కార్పొరేటర్‌ లంచావతారం?

ABN , First Publish Date - 2020-09-17T08:39:22+05:30 IST

హైదరాబాద్‌ ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని అడిక్‌మెట్‌ డివిజన్‌లో ఓ నిర్మాణదారుడి నుంచి కార్పొరేటర్‌

కార్పొరేటర్‌ లంచావతారం?

  • ఇళ్ల నిర్మాణదారుల నుంచి మామూళ్ల వసూలు!
  • భర్తతో అడిక్‌మెట్‌ కార్పొరేటర్‌ ఫోన్‌ సంభాషణ లీక్‌

 రాంనగర్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌  ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని అడిక్‌మెట్‌ డివిజన్‌లో ఓ నిర్మాణదారుడి నుంచి కార్పొరేటర్‌ లంచం తీసుకున్న ఘటన కలకలం సృష్టించింది. ఆ మహిళా కార్పొరేటర్‌ రూ.20 వేలు తీసుకున్నట్లు, ఇతర నిర్మాణదారులను కూడా డబ్బులు అడిగినట్లు స్వయంగా తన భర్తకే ఫోన్‌ చెప్పింది. అయితే, ఈ ఫోన్‌ సంభాషణ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ కావడంతో జీహెచ్‌ఎం సీ ఎన్నికల వేళ విపక్ష నాయకులు దీన్ని ఓ అస్త్రంగా వినియోగించుకుంటున్నారు. వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌ అయిన అడిక్‌మెట్‌ కార్పొరేటర్‌ బి.హేమలతా రెడ్డి, ఆమె భర్త బి.జయరాంరెడ్డిల ఫోన్‌ సంభాషణ ఇలా ఉంది. ‘‘ఓ నిర్మాణదారుడికి ఫోన్‌ చేశాను. ప్లాన్‌ ప్రకారం భవనం కడుతున్నామని, జీహెచ్‌ఎంసీ అధికారులందరికీ ఇచ్చాం కనుక, ఇక ఎవరికీ ఇచ్చేది లేదని చెప్పారు.  నేను రూ.50 వేలు అడిగాను.


రూ.20 వేలు ఇస్తానని ఒప్పుకున్నాడు. మిగతా డబ్బులు మా సార్‌ను అడిగి చెబుతానని నిర్మాణదారుడు చెప్పాడు. అవి కూడా జీహెచ్‌ఎంసీ ఉద్యోగి రాజయ్య తీసుకుంటాడేమోనని నేను తీసుకున్నాను. అలాగే రైల్వే ట్రాక్‌ పక్కన కడుతున్న వ్యక్తి ఈ రోజు వస్తానని చెప్పాడు. అతను డీఎంసీ ఉమాప్రకా్‌షకు ఇచ్చానని చెబుతున్నాడు. రాంనగర్‌లోని వెంకటేశ్వర దుస్తుల షాపు యజమానికి ఫోన్‌ చేశాను. అతను 3 శ్లాబ్‌లు వేశాడు. 3, 4 రోజుల్లో కలుస్తానని చెప్పాడు’’ అని ఆమె భర్తకు వివరించింది. ఈ సంభాషణ భార్యాభర్తల మధ్యే జరిగినప్పటికీ భర్త జయరాంరెడ్డి ఫోన్‌ నుంచి ఇతర గ్రూప్‌లలోకి వెళ్లడం కలకలం రేపింది. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే, పార్టీ అధిష్ఠానం కూడా దృష్టి సారించినట్లు తెలిసింది.


గిట్టని వారి దుష్ప్రచారం: హేమలతా రెడ్డి 

 ఇదంతా అవాస్తవమని, తామంటే గిట్టని వారు చేస్తున్న దుష్ప్రచారమని హేమలతా రెడ్డిని అన్నారు. కల్పిత సంభాషణలు సృష్టించి ఇలా ప్రచారం చేస్తున్నారని వివరణ ఇచ్చారు. 

Updated Date - 2020-09-17T08:39:22+05:30 IST