రాయ‘బేరాలు’!

ABN , First Publish Date - 2022-06-29T06:16:05+05:30 IST

అధికారుల బదిలీల్లో రాయబేరాలు తారాస్థాయికి చేరాయి.

రాయ‘బేరాలు’!

 పలు శాఖల్లో బదిలీలకు పోస్టుకొక ధర

వైసీపీ ప్రజాప్రతినిధుల సిఫార్సులకే ప్రాధాన్యం 

  భారీ ప్యాకేజీల కోసం కొన్ని స్థానాలు హోల్డ్‌ 

 సొంతవారి కోసం కొత్త పోస్టుల సృష్టి 

 ఒక్కొక్క శాఖలో ఒక్కో తీరులో పైరవీలు

అధికారుల బదిలీల్లో రాయబేరాలు తారాస్థాయికి చేరాయి. రెండు జిల్లాల్లో అధికార పార్టీ నేతలకు కాసుల వర్షం  కురుస్తోంది. కోరుకున్న ప్రాంతానికి పోస్టింగ్‌ కోసం పెద్దఎత్తున పైరవీలు నడుస్తున్నాయి. రెవెన్యూ, పంచాయతీరాజ్‌, జడ్పీ, ఆర్‌డబ్ల్యూఎస్‌, పర్యాటకాభివృద్ధి సంస్థ, సివిల్‌ సప్లయీస్‌, రవాణా కాదేదీ అక్రమానికి అనర్హమన్నట్టు అన్ని శాఖల్లోనూ అదే పరిస్థితి. బదిలీలకు వైసీపీ స్థానిక నేతల నుంచి సిఫార్సు లేఖలు తెచ్చుకున్నవారికి ప్రాధాన్యత దక్కుతోంది. పారదర్శకతకు పాతర పడుతోంది. 

 110 మంది సిఫార్సు లేఖలతో దరఖాస్తులు 

కృష్ణా జిల్లాలో 112 మంది పంచాయతీ కార్యదర్శులు, ఇతర విభాగాల ఉద్యోగులు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 110 మంది అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతోనే తమ దరఖాస్తు సమర్పించారు. 

  ఆదాయాన్ని బట్టి ధర విభజన 

కృష్ణా జిల్లాలో బదిలీ కోసం పంచాయతీల ఆదాయాన్ని బట్టి అధికారులు ధర నిర్ణయించారు. పెద్ద పంచాయతీకి బదిలీ చేయాలంటే రూ.70వేలు,  కాస్త తక్కువ ఆదాయం ఉన్న పంచాయతీకి రూ.50వేలు,  ఆదాయం తక్కువగా ఉన్న పంచాయతీలకు కనీసంగా రూ.30వేల చొప్పున ధర నిర్ణయించారు. 

 బదిలీల మాటున

ఎన్టీఆర్‌ జిల్లా పర్యాటకాభివృద్ధి సంస్థలో బదిలీల మాటున చిత్రమైన వ్యవహారాలు నడుస్తున్నాయి. ఇక్కడ ఉద్యోగులకు ఆప్షన్‌ ఇవ్వకుండా... వారి స్థానాల్లో తమ వారిని నియమించుకునేందుకు పావులు కదుపుతున్నారు. దీనికోసం కొత్త పోస్టులకు నోటిఫికేషన్‌ వెలువరించటం దుమారాన్ని రేపుతోంది.

  బదిలీలన్నీ పైరవీలతోనే

రిజిస్ర్టేషన్ల శాఖలో ఇప్పటికే బదిలీలు జరిగాయి. జరిగిన బదిలీలన్నీ పైరవీలతోనే ముడిపడి ఉన్నాయి. పటమట, గాంధీనగర్‌ సబ్‌ రిజిస్ర్టార్ల స్థానాలను హోల్డ్‌లో పెట్టారు. దీని వెనుక భారీఎత్తున ప్యాకేజీలు నడిచినట్టు తెలుస్తోంది. 

