కార్పొరేటర్లకు స్టడీ టూర్‌

ABN , First Publish Date - 2022-07-06T06:59:27+05:30 IST

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) కార్పొరేటర్లు అధ్యయన యాత్రకు సిద్ధమవుతున్నారు.

కార్పొరేటర్లకు స్టడీ టూర్‌

ఢిల్లీ, ఛండీఘర్‌, ఆగ్రా, సిమ్లా, మనాలిలో స్వచ్ఛభారత్‌ అమలుపై అధ్యయనం

ఈనెల 29 నుంచి వచ్చే నెల ఏడు వరకు పర్యటన

ప్రతిపాదనలు తయారుచేస్తున్న అధికారులు

కార్పొరేటర్ల అభిప్రాయం కోరుతూ లేఖలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) కార్పొరేటర్లు అధ్యయన యాత్రకు సిద్ధమవుతున్నారు. దేశంలో పరిశుభ్ర నగరాలుగా గుర్తింపుపొందిన చోట్ల స్వచ్ఛభారత్‌ మిషన్‌ అమలు తీరును పరిశీలించి వాటిని నగరంలో అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. 

స్వచ్ఛభారత్‌ మిషన్‌ అమలు తీరును అధ్యయనం చేసేందుకు జీవీఎంసీ కార్పొరేటర్లు ఢిల్లీ, ఛండీఘర్‌, ఆగ్రా, సిమ్లా, మనాలి నగరాలను ఎంపిక చేసుకున్నారు. ఈ నెల 29 నుంచి వచ్చే నెల ఏడో తేదీ వరకూ ఆయా నగరాల్లో పర్యటించేలా అధికారులు షెడ్యూల్‌ రూపొందించారు. కార్పొరేటర్లకు మాత్రమే అధ్యయన యాత్ర అయినప్పటికీ మహిళా కార్పొరేటర్లకు మాత్రం వారి భర్తలను కూడా వెంట తీసుకువెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పాలకవర్గం పెద్దలు నిర్ణయించారు. దీంతో 97 మంది కార్పొరేటర్లు ఉండగా వారిలో 50 మంది మహిళలు కావడంతో మొత్తం 150 మంది అధ్యయన యాత్రకు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అధ్యయన యాత్ర ప్రారంభం నుంచి తిరిగి వచ్చేంత వరకూ (విమానం టిక్కెట్లు, స్థానికంగా రవాణా, వసతి, భోజనం వంటి వాటికి) ఎంత ఖర్చవుతుందో ప్రతిపాదనలు తయారుచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అంచనాలు తయారైన తర్వాత కౌన్సిల్‌ ఆమోదం తీసుకుని టెండరు పిలవాల్సి ఉంటుంది. టెండరులో అతి తక్కువకు కోట్‌ చేసిన కాంట్రాక్టర్‌కు టూర్‌ బాధ్యతలను అప్పగిస్తారు. అధ్యయన యాత్రకు సంబంధించి బిల్లులు చెల్లింపు సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా  ముందుగానే కార్పొరేటర్ల నుంచి సమ్మతి తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా కార్పొరేటర్లకు ఒక లేఖను పంపించి, దానిపై అధ్యయన యాత్రకు సమ్మతి, లేదా అసమ్మతి తెలియజేసి తమకు అందజేయాలని కోరుతున్నారు. నగరంలో రహదారులు వేయలేని స్థితిలో అధ్యయన యాత్ర అవసరమేమిటని కొంతమంది కార్పొరేటర్లు ప్రశ్నిస్తుండగా, మరికొందరు మాత్రం కౌన్సిల్‌ ఉనికిలో ఉన్నప్పుడు కార్పొరేటర్లు అధ్యయన యాత్రకు వెళ్లడం  సాధారణమైన విషయమేనని పేర్కొంటున్నారు.


శ్మశానంలో పసికందు!

ప్రాణాలతో ఉండగానే పడేయించిన తల్లి

ఆసత్రిలో చికిత్స పొందుతూ బిడ్డ మృతి 

 

మల్కాపురం, జూలై 5: అమ్మతనానికే మాయని మచ్చలాంటి సంఘటన మంగళవారం మల్కాపురంలో వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వివరాలివి...మంగళవారం తెల్లవారుతుండగా కోరమాండల్‌ గేటు ఎదురుగా వున్న శ్మశానవాటిక వద్ద గల పొదలలో ఓ పసికందును ఎవరో మూటకట్టి పడేశారు. శ్మశానవాటికలో ఉంచిన వాహనాలను తీసుకువెళ్లేందుకు వచ్చిన పారిశుధ్య కార్మికులు మూట కదులుతుండడాన్ని చూసి, విప్పి చూడగా...కొద్ది గంటల ముందే జన్మించిన మగబిడ్డ కనిపించాడు. వెంటనే 108 వాహనానికి సమాచారం ఇచ్చినా, అది సకాలంలో చేరుకోలేదు. దీంతో పోలీసులకు తెలియపరిచారు. మల్కాపురం పోలీసులు శ్మశానవాటికకు చేరుకుని, బిడ్డను రక్షక్‌ వాహనంలో రెండు, మూడు ఆస్పత్రులకు తిప్పినా, ఎక్కడా చికిత్స అందించే పరిస్థితి కనిపించలేదు. దీంతో కేజీహెచ్‌కు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆ బిడ్డ కన్నుమూశాడు.  


అడ్డంగా దొరికిన మహిళ..

పసికందును శ్మశానంలో పడేసిన మహిళ కొద్దిసేపటి అనంతరం తనకు ఏమీ తెలియనట్టు తిరిగి శ్మశానవాటిక వద్దకు వచ్చింది. అక్కడ ఏం జరుగుతోందోనని ఆరా తీసింది. అంతేకాకుండా అంతమంది గుమిగూడి ఉన్నారేంటి...పసికందు ఉన్నాడా అని అడగడంతో అక్కడి వారికి అనుమానం వచ్చింది. దీంతో ఆమెను గద్దించేసరికి...తానే బాబును తీసుకువచ్చానని చెప్పడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా, మల్కాపురం ప్రాంతంలో వుంటున్న వినోద్‌ అనే యువకుడు...సమీపంలోని ఒక కాలనీకి చెందిన యువతి ప్రేమించుకొని, శారీరకంగా ఒక్కటయ్యారని, ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చి, బిడ్డకు జన్మనిచ్చినట్టు చెప్పింది. వారు బిడ్డను వద్దనుకుని, ఎక్కడైనా విడిచిపెడితే రూ.5 వేలు ఇస్తాననడంతో డబ్బుకు కక్కుర్తిపడి ఆ పనిచేశానని చెప్పింది. దీంతో పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పసికందు మృతదేహానికి కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించి, పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు. 



Updated Date - 2022-07-06T06:59:27+05:30 IST