బి.మఠంలో అవినీతిని ప్రక్షాళన చేయాలి

ABN , First Publish Date - 2021-06-14T06:12:11+05:30 IST

బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, మఠంలో అవినీతిని ప్రక్షాళన చేయాలని విశ్వకర్మ పరిరక్షణ వేదిక అధ్యక్షులు, శ్రీశైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి తెలిపారు.

బి.మఠంలో అవినీతిని ప్రక్షాళన చేయాలి
ప్రొద్దుటూరులో అమ్మవారిని దర్శించుకుంటున్న పీఠాధిపతులు

పీఠాధిపతి మృతిపై అనుమానాలు

విశ్వకర్మ పరిరక్షణ వేదిక అధ్యక్షులు, శ్రీశైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి

ప్రొద్దుటూరు అమ్మవారిశాలను దర్శించుకున్న పీఠాధిపతులు

బ్రహ్మంగారిమఠం/ప్రొద్దుటూరు టౌన/చాపాడు, జూన 13: బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి వీరభోగ  వసంత వేంకటేశ్వరస్వామి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, మఠంలో అవినీతిని ప్రక్షాళన చేయాలని విశ్వకర్మ పరిరక్షణ వేదిక అధ్యక్షులు, శ్రీశైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి తెలిపారు. ఆదివారం బ్రహ్మంగారిమఠంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మఠంలో జరిగే అవినీతి అక్రమాలపై, పీఠాధిపతి మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు. మఠాధిపతి నిర్ణయానికి వీలునామాలు చెల్లవని ధర్మం ప్రకారం వంశపార్యంపర్యంగా వస్తుందని ఆయన తెలిపారు. పలు కులసంఘాల పెద్దలు తొలి భార్య కుమారులు అయిన వెంకటాద్రిస్వామినే పీఠాధిపతిగా చేయాలని రాత పూర్వకంగా అందజేశారని ఆయన తెలిపారు. ధర్మశాస్త్రం ఏ విధంగా ఉంటుందో దాని ప్రకారమే మేము కార్యాచరణ రూపొందిస్తామని ఆయన తెలిపారు. 20 మంది పీఠాధిపతులు కలిసి ఆలోచన చేసి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నామని వారు అన్నారు. రాబోయే రోజుల్లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారి చరిత్ర, గొప్పదనం, విశిష్ఠత గొప్పదవుతుందనే భావనతోనే మేము దేవాదాయ శాఖ రిజిసా్ట్రర్‌ వెల్లంపల్లె శ్రీనివాస్‌ అనుమతితో మఠానికి వచ్చామని, మఠాధిపతుల బృందంపైనే రెండో భార్య అయిన మారుతీ మహాలక్షుమ్మ డీజీపీకి లేఖ రాయడం చాలా బాధాకరమైన విషయమన్నారు. త్వరలోనే వంద మంది పీఠాధిపతులతో బ్రహ్మంగారిమఠంలో పీఠాధిపతి పట్టాభిషేకానికి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు వస్తామని ఆయన తెలిపారు. భక్తుల మనోభావాలను సేకరించి తమ నివేదికను దేవాదాయ శాఖ మంత్రికి అందజేస్తామన్నారు. అంతకుముందు పీఠాధిపతులు ప్రొద్దుటూరు పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. దేశంలోనే గొప్ప దివ్యక్షేత్రం అమ్మవారిశాల అని తెలిపారు. హిందూ పరిరక్షణ కోసం శైవక్షేత్రంలో ఒక పాఠశాలను కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నామని తెలిపారు. హిందూ పరిరక్షణ కోసం పాఠశాల ఏర్పాటు చేస్తే రూ.10 లక్షలు విరాళం ఇస్తామని ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు బుశెట్టి రామమోహన ప్రకటించారు. అనంతరం కరోనా నివారణకోసం శ్రీరక్ష, సురక్ష ఆయుర్వేద మందును ప్రారంభించి శివస్వామి ఆర్యవైశ్యులకు పంపిణీ చేశారు. పీఠాధిపతులను ఆర్యవైశ్య సభ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి అమ్మవారి మెమోంటోలను బహూకరించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్యదర్శి మురికి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు జొన్నలగడ్డ రవీంద్రబాబు, సహాయ కార్యదర్శి మేడా వెంకటేశ్వర్లు, కోశాధికారి పరమేష్‌, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు అల్లాడుపల్లెలోని వీరభద్రస్వామి దేవాలయంలో దేవతామూర్తులు వీరభద్రస్వామి, శివుడిని శ్రీశైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి బృందం ఆదివారం దర్శించుకున్నారు. 


బిగ్‌పర్సనగా శంకర్‌ బాలాజీ

ప్రముఖ పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారిమఠం బిగ్‌పర్సన ఇనచార్జ్‌గా దేవదాయ అసిస్టెంట్‌ కమిషనర్‌ శంకర్‌బాలాజీ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లె శ్రీనివాస్‌ ఆదేశాలతో ఆయన మఠం ఆర్థిక లావాదేవీలను చూడటానికి ఆయన బాధ్యతలు చేపట్టారు.

Updated Date - 2021-06-14T06:12:11+05:30 IST