టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల దిద్దు‘బాట’

ABN , First Publish Date - 2021-02-25T08:32:01+05:30 IST

ప్రజల్లో తమ ప్రతిష్ఠ ఎలా ఉన్నది? దూరమైన వర్గాలేవి? వారిని ప్రసన్నం చేసుకోవడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ఏమిటి? ఈ అంశాలపై నాగర్‌కర్నూల్‌ జిల్లా ఎమ్మెల్యేలు దృష్టి సారించారు.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల దిద్దు‘బాట’

నాగర్‌కర్నూలు జిల్లాలో సొంతంగా సర్వేలు 

యువతను ఆకర్షించేందుకు కార్యాచరణ

నాగర్‌కర్నూల్‌, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి) : ప్రజల్లో తమ ప్రతిష్ఠ ఎలా ఉన్నది? దూరమైన వర్గాలేవి? వారిని ప్రసన్నం చేసుకోవడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ఏమిటి? ఈ అంశాలపై నాగర్‌కర్నూల్‌ జిల్లా ఎమ్మెల్యేలు దృష్టి సారించారు. ఇటీవల తమ తమ నియోజకవర్గాల్లో ప్రైవేట్‌ ఏజెన్సీల ద్వారా సర్వేలు చేయించుకుని.. రాజకీయంగా బలపడే  ప్రయత్నాలను మొదలు పెట్టడం గమనార్హం. నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ గెలుపొందగా కొల్లాపూర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందిన బీరం హర్షవర్ధన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. దుబ్బాక, గ్రేటర్‌ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ పరిస్థితులు అనూహ్యంగా మలుపు తిరగడంతో జిల్లా ఎమ్మెల్యేలు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం కూడా గుంటూరుకు చెందిన ఒక సంస్థతో ఎమ్మెల్యేల పనితీరు, దూరమైన వర్గాల సర్వే చేయించి.. ఎమ్మెల్యేలను అప్రమత్తం చేసింది. రాజకీయంగా తమ పునాదులు ఎలా ఉన్నాయన్న దానిపై జిల్లా శాసనసభ్యులు కూడా లోతుగా అధ్యయనం జరిపించారు. 


ఈ రెండు సర్వేల్లోనూ యువ ఓటర్లను బీజేపీ ఆకర్షిస్తున్నట్లు వెల్లడైంది. టీఆర్‌ఎ్‌సలోనే వేర్వేరు కుంపట్లు ఉండటం కూడా కార్యకర్తల్లో ఉదాసీనతకు దారి తీస్తున్నట్టు ఆ సర్వేలు తేల్చాయి. నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో ప్రభుత్వ విప్‌ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మధ్య రాజకీయ ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. ఇరువురి మధ్యా సఖ్యత లేకపోవడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు మనస్ఫూర్తిగా పని చేయడం లేదనే అంశంపై బహిరంగంగానే చర్చ జరుగుతోంది. అయితే రాజకీయంగా బలపడేందుకు మాత్రం వారిరువురూ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. గతంలో తనతో సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన నియోజకవర్గ ప్రజలను ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి వద్దకు పంపించే కూచకుళ్ల ఆరు నెలలుగా తానే స్వయంగా వాటిని అధికారులకు చెప్పి పరిష్కారం చూపెడుతుండటంతో టీఆర్‌ఎ్‌సలోనే రెండు బలమైన అధికార కేంద్రాలు ఏర్పడ్డాయి. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు వర్గీయులుగా పార్టీ చీలిపోయింది. ఇరువురు నేతలు టీఆర్‌ఎ్‌సలోనే ఉంటూ ఎవరి వారు ఉనికిని కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడం వల్ల టీఆర్‌ఎస్‌ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందనే విషయం సర్వేలో తేటతెల్లమైనట్లు సమాచారం. కల్వకుర్తిలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్‌ మధ్య ఉన్న రాజకీయ వైరాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు శాసనసభ ఎన్నికల్లోనూ స్వల్ప మెజారిటీతో ఎమ్మెల్యే పదవిని కోల్పోయిన బీజేపీ అభ్యర్థి ఆచారి నేతృత్వంలో కల్వకుర్తిపై కాషాయ జెండా ఎగురవేయడానికి ఉత్సుకత చూపిస్తోంది. అచ్చంపేటలోని అప్పర్‌ప్లాట్‌ ఏరియాకు సాగునీరందించే విషయంలో జరుగుతున్న జాప్యంపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎలాగైనా అమ్రాబాద్‌ ఎత్తిపోతల పథకానికి పరిపాలనాపరమైన ఆమోదం తెచ్చేందుకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 

Updated Date - 2021-02-25T08:32:01+05:30 IST