ఆంధ్రజ్యోతి, విజయవాడ/మచిలీపట్నం  : జిల్లాల పునర్విభజన అనేది కేంద్రం ఆమోదం పొందకపోవటం వల్ల సర్వీసు వ్యవహారాలన్నీ కృష్ణా జిల్లా యంత్రాంగం స్థాయిలోనే జరగాల్సి ఉంది. దీంతో రెండు జిల్లాల్లోనూ వివిధ శాఖల్లో బదిలీ మాటున పైరవీల జాతర నడుస్తోంది. బదిలీలను అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు రెండు జిల్లాల్లోనూ జోరుగా ‘క్యాష్‌’ చేసుకుంటున్నారు. ప్రధానంగా పంచాయతీరాజ్‌ శాఖలో బదిలీల వ్యవహారం కొందరికి రూ.కోట్లు కురిపిస్తోంది. జూనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, బీసీ, ఈఓపీఆర్‌డీ, పంచాయతీ కార్యదర్శులు ఇలా ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన స్థానాలకు వెళ్లటానికి వైసీపీ నేతలను ప్రసన్నం చేసుకుంటున్నారు. 

ఎమ్మెల్యేల కార్యాలయాల నుంచి లేఖలు

గన్నవరం, విజయవాడ రూరల్‌, కంకిపాడు, జీ.కొండూరు, ఇబ్రహీంపట్నం తదితర అనేక మండ లాల్లో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో బదిలీల జాబితాలు సిద్ధమౌతున్నాయి. బదిలీలలకు సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలకు పెద్దఎత్తున డిమాండ్‌ ఉంటోంది. వాటినే పరిగణనలోకి తీసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చాయి. దీంతో అడ్డగోలుగా సిఫార్సు లేఖలు వస్తున్నాయి. కొందరు అధికార పార్టీ నేతలు తమ ఎమ్మెల్యేల కార్యాలయాల నుంచి సిఫార్సు లేఖలు తీసుకుని ఆయా మండల పరిషత్‌ చైర్మన్ల ద్వారా బేరసారాలకు తెర తీస్తున్నారు. బేరసారాలకు అంగీకరించిన వారికి ఎమ్మెల్యే సిఫార్సు లేఖలు వస్తున్నాయి. ఇలా అడిగిందే తడవుగా.. బేరం కుదిరితే ఎమ్మెల్యే సిఫార్సు లేఖలు ఇచ్చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన బదిలీలు అధికార పార్టీ నేతలు చెప్పినట్టుగానే జరిగాయి. దీంతో మరింత మంది ఇప్పటికీ పోస్టుల కోసం అధికార పార్టీ నేతల చుట్టూ చక్కెర్లు కొడుతున్నారు. 

మంత్రి లెటర్‌హెడ్స్‌పై  ఫోర్జరీ సంతకాలతో..

  పంచాయతీరాజ్‌లోని ఇంజనీరింగ్‌ వ్యవస్థలో కూడా రెండు జిల్లాలస్థాయిలో జోరుగా పైరవీలు జరిగాయి. విజయవాడ పంచాయతీరాజ్‌ క్వాలిటీ కంట్రోల్‌ విభాగంలో పనిచేసే జడ్పీ ఉద్యోగులు ఏకంగా పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి లెటర్‌హెడ్స్‌పై మంత్రి సిఫార్సు చేసినట్టుగా డ్రాఫ్టింగ్‌ చేయించి.. మంత్రి సంతకాన్నే ఏకంగా ఫోర్జరీ చేసి లేఖలు పంపారు. ఈ లేఖల బాగోతాన్ని పసిగట్టిన జడ్పీ ఉన్నతాధికారి ఒకరు తప్పుడు సిఫార్సు లేఖలు పంపిన వారి నుంచి దండిగా పిండుకున్నట్టు తెలుస్తోంది.  

  రెవెన్యూ శాఖ రూటు సప‘రేటు’గా ఉంది. ఈ శాఖలో పనిచేస్తున్నవారిలో ఎక్కువ మంది ఎన్టీఆర్‌ జిల్లాకు ఆప్షన్‌ ఇస్తున్నారు. విజయవాడలోనే నివాసం ఉండటం, ఇక్కడ భౌతిక పరిస్థితులకు అలవాటు పడటం వల్ల ఇక్కడి నుంచి కదలటానికి ఇష్టపడటం లేదు. ఇక్కడి నుంచి కృష్ణాజిల్లాకు  ట్రెయిన్‌ లేదా కార్లలో వెళుతున్నారు. రెండు సంవత్సరాల కాలపరిమితి పూర్తి చేసుకున్న వీఆర్వోలు, ఆర్‌ఐలు, సర్వేయర్లు, జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లు, డిప్యూటీ తహసీల్దార్లు ఇలా ప్రతిఒక్కరూ ఫోకల్‌ పాయింట్ల కోసం ఇదే విధంగా రెండు జిల్లాల వ్యాప్తంగా దరఖాస్తులు చేసుకున్నారు. సిఫార్సు లేఖలు కొంత మేరకు పని చేస్తున్నాయి.  

