పని జరగాలంటే పైసలివ్వాల్సిందే!

ABN , First Publish Date - 2021-12-03T05:28:55+05:30 IST

ప్రభుత్వ శాఖల్లో అవనీతి నివారణకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు. ఏసీబీ దాడుల్లో తరచుగా అవినీతి అధికారుల బండారం బయటపడుతున్నది. ప్రభుత్వ శాఖల్లో అత్యధికంగా రెవెన్యూశాఖలోనే ఏసీబీ కేసులు నమోదవుతున్నాయి. ఏ శాఖలో లేనంత అవినీతి ఈ శాఖలో రాజ్యమేలుతున్నది.

పని జరగాలంటే పైసలివ్వాల్సిందే!

ప్రభుత్వ శాఖల్లో పెచ్చుమీరుతున్న అవినీతి

ఏసీబీ దాడులు చేస్తున్నా ఆగని లంచాల బాగోతం

నేటి నుంచి అవినీతి వ్యతిరేక వారోత్సవాలు


సంగారెడ్డి క్రైం, డిసెంబరు 2 : ప్రభుత్వ శాఖల్లో అవనీతి నివారణకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు. ఏసీబీ దాడుల్లో తరచుగా అవినీతి అధికారుల బండారం బయటపడుతున్నది. ప్రభుత్వ శాఖల్లో అత్యధికంగా రెవెన్యూశాఖలోనే ఏసీబీ కేసులు నమోదవుతున్నాయి. ఏ శాఖలో లేనంత అవినీతి ఈ శాఖలో రాజ్యమేలుతున్నది. పహణీ నకలు, భూ సంబంధిత ఎన్వోసీ, కులం, ఆదాయం తదితర ధ్రువపత్రాల జారీ, ధరణి, భూ రిజిస్ర్టేషన్‌.. ఇలా పనేదైనా పైసలు ఇవ్వనిదే జరగదు. ఆ తరువాత వరుస క్రమంలో పంచాయతీరాజ్‌, వైద్య ఆరోగ్య శాఖలు ఉన్నాయి. రెవెన్యూ శాఖలో అవినీతి రాజ్యమేలుతున్నట్టు తరచుగా ఆరోపణలు వస్తుంటాయి. ఇందుకు తగినట్టే పహణీ నకలు, భూ సంబంధిత ఎన్వోసీ, కులం, ఆదాయం తదితర ధ్రువపత్రాల జారీ, ధరణి, భూ రిజిస్ర్టేషన్‌.. ఇలా పనేదైనా పైసలు ఇవ్వనిదే జరగని పరిస్థితి కనిపిస్తున్నది. రెవెన్యూ శాఖలో వివిధ సేవల కోసం మీసేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వివిధ ధ్రువపత్రాలు, సేవల కోసం మీసేవల ద్వారా దరఖాస్తు చేసుకునే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ అవినీతికి కల్లెం పడటం లేదు. సర్టిఫికెట్ల కోసం సంబంధిత అధికారిని స్వయంగా కలిసి ఎంతోకొంత ముట్టజెప్తేనే ఫైలు ముందుకు కదులుతుంది. లేదంటే మీసేవల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ప్రయోజనం ఉండటం లేదు. ఏదో వంకతో దరఖాస్తును బుట్టదాఖలు చేస్తున్నారు. గత ఆరు సంవత్సరాల్లో అవినీతి నిరోధకశాఖ జరిపిన దాడులను పరిశీలిస్తే అత్యధిక కేసులు రెవెన్యూశాఖకు సంబంధించినవే కావడం గమనార్హం. ఆ తరువాత వరుస క్రమంలో పంచాయతీరాజ్‌, వైద్యఆరోగ్యశాఖలు ఉన్నాయి. 


లంచం ఇచ్చినా.. తీసుకున్నా నేరమే

చట్టం ప్రకారం లంచం ఇచ్చినా.. తీసుకున్నా నేరమే. ప్రభుత్వ పథకాల కోసం కానీ, మరే పని కోసమైనా ఎవరికైనా లంచం ఇచ్చినా.. ప్రభుత్వ అధికారి ఎవరి నుంచైనా లంచం తీసుకున్నా శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. ప్రభుత్వశాఖల్లోగానీ, సంస్థల్లోగానీ అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ ప్రతిన బూనాలి. అవినీతి రహిత సమాజం కోసం ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలి. దనిపై ప్రజల్లో మరింత చైతన్యం రావాల్సిన అవసరం ఉన్నది. అవినీతి నిర్మూలనకు ఏసీబీ రెండు రకాల కేసులు నమోదు చేస్తుంటుంది. ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకున్న పక్షంలో బాధితుడు ఏసీబీ అధికారులకు నేరుగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఆదాయానికి మించి ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలో ఫిర్యాదుదారుడు అధికారులకు సమాచారమిస్తే సరిపోతోంది. 


నేటి నుంచి అవినీతి వ్యతిరేక వారోత్సవాలు

డిసెంబరు 3వ తేదీ నుంచి 9 వరకు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అవినీతి వ్యతిరేక వారోత్సవాలను నిర్వహించనున్నట్టు ఏసీబీ ఉమ్మడి మెదక్‌ జిల్లా డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. మెదక్‌ రేంజ్‌లోని సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లోని ప్రతీ ప్రభుత్వ కార్యాలయం వద్ద సిటిజన్‌ చార్టర్‌బోర్డును ఏర్పాటు చేయాలని సూచించినట్టు తెలియజేశారు. వారోత్సవాల్లో భాగంగా అవినీతి నిర్మూలనపై అధికారులచే ప్రతిజ్ఞ చేయించడం, అవినీతి నిర్మూలనకు సంబంధించిన నినాదాలు చేయించడం, వాల్‌పోస్టర్ల ద్వారా ప్రచారం చేయడం జరుగుతుందన్నారు. అవినీతిపై ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే 940446149 నంబర్‌కు ఫోన్‌ చేయాలని ఆయన సూచించారు. 

Updated Date - 2021-12-03T05:28:55+05:30 IST