అక్రమార్క దళం

ABN , First Publish Date - 2021-02-24T07:00:32+05:30 IST

ప్రజాసేవ ముసుగులో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులెందరో... వారు తగిలించుకున్న ‘సేవ’ ముసుగు తొలగిస్తే కనిపించే నిజరూపం వేరుగా ఉంటుంది.

అక్రమార్క దళం

వైసీపీ కార్పొరేటర్‌ అభ్యర్థుల్లో అధికశాతం వారే

ఓ అభ్యర్థిపై ‘రియల్‌’ చీటింగ్‌ కేసులు.. 

మరొకరు చీట్ల వ్యాపారంతో రూ.కోట్లకు నామం

‘క్రిమినల్‌ గ్యాంగ్‌’ లీడర్‌ ఇంకొకరు

మద్యం... అక్రమ కట్టడాల మాటున వేరొక నేత


ఆయన ఓ ‘రియల్‌’ చీటర్‌. అంతేనా! ఇప్పుడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ఓ డివిజన్‌ నుంచి అధికార పార్టీ తరఫున పోటీ చేస్తున్న కార్పొరేటర్‌ అభ్యర్థి కూడా. ఆయనపై ఎన్నో కేసులున్నాయి. ప్లాట్లు విక్రయిస్తానని నమ్మించి, కోట్లాది రూపాయలు వసూలు చేసి, ఎందరికో నామంపెట్టిన సదరు అభ్యర్థిపై నగరంలోని వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈయనకు కార్పొరేటర్‌ టికెట్‌ ఇవ్వవద్దని స్థానిక నాయకులు పలువురు మొత్తుకున్నా మంత్రి వెలంపల్లి ఆశీస్సులతో ఈయన టికెట్‌ సంపాదించారు. విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలోని 64డివిజన్ల నుంచి పోటీలో ఉన్న అధికార పార్టీ అభ్యర్థుల్లో అధిక శాతం మందిది ఇదే తీరు.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

ప్రజాసేవ ముసుగులో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులెందరో... వారు తగిలించుకున్న ‘సేవ’ ముసుగు తొలగిస్తే కనిపించే నిజరూపం వేరుగా ఉంటుంది. ప్రజలను మోసం చేసి, సంపాదించిన సొమ్ముతో ఎన్నికల బరిలోకి దిగి.. అదే సొమ్ముతో ఓట్లను కొనుగోలు చేసి, కార్పొరేటర్ల అవతారమెత్తాలని భావిస్తున్న వీరు ప్రజాసేవ చేస్తారా? విజయవాడ కార్పొరేషన్‌లో ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న అధికార పక్ష అభ్యర్థుల్లో అధికశాతం ఇటువంటి వారే. కేవలం ధన బలంతో టికెట్లు తెచ్చుకున్న వీరు. అదే బలంతో కార్పొరేటర్లుగా గెలిచి నగరాన్ని ఏలేందుకు సిద్ధమవుతున్నారు. 


మంత్రి మాటున ‘మద్య’ముడు

మంత్రి వెలంపల్లికి రాజగురువుగా పేర్కొనే ఓ వ్యక్తి పశ్చిమ నియోజకవర్గంలోని ఓ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయన బంధువులకు నగరంలో బార్‌ అండ్‌ రెస్టారెంట్లు ఉన్నాయి. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఆయా బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో ఉన్న మద్యం నిల్వలను అక్రమ మార్గాల ద్వారా విక్రయించి భారీగా సొమ్ము చేసుకున్న ఘనత ఈయనది. అప్పడు రుచి మరిగిన లాభసాటి వ్యాపారాన్ని లాక్‌డౌన్‌ తర్వాత కూడా కొనసాగిస్తూ లక్షల రూపాయలు వెనకేస్తున్నారు. అక్రమ కట్టడాలపైకి కార్పొరేషన్‌ అధికారులను ఉసిగొల్పి భవన యజనమానుల నుంచి డబ్బులు దండుకుంటారన్న ఆరోపణలు ఉన్నాయి.


