నరహరిపేట చెక్‌పోస్టు ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు

ABN , First Publish Date - 2020-10-24T11:56:14+05:30 IST

చిత్తూరు సమీపంలో తమిళనాడు సరిహద్దులో వున్న నరహరిపేట ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టులో పనిచేస్తున్న తొమ్మిది మందిపై ప్రభుత్వం అవినీతికి సంబంధించిన అభియోగాలను నమోదు చేసింది.

నరహరిపేట చెక్‌పోస్టు ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు

 డీసీటీవో, ఇద్దరు ఏసీటీవోల సహా 9 మందిపై అభియోగాలు

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం


కలికిరి, అక్టోబరు 23: చిత్తూరు సమీపంలో తమిళనాడు సరిహద్దులో వున్న నరహరిపేట ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టులో పనిచేస్తున్న తొమ్మిది మందిపై ప్రభుత్వం అవినీతికి సంబంధించిన అభియోగాలను నమోదు చేసింది. ఈ మేరకు అప్పీలుకు అవకాశం కల్పిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో ప్రధానంగా ఒక డీసీటీవో, ఇద్దరు ఏసీటీవోలు బాధ్యులు కావడం విశేషం. 2017 జనవరి 9న నరహరిపేట ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టును అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా అవినీతి వ్యవహారాలకు సంబంధించిన పలు ఆధారాలు లభించాయి. వాణిజ్య పన్నుల శాఖలో డీసీటీవో, ఏవోగా పనిచేస్తూ మడుమాల విజయలక్ష్మి, ఏసీటీవోలు గునుపాటి ప్రకాష్‌, గాజుల వంశీ కిషోర్‌, చెక్‌పోస్టుకు సంబంధించిన సీనియర్‌ అసిస్టెంట్లు బి. నాగరాజు, సర్వేపల్లె నరసింహులు ఈ అవినీతి వ్యవహారాలకు బాధ్యులుగా గుర్తించారు. వీరితోపాటు వేపంజేరి మార్కెట్‌ కమిటీ (పెనుమూరు హెడ్‌క్వార్టర్‌) సూపర్‌వైజర్‌ చిత్తూరు చెంగల్‌ రెడ్డి, ఆఫీస్‌ సబార్డినేట్‌లు బెల్లం శంకర నాయుడు, వరదరాజుల కుప్పురాజులు, హమాలీ కరణం సుబ్రహ్మణ్యం పిళ్ళైలను కూడా గుర్తించారు. దీనికి సంబంధించి అభియోగాలను ఎదుర్కొంటున్న వారి పైన ఏపీ సివిల్‌ సర్వీసు రూల్స్‌ 1991 లోని రూల్‌ 20 మేరకు క్రమశిక్షణారాహిత్యం కింద తదుపరి చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరిస్తూ అప్పీలు చేసుకోవలసిందిగా ఆదేశించారు. ఈ మేరకు మొత్తం తొమ్మిది జీవోలను విడివిడిగా జారీ చేశారు. వీటితోపాటు ఏపీ సర్వీసు రూల్స్‌లోని రూల్‌ 24 మేరకు కామన్‌ ప్రొసీడింగ్స్‌ పేరుతో మడుమాల విజయలక్ష్మితో సహా ఈ తొమ్మిది మందికి కలగలిపి ప్రత్యేకంగా మరో జీవో విడిగా జారీ అయ్యింది. కాగా ఇందులో ఉద్యోగ విరమణ చేసిన ఏసీటీవో గునుపాటి ప్రకాష్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌ కరణం సుబ్రహ్మణ్యం పిళ్ళై, హమాలీ బెల్లం శంకర నాయుడులకు పెన్షన్‌ రూల్‌ 9 మేరకు పరిమిత పింఛను మంజూరు చేస్తూ విడివిడిగా మరో మూడు ఉత్తర్వులను కూడా ప్రభుత్వం జారీ చేసింది. 

Updated Date - 2020-10-24T11:56:14+05:30 IST