అక్ర..మార్కులు

ABN , First Publish Date - 2022-05-09T06:07:22+05:30 IST

అక్ర..మార్కులు

అక్ర..మార్కులు

ఇంటర్మీడియెట్‌ ఓపెన్‌ స్కూల్‌ పరీక్షల్లో అక్రమాలు

సబ్జెక్టుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల చొప్పున వసూలు

నగదు చెల్లిస్తే యథేచ్ఛగా కాపీ

కుదరకపోతే మూల్యాంకనంలో పాస్‌ మార్కులు

ప్రైవేట్‌ విద్యాసంస్థలు, సూపర్‌వైజర్లు, ఇన్విజిలేటర్ల అవినీతి బాగోతం


చదువుకునే స్థాయి నుంచి చదువుకొనే స్థాయికి పరిస్థితులు మారిపోతున్నాయి. పరీక్షలు రాసే స్థాయి నుంచి డబ్బులిచ్చి రాయించుకునే స్థాయి మొదలైపోయింది. ఇందుకు ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియెట్‌ ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలే ఉదాహరణ. కాపీ కొట్టి రాయడానికి ఓ రేటు, ఇన్విజిలేటర్‌, సూపర్‌వైజర్‌, రూట్‌ ఆఫీసర్లను కవర్‌ చేయడానికి ఇంకో రేటు, ఇవన్నీ కుదరకపోతే మూల్యాంకనం సమయంలోనైనా తగు మార్కులేసేందుకు మరొక రేటు నిర్ణయించి బేరాలు సాగిస్తున్నారు. పలకా బలపం పట్టి భావిభారత పౌరులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే ఈ అక్రమాల పరీక్ష రాయిస్తుండటం విచారించాల్సిన విషయం.


ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌ అంశాన్ని మరువక ముందే ఇంటర్మీడియెట్‌ ఓపెన్‌ స్కూల్‌ పరీక్షల నిర్వహణలో అక్రమాలు బయట పడుతున్నాయి. చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూ, పదోన్నతి కోసం ఇంటర్‌ అర్హత సాధించేందుకు ప్రైవేట్‌ విద్యాసంస్థల నుంచి పరీక్షలు రాసేవారే టార్గెట్‌గా అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ నెల 7 నుంచి ఇంటర్మీడియెట్‌ ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలు రాసేవారు అధికశాతం మంది చిరుద్యోగులే కావడంతో వారి నుంచి ఒక్కో సబ్జెక్టుకు రెండు నుంచి మూడు వేల రూపాయల చొప్పున వసూళ్లకు పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం. పరీక్షా కేంద్రంలో కాపీ కొట్టడంతో పాటు ఇన్విజిలేటర్లు సహకరిస్తారని హామీ ఇస్తున్నారు. పరీక్షల్లో సరిగ్గా, సక్రమంగా రాయకున్నా జవాబు పత్రాల మూల్యాంకనంలోనైనా పాస్‌  చేయించి సర్టిఫికెట్లు చేతిలో పెడతామని చెప్పి నగదు వసూళ్లకు పాల్పడుతున్నారు.

22 సెంటర్లు, 3,699 మంది విద్యార్థులు

ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఇంటర్‌ ఓపెన్‌ స్కూల్‌ పరీక్షల నిర్వహణ కోసం 22 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మచిలీపట్నం డివిజన్‌లో ఈనెల 7 నుంచి 21వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేందుకు టైమ్‌టేబుల్‌ను ప్రకటించారు. 7న తెలుగు, హిందీ, ఉర్దూ పరీక్షలు జరిగాయి.  10న ఇంగ్లీష్‌, 12న లెక్కలు, చరిత్ర, వ్యాపార గణశాస్త్రం, 14న జీవశాస్త్రం, వాణిజ్య, వ్యాపార శాస్త్రం, గృహ విజ్ఞానశాస్త్రం పరీక్షలు జరగనున్నాయి. 17న భౌతికశాస్త్రం, రాజనీతిశాస్త్రం/ పౌరశాస్త్రం, మనోవిజ్ఞానశాస్త్రం, 19న రసాయనశాస్త్రం, ఆర్థికశాస్త్రం, సామాజికశాస్త్రం, ఈనెల 21న అన్ని వృత్తి విద్యా సబ్జెక్టులకు సంబంధించి పరీక్షలు నిర్వహిస్తారు. 

ఒక్కో సబ్జెక్టుకు రూ.వేలల్లో వసూలు

ఇంటర్మీడియెట్‌, పదో తరగతి రెగ్యులర్‌ పరీక్షల మాదిరిగా ఓపెన్‌ స్కూల్‌ పరీక్షల నిర్వహణపై అధికారులు అంతగా నిఘా పెట్టరు. దీనినే అలుసుగా తీసుకుని అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. పరీక్ష ఫీజు చెల్లించిన సమయంలో ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు పాస్‌ గ్యారెంటీ కావాలంటే ఒక్కో సబ్జెక్టుకు రూ.2 వేల నుంచి రూ.3 వేలకు బేరం కుదుర్చుకుని నగదు వసూలు చేస్తున్నారు. ఓపెన్‌ స్కూల్‌ పరీక్షల నిర్వహణ కోసం ఉపాధ్యాయులనే ఎంపిక చేసి ఇన్విజిలేటర్లుగా, సూపర్‌వైజర్లుగా, రూట్‌ ఆఫీసర్లుగా నియమిస్తున్నారు. విద్యాశాఖలో ఉన్నతాధికారుల నుంచి ఇన్విజిలేటర్ల వరకు ఎవరికి ఎంత మొత్తంలో చెల్లించాలో నిర్ణయిస్తున్నారు. నగదు పంపకాల వ్యవహారం మొత్తం తెరవెనుక  నడిపేందుకు గూడూరు మండలం నుంచి ఒక ఉపాధ్యాయుడిని ప్రత్యేకంగా నియమించారు. ఇప్పటికే 2,500 మంది పదో తరగతి ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు రాశారు. ఇంటర్మీడియెట్‌ ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు 3,699 మంది రాస్తున్నారు. వీరిలో కొందరిని పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేలా చూస్తామని చెప్పి రూ.3 కోట్లకు పైగా వసూలు చేసినట్లు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు చెప్పుకొంటున్నారు. రెండేళ్లుగా కొవిడ్‌-19 కారణంగా ఈ పరీక్షలు జరగకపోవడంతో, ఈ ఏడాది అధికశాతం మంది ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు ఫీజు చెల్లించారు. దీనినే అదునుగా తీసుకుని పరీక్షల నిర్వహణ కోసం నియమించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రైవేట్‌ విద్యాసంస్థల ప్రతినిధులతో కుమ్మక్కై వసూళ్ల దందాకు తెరతీశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 


విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటాం..

 ఇంటర్‌ ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాం. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. పరీక్షలు రాసే అభ్యర్థుల నుంచి నగదు వసూలు చేసిన సంఘటనపై విచారణకు ఆదేశిస్తాం. పరీక్షల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై తప్పక చర్యలు తీసుకుంటాం. - తాహెరా సుల్తానా, జిల్లా విద్యాశాఖాధికారి

Read more