గుదిబండలుగా కార్పొరేషన్లు!

ABN , First Publish Date - 2021-12-23T08:51:34+05:30 IST

రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు సర్కారుకు గుదిబండలుగా మారాయా? అయినా రాజకీయ నేతలకు పునారావాస కేంద్రాలుగా వాటిని వాడుకుంటోందా? ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థల పరిస్థితిని బట్టి ఇది నిజమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గుదిబండలుగా కార్పొరేషన్లు!

  • పని లేదు.. నిధుల్లేవు.. ఉద్యోగులూ లేరు
  • నిర్వహణ ఖర్చులూ ఇవ్వని సర్కార్‌
  • 50 వరకు ప్రభుత్వరంగ సంస్థలు నిర్వీర్యం
  • ఉనికిని కోల్పోయిన కుల కార్పొరేషన్లు
  • ఆయా వర్గాలకు సేవలందించలేని పరిస్థితి
  • చైర్మన్లను మాత్రం నియమిస్తున్న ప్రభుత్వం
  • రాజకీయ నేతలకు సంస్థలు పునరావాస
  • కేంద్రాలుగా మారాయనే ఆరోపణలు

హైదరాబాద్‌, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు సర్కారుకు గుదిబండలుగా మారాయా? అయినా రాజకీయ నేతలకు పునారావాస కేంద్రాలుగా వాటిని వాడుకుంటోందా? ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థల పరిస్థితిని బట్టి ఇది నిజమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లోని పెట్టుబడులను కేంద్రం ఉపసంహరించుకుంటూ వాటిని నిర్వీర్యం చేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవలే మండిపడ్డారు. ‘నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌(ఎన్‌ఎంపీ)’ ద్వారా కార్పొరేట్‌ కంపెనీలకు వాటిని ధారాదత్తం చేస్తోందని, లక్షలాది ఉద్యోగులు, వారి కుటుంబాలను రోడ్లపైకి నెడుతోందని ఆగ్రహించారు. కానీ, ఇదే సమయంలో రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలకు ఇక్కడి ప్రభుత్వం ఏమాత్రం ఊతమిస్తుందన్న ప్రశ్నలున్నాయి. ఆయా సంస్థలు సవ్యంగా కొనసాగేలా పెట్టుబడి వ్యయాలు, ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ ఖర్చుల కోసం ఏమైనా నిధులిస్తుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. పలు కులాల సముద్ధరణ కోసం ఏర్పాటైన సంస్థలకైనా ప్రభుత్వం నిధులివ్వడం లేదన్న ఆరోపణలున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ అత్యంత శ్రద్ధ, అభిమానాలతో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ స్టేట్‌ మోస్ట్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ కార్పొరేషన్‌’కు ఇప్పటివరకు ఎన్ని నిధులిచ్చింది, ఎంత మంది ప్రయోజనం పొందారు, ఆ వర్గాలు దారిద్య్ర రేఖను దాటాయా.. అన్న చర్చ ఉంది. 


చెప్పుకొంటూ పోతే ఒక్కో కార్పొరేషన్‌ది ఒక్కో గాథ. ఏ ఒక్కటీ ఒడిదుడుకులు లేకుండా నడవడంలేదు. టీఎ్‌సఆర్టీసీ సైతం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అప్పుల ఊబిలో చిక్కుకుని దినదిన గండంగా సాగుతోంది. ఇక కాళేళ్వరం, మిషన్‌ భగీరథ, రోడ్ల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు.. యంత్రాంగం పెద్దగా లేకపోయినా అప్పుల కుప్పలుగా మారుతున్నాయి. కొన్ని కార్పొరేషన్లు సిబ్బంది లేక నామమాత్రంగా మిగిలాయి. చాలా కార్పొరేషన్లు రాజకీయ నాయకులకు పునరావాస కేంద్రాలుగా మారాయి. కార్పొరేషన్లకు ప్రభుత్వం చైర్మన్లను నియమిస్తూ ఆర్థిక భారాన్ని మోపుతుందే తప్ప.. అవి పని చేస్తున్నాయా లేదా, వాటిలో ఎంత మంది ఉద్యోగులున్నారు, జీతభత్యాలు ఎలా అందుతున్నాయన్నది పరిశీలించడం లేదు. ఇలాంటి సమస్యలతో చాలా కార్పొరేషన్లు ఉనికి కోల్పోతున్నాయి. 


