గుట్టపై దిద్దుబాట్లు

ABN , First Publish Date - 2022-05-18T09:04:29+05:30 IST

యాదగిరిగుట్ట ఆలయ పునర్మిర్మాణ పనుల్లో చోటుచేసుకున్న లోపాలను సరిదిద్దే చర్యలు ప్రారంభమయ్యాయి.

గుట్టపై దిద్దుబాట్లు

  • యాదగిరిగుట్ట క్షేత్రంలో మరమ్మతులు.. 
  • వర్షపునీరు, జాలు చేరకుండా చర్యలు
  • భక్తులకు ఇబ్బందుల్లేకుండా జాగ్రత్తలు
  • ఉద్ఘాటన తర్వాత కొద్దిగా పెరిగిన భక్తులు
  • మున్ముందు సౌకర్యాలు కల్పిస్తే మరింత మంది 


యాదాద్రి, మే 17 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట ఆలయ పునర్మిర్మాణ పనుల్లో చోటుచేసుకున్న లోపాలను సరిదిద్దే చర్యలు ప్రారంభమయ్యాయి. ఇటీవల వర్షాలకు రెండోఘాట్‌కు అనుబంధంగా నిర్మించిన రోడ్డు కుంగిపోయింది. క్యూ కాంప్లెక్సుల్లో, కొండపైన ప్రధానాలయంలోకి నీరు చేరింది. బస్‌బే పూర్తిగా నీటిలో మునిగిపోయి భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నష్టాన్ని అధికారులు పరిశీలించారు. కొండపైన, కింద దిద్దుబాటు చర్యలకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని పనులు చేస్తున్నారు. వచ్చేది వర్షాకాలం కావడంతో కొండపైన, కొండకింద  నీరు నిలవకుండా, లీకేజీలకు తావివ్వకుండా మరమ్మతులు చేస్తున్నారు. కొండపైన అష్టభుజి ప్రాకార మండపంలో వర్షపు నీటితో లీకేజీ రావడంతో సిమెంటు, రసాయనాల మిశ్రమంతో ఖాళీలను పూడ్చుతున్నారు. దర్శన క్యూ కాంప్లెక్స్‌లోకి చేరిన వర్షపు నీటిని తొలగించిన అధికారులు భవనం కింది వైపు నుంచి వర్షపు జాలు  వస్తున్నట్లు గుర్తించారు.


ప్రసాదాల తయారీ భవనం కింది భాగంలో కూడా వర్షపు, ఊట నీరు చేరుతోందని గుర్తించారు. ఈ మేరకు వర్షపు జాలు నీరు రాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. విష్ణు పుష్కరిణి ప్రాంతంలో జాలు నీరు రావడాన్ని గుర్తించి కొండకిందకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


బస్‌బే ప్రాంతంలో వరద చేరకుండా, ఆలయ ఘాట్‌రోడ్ల మీదుగా వర్షపు నీరు ప్రవహించకుండా డ్రెయిన్‌ లైన్‌ గుండా పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధానాలయంలోనికి ఏ మార్గంలో వర్షపు నీరు వస్తోంది? ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే వర్షపు నీరు రాకుండా చేయగలం అనే అంశాలపై నిపుణులతో చర్చించి, తగు చర్యలు తీసుకుంటున్నారు. తిరువీధుల్లోని కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా దక్షిణ దిశలోని ఫ్లోరింగ్‌ దెబ్బతిన్న ప్రాంతంలో సిమెంటు, మైనంతో పాటు కొన్ని చోట్ల సీసం నింపుతున్నారు. కొండకింద రింగురోడ్డు ప్రాంతమంతా వర్షం తాకిడికి జలమయంగా మారుతుండడంతో శాశ్వత పరిష్కారం కోసం ఆర్‌ఆండ్‌బీ అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. వర్షపు నీటిని తొలగించేందుకు అధికారులు ప్రత్యేకంగా మరో సైడ్‌ డ్రైన్‌ లైన్‌ను నిర్మిస్తున్నారు. ఇందుకోసం రింగురోడ్డు ప్రాంతంలోని డివైడర్‌ను కొంతమేరకు తొలగించి డ్రైన్‌లైన్లు నిర్మించనున్నారు. ఊరకుంట చెరువు నుంచి వచ్చిన వర్షపు నీటిని బయటకు పంపేందుకు ఒక మీటరు వ్యత్యాసంలో డ్రైన్‌లైన్‌ నిర్మించి నేరుగా యాదగిరిపల్లి శివారులోని కల్వర్టులోనికి వర్షపు నీరు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


