గుడివాడ గడపలో కడప కబ్జా

ABN , First Publish Date - 2022-05-07T05:51:46+05:30 IST

గుడివాడ గడపలో కడప కబ్జా

గుడివాడ గడపలో కడప కబ్జా
కడప వ్యక్తుల చేతిలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమి

రూ.5 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి హాంఫట్‌

సీఎం జగన్‌ మా మేనల్లుడే అంటూ దౌర్జన్యం

కడప గూండాలకు మాజీమంత్రి వత్తాసు

ఎలాంటి అనుమతులు లేకుండా చేపల చెరువు తవ్వకం

మట్టి మాకు.. చెరువు మీకు అని బేరాలు


ఓవైపు కేసినోలు.. మరోవైపు పేకాట శిబిరాలు.. ఇంకోవైపు మట్టి అక్రమ తవ్వకాలతో రాష్ట్రవ్యాప్తంగా గుడివాడకు గుర్తింపు తెచ్చిన మాజీమంత్రి తాజాగా మరో బాగోతానికి శ్రీకారం చుట్టారు. కడప నుంచి వచ్చిన గ్యాంగ్‌ సాయంతో ఏకంగా రూ.5 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని మింగేస్తున్నారు.


(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : గుడివాడ నియోజకవర్గలోని నందివాడ మండలం పుట్టగుంటలో సుమారు తొమ్మిది ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు కడపకు చెందిన కొందరు వ్యక్తులు స్థానికంగా ఉన్న కొందరు అధికార పార్టీ నాయకులతో కలిసి స్కెచ్‌ వేశారు. పుట్టగుంటలో సర్వే నెంబర్లు 198/3, 202/3ఏ, 202/9, 10, 11, 12, 13, 14, 15ల్లో సుమారు తొమ్మిది ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఈ స్థలంపై కన్నేసిన స్థానిక నాయకులు కొందరు పక్కా వ్యూహం ప్రకారం దానికి దొంగ డాక్యుమెంట్లు సృష్టించారు. ఎంఎన్‌కే జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ భూమి విలువ సుమారు రూ.5 కోట్లపైమాటే. ఈ భూమి ఆక్రమణకు 2017లోనే దొంగ డాక్యుమెంట్లతో స్థానిక నాయకులు ప్రయత్నాలు చేశారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఉండటంతో తమ ఆట సాగదని మిన్నకుండిపోయారు. ప్రభుత్వం మారాక మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టారు.

కడప వ్యక్తుల సాయంతో.. 

స్థానిక వైసీపీ నాయకులు కడపకు చెందిన కొందరు వ్యక్తులతో జత కలిశారు. తొమ్మిది ఎకరాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. జగన్‌ మేనమామనంటూ ఓ వ్యక్తి గ్రామంలో హడావుడి చేస్తూ ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమిలో చెరువు తవ్వకాలు చేయిస్తున్నారు. వీరికి మాజీ మంత్రి కొడాలి నాని అనుచరులు వత్తాసు పలుకుతున్నారు. చెరువు కోసం తవ్విన మట్టిని నాని అనుచరులు తరలించుకుపోతున్నారు. ఈ తవ్వకాలకు అటు అధికారుల నుంచి కానీ, ఇటు గ్రామస్థుల నుంచి కానీ ఆటంకాలు ఎదురుకాకుండా కాపలా కాస్తున్నారు. దీంతో అధికారులు సైతం ఈ కబ్జాకాండపై నోరు మెదపడం లేదు. 

ప్రభుత్వ భూమిని మార్చేశారు..

ఇక్కడ మేము చెప్పినట్టు జరగాలి. లేదంటే బదిలీ చేయించేస్తామని మాజీమంత్రి అనుచరులు అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారు. దీంతో అక్రమంగా మట్టి తరలిస్తున్నా.. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిలో చేపలు చెరువులు తవ్వేస్తున్నా.. రెవెన్యూ అధికారులు కానీ, మత్స్యశాఖ అధికారులు కానీ, మైనింగ్‌ అధికారులు కానీ కన్నెత్తి చూడట్లేదు. 

- నందివాడ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్‌ చేసే సమయంలో అదనపు స్థలాన్ని చూపాల్సి వచ్చినప్పుడు ప్రస్తుతం కబ్జాదారుల ఆధీనంలో ఉన్న భూమినే చూపారు. 

- కబ్జాదారుల ఆధీనంలో ఉన్న స్థలంలోనే విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణం జరుగుతోంది. ప్రభుత్వ భూమిగా పేర్కొన్న అధికారులే దాన్ని సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి కేటాయించారు. 

- హెల్త్‌ సబ్‌ సెంటర్‌ నిర్మాణానికి కూడా ఇదే స్థలాన్ని కేటాయించారు. అలాంటి భూమిని ప్రైవేట్‌ వ్యక్తులు కబ్జా చేసి రాత్రికి రాత్రే చెరువులు తవ్వేస్తుంటే అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.




Read more