50 వరకు కార్పొరేషన్లు నిర్వీర్యం..

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ చట్టం-2014లోని 9వ షెడ్యూలు కింద తెలంగాణలో 91 రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు(ఎ్‌సపీఎ్‌సయూలు) ఉండగా, వీటిలో 50 వరకు కార్పొరేషన్లు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నిరుద్యోగులకు రుణాలు, మార్జిన్‌ మనీ ఇచ్చి ఉపాధి మార్గాలు చూపాల్సిన ఎస్సీ, బీసీ కార్పొరేషన్లు, ట్రైకార్‌ పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. కాంగ్రెస్‌ హయాం నుంచే వీటికి నిధుల కేటాయింపులను నిలిపివేశారు. చేనేత వర్గాలను ఆదుకోవాల్సిన ట్రెస్కో.. నిధుల్లేక కునారిల్లుతోంది. గీత కార్మికుల కోసం రుణాలిచ్చే ట్యాడీ టాపర్స్‌ కో-ఆపరేటివ్‌ కార్పొరేషన్‌ నిర్వీర్యమైపోయింది. దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు, చేతులు, ఇతర పరికరాలను అందించి, వారికి చేయూతనివ్వాల్సిన వికలాంగుల అభివృద్ధి సంస్థ నిధుల్లేక పరికరాలను తయారు చేయలేకపోతోంది. రూ.25 వేలతో మూడు చక్రాల మోటారు సైకిల్‌ను తయారు చేసి దివ్యాంగులకు ఇచ్చిన ఈ సంస్థ.. సిబ్బంది, యంత్రాలు లేకపోవడంతో మార్కెట్‌ నుంచి రూ.60 వేలకు కొనుగోలు చేస్తోంది. అవి కూడా అరకొరగానే ఉంటున్నాయి. 


ఇందులో 450 మంది ఉద్యోగులు పని చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం 30 మంది వరకు మాత్రమే ఉన్నారు. నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి మార్గాన్ని చూపాల్సిన సెట్విన్‌ పూర్తిగా ఉనికి కోల్పోయింది. టీఎస్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌, థియేటర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌లో 900 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా.. ఇప్పుడు 10 మందే పని చేస్తున్నారు. థియేటర్లు, సినీరంగ కార్మికుల గురించి పట్టించుకోవాల్సిన ఈ సంస్థ.. పేరు కోసమే మిగిలి ఉంది. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు కొనుగోలు చేసి, రైతులకు అందించే టీఎస్‌ ఆగ్రోస్‌ నిధుల్లేక ఆ పని చేయలేకపోతోంది. ఆహార పదార్థాలను తయారు చేసే ‘టీఎస్‌ ఫుడ్స్‌’ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఇచ్చే నిధులతో అంగన్‌వాడీలకు బాలామృతాన్ని తయారు చేస్తూ కాలం వెళ్లదీస్తోంది. 

 

పని లేని సంస్థలను పట్టించుకోరా?

రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో రెండు రకాలు ఉన్నాయి. స్వయంగా నిధులు సమకూర్చుకుని నడిచే(సెల్ఫ్‌ సస్టెయిన్డ్‌) సంస్థలు కొన్ని కాగా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు సేవలందించే(సర్వీస్‌ ఓరియంటెడ్‌) సంస్థలు మరికొన్ని ఉంటాయి. టీఎ్‌సఆర్టీసీ, టూరిజం డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌, టీఎస్‌ జెన్‌కో, టీఎస్‌ ట్రాన్స్‌కో, సివిల్‌ సప్లయ్‌, ఫారెస్ట్‌ డెవల్‌పమెంట్‌, మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్లు, సింగరేణి వంటివి సెల్ఫ్‌ సస్టెయిన్డ్‌ కార్పొరేషన్లుగా పని చేస్తున్నాయి. వాటికి వివిధ మార్గాల ద్వారా ఒనగూరే నిధులను జీతభత్యాలు, నిర్వహణ ఖర్చుల కోసం వినియోగిస్తున్నాయి. కానీ, ప్రజలకు సేవలందించే సివిల్‌ సప్లయ్‌, టీఎస్‌ ఆయిల్‌ఫెడ్‌, టీఎస్‌ మార్క్‌ఫెడ్‌, టీఎస్‌ ఆగ్రోస్‌, హాకా వంటి సంస్థలకు ప్రభుత్వమే నిధులు సమకూర్చాల్చి ఉంటుంది. ఆగ్రోస్‌, టెస్కో, కుల సంఘాల కార్పొరేషన్లకు ఎలాంటి నిధులూ అందడంలేదు. దీంతో చాలా సంస్థలు పనిలేకుండా తయారయ్యాయి. ఇలాంటి సంస్థలపై ప్రభుత్వం ఎందుకు విధానపరమైన నిర్ణయం తీసుకోవడంలేదు? వీటిలోని ఉద్యోగులను ఇతర సంస్థల్లోకి మార్చి, వారికి పూర్తి స్థాయిలో జీతభత్యాలు ఇవ్వడం ద్వారా పని చేయించుకోవచ్చు కదా.. అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


