ఎమ్మెల్యేలపై అవినీతి కేసులు ఇక కష్టం!

ABN , First Publish Date - 2021-09-07T06:47:18+05:30 IST

ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్లు తదితర

ఎమ్మెల్యేలపై అవినీతి కేసులు ఇక కష్టం!

  • దర్యాప్తునకు డీజీ స్థాయి అధికారి అనుమతి కోరాలి
  • కేంద్ర, రాష్ట్ర ప్రజాప్రతినిధులకు చట్టపరమైన రక్షణ
  • అవినీతి నిరోధక చట్టానికి మూడేళ్ల కిందట సవరణ
  • తాజాగా వెలువడిన అమలు మార్గదర్శకాలు


 

న్యూఢిల్లీ, సెప్టెంబరు 6: ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్లు తదితర పబ్లిక్‌ సర్వెంట్లపై అవినీతి కేసులు పెట్టే విధానాన్ని నియంత్రిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం మార్గదర్శకాలు జారీ చేసింది. వారి అవినీతిపై దర్యాప్తు చేసేందుకు డీజీ స్థాయికి తగ్గని అధికారి సింగిల్‌ విండో పద్ధతిలో కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి కోరాలని స్పష్టం చేసింది. ప్రభుత్వానికి లేదా సంబంధిత పబ్లిక్‌ సర్వెంట్‌ను తొలగించే అధికారం ఉన్న వ్యక్తికి ఈ ఫిర్యాదును ఇవ్వాలని చెప్పింది.


సింగిల్‌ విండో వ్యవస్థలో వచ్చే దర్యాప్తు ప్రతిపాదనలను అండర్‌ సెక్రటరీకి తగ్గని స్థాయి అధికారి స్వీకరించాలని చెప్పింది. సదరు అధికారులను ముందే ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. 1988లో రాజీవ్‌గాంధీ హయాంలో తెచ్చిన అవినీతి నిరోధక చట్టంలోని కఠిన నిబంధనలను సడలిస్తూ 2018లో కొత్త చట్టం తెచ్చారు. దానికి సంబంధించిన అమలు మార్గదర్శకాలను సోమవారం నోటిఫై చేశారు. పబ్లిక్‌ సర్వెంట్ల అవినీతిపై దర్యాప్తునకు అనుమతి ఇచ్చే విషయంలో దేశవ్యాప్త ఏకరూపత సాధించేందుకు ఈ సవరణలు తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది.


మార్గదర్శకాల ప్రకారం డీజీ స్థాయికి తగ్గని అధికారి మాత్రమే కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల చైర్మన్లు, ఎండీలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల చైర్మన్లు, ఎండీలపై అవినీతి కేసులకు సంబంధించి దర్యాప్తు చేయడానికి అనుమతి కోరగలరు. డీజీ స్థాయి అధికారి కింది నుంచి తన వరకు వచ్చిన ఫిర్యాదులోని అంశాలు సంబంధిత పబ్లిక్‌ సర్వెంట్‌ను నిందితుడిగా గుర్తించే విధంగా ఉన్నాయో లేదో తరచి చూడాలి.


సదరు పబ్లిక్‌ సర్వెంట్‌ తన అధికార విధుల్లో భాగంగా చేయాల్సినవి చేయకపోవడం, చేయకూడనివి చేయడం వల్ల ఈ అవినీతి జరిగిందని నిర్ధారించుకోవాలి. ఆ వివరాలను దర్యాప్తు అనుమతి కోసం పెట్టిన దరఖాస్తులో స్పష్టంగా పేర్కొనాలి. ఫిర్యాదు స్థానిక భాషలో ఇస్తే దాని అధికారిక ఆంగ్ల తర్జుమా కాపీని జత చేయాలి. ప్రభుత్వం స్వతంత్రంగా ఆలోచించి, దర్యాప్తు అవసరమో లేదో నిర్ణయించాలని మార్గదర్శకాలు నిర్దేశిస్తున్నాయి. 


Updated Date - 2021-09-07T06:47:18+05:30 IST