట్ నం.94 (సి.నం.369/వి&ఇ/ఇ/2016)ను ---సమర్పించింది. ఆ నివేదిక పలు కోణాలలో జరిగిన కుంభకోణాల గురించి వెల్లడించింది.


l పంపులు పెట్టాలని నిర్ణయించిన తర్వాత, అంచనాలు తయారు చేసి, అవసరమైన అనుమతులు తీసుకుని టెండర్ ప్రక్రియ ద్వారా పనులు అప్పగించటానికి తగినంత సమయమున్నప్పటికీ, పథకం ప్రకారం కాలయాపన చేశారు. కృత్రిమంగా అత్యవసర పరిస్థితి సృష్టించి నిబంధనలకు విరుద్ధంగా పంపులు పెట్టే పనిని ముందుగా ఎంపిక చేసుకున్న కాంట్రాక్టర్లకు అప్పగించారు. 


l ఇరిగేషన్ ఎస్.ఎస్.ఆర్ ప్రకారం ఒక గంటకు ఒక హార్స్‌పవర్‌కు రూ.19 చెల్లించవలసి ఉండగా పబ్లిక్ హెల్త్ ఎస్.ఎస్.ఆర్ ప్రకారం రూ.53 చెల్లించారు. ఆ ప్రకారం రూ.16.46 కోట్లు అదనంగా చెల్లించారు.


l పంపులు పని చేసినట్లు చూపించిన గంటల లెక్కే కానీ ఎంత నీరు తోడారన్న లెక్కలు లేవు. కొన్ని పంపులైతే ఒక్క సెకను కూడా విరామం లేకుండా వారాల తరబడి పని చేసినట్లు రికార్డులలో పేర్కొన్నారు.


ఈ అక్రమాలకు సంబంధించి ఆనాటి గోదావరి డెల్టా సిఇ ఎస్.హరిబాబు, ధవళేశ్వరం సర్కిల్ ఎస్ఇ ఎస్.సుగుణాకరరావు, ఏలూరు సర్కిల్ ఎస్ఇలు ఎం.వి.రమణ, కె. శ్రీనివాసరావుతో పాటు అయిదుగురు ఇఇలు, ఆరుగురు డిఇఇలు, ఆరుగురు ఏఇఇలపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ దుర్వినియోగమైన రూ. 16.46 కోట్లను కాంట్రాక్టర్లు/ అధికారుల నుంచి రాబట్టమని ఎన్ఫోర్స్మెంట్ నివేదిక సిఫారసు చేసింది. నాటి విజిలెన్స్ కమిషనర్ ఆ నివేదికను యథాతథంగా ఆమోదిస్తూ అందులోని సిఫార్సులను అమలు చేయమని జలవనరుల శాఖ కార్యదర్శికి లేఖ పంపారు. (లెటర్ నం. 4479/ వి.సి-ఏ.ఇ 2/2017-1 తేదీ 24.10.2017). ఇక తదుపరి చర్యలు తీసుకోకుండా అప్పటి జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తాత్సారం చేస్తుంటే నేను రాసిన వ్యాఖ్యానాన్ని మీ పత్రిక ప్రచురించింది కూడా.


దీనిపై నేను ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాను. ఈలోగా మీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. నా పిల్ విచారణ సందర్భంగా విజిలెన్స్ రిపోర్టుననుసరించి తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు నేరారోపణ పత్రాలు సిద్ధమయ్యాయని కొత్త అడ్వొకేట్ జనరల్ కోర్టుకు నివేదించారు. దానిపై 2019 జూలై 29న, నాటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్, జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం చట్టప్రకారం విచారణ ప్రక్రియ సాగించి‍ ఆరు మాసాల లోపు పూర్తి చేయమని సూచిస్తూ కేసు డిస్పోజ్ చేసింది. కానీ కోర్టుకు నివేదించిన ప్రకారం, సిద్ధమైన నేరారోపణ పత్రాలను ఇంతవరకు కనీసం జారీ చేయలేదంటే జలవనరుల శాఖ అధికారులను ఏమనాలి?