రవాణాశాఖలో బదిలీల వివాదాలు

 రవాణా శాఖలో బదిలీల వివాదాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఎంవీఐ, ఏఎంవీఐ పోస్టులకు హెవీ డిమాండ్‌ ఏర్పడింది. రవాణా శాఖ కమిషనర్‌ స్థాయిలో అడ్డగోలుగా బదిలీలు చేయించుకోవటం సాధ్యం కావటం లేదు. దీంతో మంత్రి కార్యాలయాన్ని వేదికగా చేసుకున్నారు. మంత్రి కార్యాలయం నుంచి రవాణా శాఖ కమిషనర్‌కు సిఫార్సు లేఖలు వచ్చాయి. చెక్‌ పోస్టులకు డిమాండ్‌ ఏర్పడటంతో.. తొలిసారిగా మంత్రి కార్యాలయం చెక్‌పోస్టులు దక్కించుకున్న వారు నెలవారీ మామూళ్లను ఫిక్‌ ్స చేసినట్టుగా తెలిసింది. మంత్రి కార్యాలయ సిఫార్సులు అడ్డగోలుగా ఉన్నాయని భావించిన కమిషనర్‌ వారం రోజులుగా వాయిదావేస్తూ వస్తున్నారు. ఈనెల 29న బదిలీలకు ఆప్షన్‌ ఇచ్చిన వారికి స్ర్కూటినీ చేసి 30వ తేదీన బదిలీలు చేసే అవకాశం ఉంది. మంత్రి కార్యాలయం నుంచి వ చ్చిన జాబితాను పరిశీలించి వాళ్లు చెప్పినట్టు కాకుండా ఎవరిని ఎక్కడికి వేయాలో అక్కడికి వేసేలా ఫైనల్‌ చేసినట్టు తెలుస్తోంది. మళ్లీ కోర్టుకు, అప్పీల్‌ చేసుకోవటానికి, మంత్రి కార్యాలయంలో పంచాయతీ పెట్టకుండా ఉండటానికే చివరిరోజు వరకు పెండింగ్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. 

  గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డ బ్ల్యూఎ్‌స)లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి బదిలీల రూపంలో ఆప్షన్‌ లభించింది. ఎన్టీఆర్‌ , కృష్ణా జిల్లాకు చెందిన ఏఈఈ, డీఈఈ, ఈఈలలో అవినీతి విచారణను ఎదుర్కొంటున్న వారంతా దీన్నుంచి తప్పించుకునేందుకు బదిలీలపై వెళ్లిపోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గొల్లపూడిలోని ఈఎన్‌సీ కార్యాలయంలో ఉన్నతాధికారిని కలిసి బేరాలను సెట్‌ చేసుకుంటున్నారు. ఇప్పటి కే ఈఎన్‌సీ కార్యాలయ వేదికగా అడ్డగోలుగా డిప్యూటేషన్ల నియామకాలు జరిగాయి. ఈఎన్‌సీ కార్యాలయంలోనే మంజూరైన పోస్టుల కంటే ఎక్కువ మంది పని చేస్తున్నారు.

కలెక్టర్‌ల సమావేశం

జిల్లాల విభజన జరిగిన ప్పటికీ ఉమ్మడి జిల్లా పరిధిలోనే ఉద్యోగులు, అధికారులు బదిలీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా కలెక్టర్‌ రంజిత్‌బాషా, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌  దిల్లీరావు, ఏలూరు జిల్లా జేసీ మంగళవారం మచిలీపట్నంలో సమావేశం నిర్వహించారు.  కృష్ణా కలెక్టర్‌ చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో ఉద్యోగులు, అధికారుల బదిలీలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

 ఎంపీడీవోలు 15 మంది దరఖాస్తు 

 ఉమ్మడి కృష్ణా జిల్లాలో 15 మంది మండల పరిషత్‌ అధికారులు బదిలీ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. పామర్రు, పెనుమలూరు ఎంపీడీవోలు ఐదు సంవత్సరాలుగా ఒకే మండలంలో పనిచేస్తున్నారు. వీరితో పాటు మరో 15 మంది ఎంపీడీవోలు బదిలీకోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ  దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని, కలెక్టర్‌ తుది నిర్ణయం  తీసుకుంటారని జెడ్పీ సీఈవో సూర్య్రపకాశరావు తెలిపారు


Updated Date - 2022-06-29T06:16:05+05:30 IST