‘మాయ’ రాముడు

ఆయన పేరులో శ్రీరాముడు. చేసేవన్నీ మాయలే. భారీ ఎత్తున చీట్ల వ్యాపారం చేస్తుంటారు. చీట్లు పాడుకున్న వారికి నయాపైసా ఇవ్వడు. అలాంటి బాధితులెందరో కాళ్లరిగేలా ఈయన చుట్టూ తిరుగుతున్నారు. ఈయన ప్రస్తుతం జనాలకు ఇవ్వాల్సిన చీటీల సొమ్ము రూ.2.5 కోట్లుపైమాటేనట. పోలీసు కేసు పెడితే తమ డబ్బు అసలు తిరిగి రాదేమోనని ఆందోళనతో ఇప్పటి వరకు ఈయన బాధితులు ఎవ్వరూ పోలీసు స్టేషన్‌ మెట్లు ఎక్కలేదు. దుర్గగుడికే టెండర్‌ పెట్టిన ఘనుడు. మహిళా కార్పొరేటర్‌ అభ్యర్థి భర్త ఈమెకు భాగస్వామి. వీరిద్దరూ ఎగ్గొట్టిన అమ్మవారి సొమ్ము రూ.30 లక్షలకుపైనే ఉంటుందని సమాచారం. 


పతియే ప్రత్యక్ష నేరస్తుడు 

పశ్చిమ నియోజకవర్గంలోని మరో డివిజన్‌ నుంచి ఓ మహిళా అభ్యర్థి అధికార పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈమె సంగతి ఎలా ఉన్నా ఈమె భర్త, బావమరిది రౌడీషీటర్లు. వీరిపై హత్య కేసులు కూడా ఉన్నాయి. వ్యభిచార గృహాలను నడపడం, వ్యాపారులను బెదిరించడం వీరికి ‘మామూలే’. 


‘బ్లేడ్‌ గ్యాంగ్‌’ లీడర్‌

పశ్చిమ నియోజకవర్గంలో ఓ డివిజన్‌ నుంచి అధికార పార్టీ అభ్యర్థిగా డ్రై ప్రూట్స్‌ వ్యాపారి ఒకరు పోటీ చేస్తున్నారు. ఈయన స్టైల్‌ వేరుగా ఉంటుంది. వేసుకున్న తెల్లబట్టలకు మట్టి అంటకుండా పనులు చక్కబెడతారు. బ్లేడు బ్యాచ్‌, గంజాయి బ్యాచ్‌లను పోషిస్తూ వారితో తనకు కావాల్సిన పనులు చేయించుకుంటారు. ఇటీవలే ఘనంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి, తన బ్లేడు, గంజాయి బ్యాచ్‌లను మంత్రి సమక్షంలో అధికార పార్టీలో చేర్పించారు. 


వడ్డీల జలగ

మరో అభ్యర్థి వడ్డీవ్యాపారంతో జనాలను పీక్కుతింటాడు. తన కులానికి చెందిన కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇప్పించాలంటూ అలా సంపాదించిన సొమ్ము నుంచి జిల్లా మంత్రికి రూ.25 లక్షలు సమర్పించుకున్నాడన్నది బహిరంగ రహస్యం. మంత్రి పైరవీకి విలువ లేకుండా పోవడంతో ఆయనకు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి దక్కలేదు. దీంతో ఆయనకు కార్పొరేటర్‌ సీటు ఇచ్చి సర్ది చెప్పారు. 


నగరవ్యాప్తంగా ఇలా ప్రజలను పీక్కుతుంటూ ప్రజాసేవ పేరుతో ఓట్లు అడిగేందుకు వచ్చేవారు చాలా మందే ఉన్నారు. ఇప్పుడిక ప్రజల చైతన్యమే నగరానికి శ్రీరామరక్ష. 

Updated Date - 2021-02-24T07:00:32+05:30 IST