అదలా ఉండగా, గతంలో ఎప్పుడో పబ్లిక్ హెల్త్ రేటు ఇచ్చారు కాబట్టి ఈసారి కూడ ఇవ్వటంలో తప్పు లేదనే వాదనతో రూ.16.46కోట్ల అవినీతికి ఆమోదముద్ర వేయటానికి జలవనరుల శాఖ ఉన్నతాధికారి ఫైలు సిద్ధం చేసి మరలా విజిలెన్స్ కమిషన్‌కు పంపినట్లు తెలుస్తోంది. ఎప్పుడైనా ఇరిగేషన్ ఎస్.ఎస్.ఆర్ లో ఒక రేటు ఉండగా వేరే విభాగం ఎస్.ఎస్.ఆర్ లో రేటును తీసుకోవచ్చా? పొరపాటునో, ఉద్దేశ పూర్వకంగానో ఎప్పుడో ఆ తప్పు చేస్తే అదే ప్రామాణికం అవుతుందా? ఆ సాకుతో రూ.16.46 కోట్ల ప్రజాధనం గోదావరి పాలు కావలసిందేనా? 


ఇక్కడ అత్యంత కీలకమైన ఒక వాస్తవాన్ని మీ దృష్టికి తీసుకువస్తాను. ఈ కేసులో అప్పటి ఇంజనీర్- ఇన్- చీఫ్ సిఫారసు మేరకు గోదావరి డెల్టా చీఫ్ ఇంజనీర్ తీసుకున్న చర్యలు – మూడురెట్లు అదనపు రేట్లు ఇవ్వటం, ఏ అనుమతులు తీసుకోకపోవడం, నామినేషన్ మీద పనులు ఇవ్వటం – వంటి చర్యలకు ఆమోదముద్ర వేస్తూ ఆనాటి కార్యదర్శి జీఓ ఇచ్చారు. 


రెండు సంవత్సరాల తర్వాత 2017–-18 రబీలో కూడా అదే స్థాయిలో నీటి కొరత ఏర్పడింది. ఆనాడున్న చీఫ్ ఇంజనీర్ కూడా పబ్లిక్ హెల్త్ రేటు ప్రకారం గంటకు రూ.60తో ప్రతిపాదనలు పంపారు. కానీ అదే ఇంజనీర్- ఇన్- చీఫ్ తమ పరిశీలన ప్రకారం ఇరిగేషన్ రేటు రూ.30.59 మాత్రమే సరైనదని డెల్టా సిఇ ప్రతిపాదనను తోసిపుచ్చారు. {ఎల్ ఆర్ నం. ఇ ఎన్ సి(ఐ) /డిసిఇ(డిడబ్ల్యూ)ఓటి-4/ఏ ఇ ఇ-23/రబి 2017–-18 తేదీ 01.01.2018} అదే కార్యదర్శి రూ. 30.59 ప్రకారమే జీఓ జారీ చేశారు. 


2017–-18లో రూ.30.59 రేటు సరైనదయితే 2015–-16లో రూ.53 రేటు ఏ విధంగా సమర్థనీయమో ఆలోచించండి. 2017–-18లో సిఇ ప్రతిపాదనను నిశితంగా పరిశీలించి తిరస్కరించిన ఇ-ఇన్-సి 2015–-16లో ఆ పరిశీలన చేయకుండా ఆ తప్పుడు రేట్లనే ఆమోదించమని సిఫారసు చేయడమేమిటి? కార్యదర్శి రెంటికీ తలూపడమేమిటి? ఇప్పుడున్న అధికారి కోర్టు ధిక్కరణకు పాల్పడి అవినీతి భాగోతానికి తాళం వేయడమేమిటి? ఈ విషయాన్ని ఛేదించి, చేసిన వాగ్దానం మేరకు అవినీతిరహిత, పారదర్శక పాలన అందించవలసిన బాధ్యత మీపైనే ఉంది.

భవదీయుడు,

నిమ్మకాయల శ్రీరంగనాధ్,

సీనియర్‌ పాత్రికేయుడు

Updated Date - 2020-09-03T08:12:57+05:30 IST