అవినీతి ‘ముద్ర’

ABN , First Publish Date - 2022-01-21T05:48:59+05:30 IST

అదో అవినీతి ముద్ర.. పేద, మధ్యతరగతి ప్రజలనే టార్గెట్‌గా పెట్టుకొని కోట్ల రూపాయలు డిపాజిట్లుగా వసూలు చేసి గడువు ముగిసినా చెల్లించకుండా బోర్డు తిప్పేసింది.

అవినీతి ‘ముద్ర’

- పేద, మధ్య తరగతి కుటుంబాలే టార్గెట్‌

- కోట్ల రూపాయల వసూళ్లు

- చైర్మన్‌, డైరెక్టర్లే సూత్రధారులు

- డిపాజిట్‌దారుల ఒత్తిడితో ఒకరి ఆత్మహత్య

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

అదో అవినీతి ముద్ర.. పేద, మధ్యతరగతి ప్రజలనే టార్గెట్‌గా పెట్టుకొని కోట్ల రూపాయలు డిపాజిట్లుగా వసూలు చేసి గడువు ముగిసినా చెల్లించకుండా బోర్డు తిప్పేసింది. సంస్థలో ఉద్యోగులుగా చేరి తాము డిపాజిట్లు సేకరించడమే కాకుండా సొంత డబ్బు కూడా పెట్టుబడిగా పెట్టి సంస్థ ఎదుగుదలకు తోడ్పడినవారు ఇప్పుడు డిపాజిట్‌దారుల ఒత్తిడి భరించలేక ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు.

2017లో ప్రారంభం

 2017లో ముద్ర అగ్రికల్చర్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మల్టీస్టేట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ సంస్థగా ఏర్పడింది. ఈ సంస్థ రెండు తెలుగు రాష్ర్టాల్లో సుమారు 400 వరకు బ్రాంచిలు ఏర్పాటు చేసుకొని 2,500 మందిని ఉద్యోగులుగా చేర్చుకున్నది. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా పరిధిలో మండలానికి ఒకటి, మున్సిపాలిటీలలో రెండు చొప్పున 80 బ్రాంచిలను ఏర్పాటు చేసింది. జిల్లా కేంద్రంలో మూడు బ్రాంచిలు నెలకొల్పారు. ఒక్కో బ్రాంచిలో ఆరు నుంచి ఎనిమిది మంది వరకు ఉద్యోగులను నియమించుకుని ఒక్కో ఉద్యోగి నుంచి రెండు లక్షల రూపాయల వరకు వసూలు చేశారు.

రోజుకు 20 రూపాయల నుంచి 500 వరకు..

 ఉద్యోగులు తమకున్న పరిచయాలతో తమ ప్రాంతాల్లో పేద, మధ్య తరగతి ప్రజలను సంస్థలో సభ్యులుగా చేర్పించి వారి నుంచి రోజువారి 20 రూపాయల నుంచి 500 రూపాయల వరకు డిపాజిట్లు వసూలు చేశారు. ఒక్కో బ్రాంచి నుంచి సుమారు 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు డిపాజిట్లు సేకరించారని, ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 50 నుంచి 80 కోట్ల రూపాయలు వసూలు చేశారని సమాచారం. రైతులు, కూలీలు, చిరు వ్యాపారులు, మధ్య తరగతి ప్రజలు ఈ సంస్థలో ఖాతాదారులుగా చేరి కష్టపడి సంపాదించుకున్న సొమ్మును స్థానిక ఏజెంట్ల ద్వారా డిపాజిట్లుగా పెట్టారు. 

కాల పరిమితి ముగిసినా తర్వాత బ్రాంచీలకు తాళాలు

డిపాజిట్ల కాల పరిమితి ముగిసినా తిరిగి డబ్బు చెల్లించకుండా సవాలక్ష కారణాలు చెప్తూ ముఖం చాటేస్తూ వచ్చిన సంస్థ ఇప్పుడు ఏకంగా బోర్డు తిప్పేసింది. అటు డిపాజిట్‌ దారులకు డబ్బు చెల్లించక, ఏడు నెలలుగా సంస్థలో పనిచేసే ఉద్యోగులకు వేతనాలు ఇవ్వక బ్రాంచీలకు తాళాలు వేసింది. సంస్థ కార్యాలయాలకు తాళాలు పడి జవాబు చెప్పేవారు లేకపోవడంతో డిపాజిట్‌దారులందరూ ఆ సంస్థలో ఉద్యోగులుగా చేరి డిపాజిట్లు వసూలు చేసిన స్థానిక ఉద్యోగుల వెంటపడి ఒత్తిడి తెస్తున్నారు. డిపాజిట్‌దారుల ఒత్తిడి భరించలేక సంస్థకు చెందిన ఉద్యోగి సాయికృష్ణ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరికొందరు ఉద్యోగులు కూడా తమ పరిస్థితి కూడా ఇంచుమించుగా అలాగే ఉందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది సంస్థ ఉద్యోగులు డిపాజిట్‌దారుల ఒత్తిళ్లు భరించలేక ఊరు విడిచి వెళ్తున్నారు. మరోవైపు కాయకష్టం చేసి సంపాదించుకున్న సొమ్ము దోచుకున్న దొంగలను పట్టివ్వాలంటూ డిపాజిట్‌దారులు స్థానికంగా ఉన్న సంస్థ ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నారు. వారు కూడా పెట్టుబడి పెట్టి నష్టపోయిన వారే కావడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ముద్ర సంస్థపై విచారణ జరిపించి కోట్లాది రూపాయలు కోల్పోయిన బాధితులకు న్యాయం చేకూర్చాల్సిన అవసరం ఉన్నది. 

Updated Date - 2022-01-21T05:48:59+05:30 IST