చైర్మన్ల జీతభత్యాలతో ఏటా రూ.5 కోట్ల భారం

రాష్ట్రంలో చాలా కార్పొరేషన్లు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. ఇవి అవసరమా, కాదా.. అన్నది ప్రభుత్వం తేల్చాలి. అవసరం లేదనుకుంటే వాటిని మూసేసి, ఉద్యోగులను ఇతర సంస్థల్లో విలీనం చేయాలి. తద్వారా ప్రభుత్వంపై అనవసర భారం తగ్గుతుంది. అవసరంలేని కార్పొరేషన్లకు ప్రభుత్వం చైర్మన్లను నియమించి వాటిపై ఆర్థిక భారాన్ని మోపుతోంది. వీరి జీతభత్యాలు, వాహనాల ఖర్చుల కింద ఏటా రూ.5 కోట్ల వరకు ఖర్చవుతోంది.  

- ఎం.పద్మనాభరెడ్డి, కార్యదర్శి, ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌


కార్పొరేషన్లకు పునర్‌వైభవం తేవాలి

రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్టీఆర్‌ హయాం నుంచి వైఎ్‌సఆర్‌ హయాం వరకు ఒక వెలుగు వెలిగాయి. ఆ తర్వాత నుంచి ప్రభుత్వాలు వీటికి నిధులివ్వక నిర్వీర్యం చేస్తూ వచ్చాయి. దీంతో ఇప్పుడు ఉద్యోగుల్లేక, జీతభత్యాలు లేక సంస్థలు కనుమరుగవుతున్నాయి. వీటి ద్వారా చాలా మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వీటికి ప్రభు త్వం నిధులు కేటాయించి, పునర్‌వైభవం తేవాలి.

- జీటీ జీవన్‌, ప్రభుత్వ రంగ సంస్థల సమాఖ్య సెక్రటరీ జనరల్‌


నిర్జీవంగా, నిర్వీర్యంగా ఉన్న కొన్ని కార్పొరేషన్లు

స్టేట్‌ హ్యాండిక్రాఫ్ట్స్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌

స్టేట్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ కో-ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌

స్టేట్‌ మోస్ట్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌

స్టేట్‌ విశ్వబ్రాహ్మణ కో-ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌

స్టేట్‌ మేదర కో-ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌

స్టేట్‌ ట్యాడీ టాపర్స్‌ కో-ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌

స్టేట్‌ మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌

స్టేట్‌ వుమెన్‌ కో-ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌

స్టేట్‌ వికలాంగుల కో-ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌

స్టేట్‌ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌

స్టేట్‌ యోగాధ్యయన పరిషత్‌

స్టేట్‌ ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌

స్టేట్‌ లెదర్‌ ఇండస్ట్రీస్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌

స్టేట్‌ ఆగ్రోస్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌

స్టేట్‌ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌

ఖాదీ అండ్‌ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ బోర్డు

స్టేట్‌ టెక్స్‌టైల్స్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌

స్టేట్‌ లైవ్‌స్టాక్‌ డెవల్‌పమెంట్‌ ఏజెన్సీ

స్టేట్‌ అర్బన్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌, సెట్విన్‌, ట్రైకార్‌, తెలంగాణ ఫుడ్స్‌

స్టేట్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌, థియేటర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌

Updated Date - 2021-12-23T08:51:34+05:30 IST