యాదగిరిగుట్టకు పెరిగిన భక్తుల తాకిడి

ఆలయ పునర్నిర్మాణం అనంతరం యాదిగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. పునర్నిర్మాణానికి ముందు రోజువారీగా ఏడు వేల నుంచి 10వేల మంది, విశేష రోజుల్లో 40వేల మంది వచ్చేవారు. పునర్నిర్మాణ యత్నంలో 2016 ఏప్రిల్‌ 21వ తేదీన తాత్కాలికంగా బాలాలయంలో కవచమూర్తులను ప్రతిష్ఠించారు. బాలాలయంలోని కవచమూర్తులను రోజువారీగా ఆరు వేల నుంచి 10వేల మంది భక్తులు, సెలవురోజుల్లో  30వేల మంది దర్శించుకునేవారు. ఆలయ పునర్నిర్మాణం పూర్తయి ఈ ఏడాది మార్చి 28వ తేదీ మహాకుంభసంప్రోక్షణ అనంతరం గర్భాలయ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు రోజువారీగా 15వేలకు పైగా, సెలవురోజుల్లో దాదాపు 40వేల మంది దర్శించుకుంటున్నారు.


ప్రస్తుతం తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటుచేశారు. అన్ని చోట్లా మంచినీటి సౌకర్యంతోపాటు భక్తులు స్వామివారి సన్నిధిలో ఒకరోజు నిద్ర చేసేందుకు సరైన కాటేజీలు, అతిథిగృహాలు లేవు. వృద్ధులు, గర్భిణులకు ప్రత్యేక ఎస్కలేటర్‌ పనిచేయడంలేదు. కొండపైన, కింద భక్తులకు సరైన సదుపాయాలు లేకపోవడంతో కుటుంబ సమేతంగా రావడానికి సుముఖత వ్యక్తం చేయడంలేదు. పూర్తి సౌకర్యాలు కల్పించి, టెంపుల్‌టౌన్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో అతిథి గృహాలను నిర్మించిన పక్షంలో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 


మందకొడిగా రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ 

2020 నుంచి యాదగిరి గుట్టలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం ఆశించిన స్థాయిలో లేదు. ఆలయ మహాకుంభ సంప్రోక్షణను వైభవోపేతంగా నిర్వహించి ఉంటే క్షేత్రానికి అంతర్జాతీయ ప్రాచుర్యం లభించేదని, ఆ కారణంగా స్థానికంగా రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం కూడా బాగా సాగేదని పలువురు వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. ఆలయాన్ని అద్భుతంగా నిర్మించినప్పటికీ, మహాకుంభ సంప్రోక్షణను సాదాసీదాగా జరపడంతో పర్యాటకపరంగా ప్రచారం పొందలేదని అంటున్నారు. వాస్తవానికి ఆలయాన్ని అంతర్జాతీయ స్థాయిలో పునర్నిర్మిస్తున్నట్టు కేసీఆర్‌ ప్రకటించడంతో ఈ ప్రాంతమంతా ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని విస్తృత ప్రచారం సాగింది.


యాదగిరిగుట్ట మండలంతో పాటు భువనగిరి, బీబీనగర్‌, వలిగొండ, ఆలేరు, మోటకొండూరు, రాజాపేట, తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం మూడేళ్ల క్రితం దాకా మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లుగా సాగింది. నగర శివారు ప్రాంతమైన బీబీనగర్‌ మండలం నుంచి ఆలేరు మండలం వరకు వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారికి ఇరువైపులా కిలోమీటరు వరకు పెద్దఎత్తున కొత్త లేఅవుట్లు ఏర్పాటుచేసి, ప్లాట్లను విక్రయించారు. యాదగిరిగుట్ట మండలంలోని చుట్టుపక్కల గ్రామాల్లో వ్యవసాయ భూములన్నీ కూడా లేఅవుట్లుగా మారాయి. పెద్దఎత్తున ప్లాట్ల క్రయ, విక్రయాలు జరిగాయి. అయితే మూడేళ్లుగా వ్యాపారం కొంత మందగించింది. ఇక మహాకుంభ సంప్రోక్షణను కనీవినీ ఎరుగని రీతిలో చేపట్టాలని సీఎం కేసీఆర్‌ భావించారు. 1008 కుండాలతో మహా సుదర్శన యాగం, ప్రపంచంలోని వైష్ణవ పీఠాధిపతులతో యాగాన్ని చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, రాష్ట్రాల  సీఎంలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని యోచించారు. అయితే కేసీఆర్‌, చినజీయర్‌ మధ్య దూరం పెరగడంతో మహాసుదర్శనయాగం వాయిదా పడింది. సంప్రోక్షణ పూజలు బాలాలయంలోనే నిర్వహించారు. 

Updated Date - 2022-05-18T09:04:29+05:30 IST