గాడి తప్పిన కార్పొరేషన్‌ పాలన..

ABN , First Publish Date - 2022-05-26T07:20:31+05:30 IST

కడప కార్పొరేషన్‌ కమిషనర్‌గా మొట్టమొదటి సారి ఐఏఎస్‌ అధికారి వస్తున్నారు. 2019వ బ్యాచ్‌కు చెందిన సూర్యసాయిప్రవీణ్‌చంద్‌ విజయవాడ సబ్‌కలెక్టర్‌గా పనిచేశారు. బదిలీపై నేడు కడప కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఐఏఎస్‌ అధికారి

గాడి తప్పిన కార్పొరేషన్‌ పాలన..
సీఎ్‌సఐ చర్చి ఎదురుగా గుంతల మయంగా ఉన్న రోడ్డు

ఇష్టారాజ్యంగా అధికారులు..

వైసీపీ కార్యాలయంగా మారిన కార్పొరేషన్‌

కమిషనర్‌గా నేడు బాధ్యతలు స్వీకరించనున్న సూర్యసాయిప్రవీణ్‌చంద్‌


మేడిపండు చూడు మేలిమై ఉండు... పొట్ట విప్పి చూడు పురుగులు ఉండు.. అన్నచందంగా తయారైంది కడప కార్పొరేషన్‌ పరిస్థితి. సీఎం వైఎస్‌ జగన్‌ సొంత జిల్లా కావడంతో కడప కార్పొరేషన్‌  అభివృద్ధి చెందుతుందని, తాగునీరు, శానిటేషన్‌ ఇలా అన్నీ బాగుంటాయని జనం ఆశించారు. అయితే ఇక్కడ ఆ పరిస్థితి లేదు. పేరుకే కార్పొరేషన్‌... మితిమీరిన రాజకీయజోక్యం.. అధికారుల ఇష్టారాజ్యం.. వివిధ సెక్షన్‌లలో కీలకాధికారుల పోస్టులు ఖాళీ.. వెరసి పన్నులు చెల్లించే నగర జీవికి మౌలిక వసతులు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఐఏఎస్‌ అధికారిని కమిషనర్‌గా నియమించింది. ఈయన గురువారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో కడప కార్పొరేషన్‌లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక కథనం..


(కడప - ఆంధ్రజ్యోతి): కడప కార్పొరేషన్‌ కమిషనర్‌గా మొట్టమొదటి సారి ఐఏఎస్‌ అధికారి వస్తున్నారు. 2019వ బ్యాచ్‌కు చెందిన సూర్యసాయిప్రవీణ్‌చంద్‌ విజయవాడ సబ్‌కలెక్టర్‌గా పనిచేశారు. బదిలీపై నేడు కడప కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఐఏఎస్‌ అధికారి కమిషనర్‌గా రావడంతో ఉద్యోగులు, కార్పొరేటర్లలో ఓ వర్గం సంతోషిస్తుండగా మరో వర్గం తమ ఆటలు సాగవేమోనని మీమాంసలో పడ్డారు. పేరుకే కార్పొరేషన్‌ ప్రభుత్వ కార్యాలయం.. దానిని వైసీపీ కార్యాలయంగా మార్చారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాకు కడప నగరం గుండెకాయ లాంటిది. జిల్లా కేంద్రం కావడంతో నిత్యం పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. సుమారు 4 లక్షల జనాభా ఉంది. అయితే కడప కార్పొరేషన్‌ స్థాయికి వచ్చి 15 ఏళ్లు అయినా ఆ స్థాయికి తగ్గట్లు వసతులు కరువయ్యాయి.


దారి తప్పిన పాలన

పాలకవర్గం మితిమీరిన రాజకీయ జోక్యంతో కార్పొరేషన్‌ పాలన గాడితప్పిందనే విమర్శలు ఉన్నాయి. ఇక్కడ ఏ అధికారి ఎవరి మాట వింటారో, ఎవరు ఏ పని చేస్తారో, తెలియని పరిస్థితి అని చెబుతారు. వివిధ సమస్యలపై వచ్చే జనానికి కూడా సమాధానం చెప్పే నాయకులు అధికారులు కరువయ్యారా అంటున్నారు. ఎవరి శాఖలో ఏమి జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఉందంటున్నారు. కేవలం రూ.1000 బిల్లులు చేయాలన్నా కూడా ఓ నేత చెబితేగాని అధికారులు ఓకే చేయరనే విమర్శ ఉంది. 


పారిశుధ్యం అధ్వాన్నం 

కార్పొరేషన్‌లో ప్రధానమైనది పారిశుధ్య విభాగం. ఆ విభాగాన్ని దారినపెడితే సగం సమస్య తీరినట్లే. ఇంటి నుంచి చెత్త సేకరణకు క్లాప్‌ ప్రోగ్రామ్‌ అమలు చేస్తున్నారు. ఇంటింటి నుంచి చెత్త సేకరిసున్నారు. చెత్తను ఒకచోట చేర్చి అక్కడి నుంచి డంపింగ్‌ యార్డ్‌కు తీసుకెళ్లేందుకు 5 చోట్ల తాత్కాలిక చెత్తనిల్వ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏడాది క్రితం 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి టెండర్‌ కూడా పిలిచారు. జనం ఇబ్బందులను దృష్టిలో ఆలోచించకుండా ఎక్కడపడితే అక్కడ నిర్మించాలని భావించారు. నగరం నడిబొడ్డున ఉన్న పాత రిమ్స్‌లో చెత్త కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడంతో ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అయింది. జనావాసాల మధ్య చెత్త సేకరణ కేంద్రం వద్దేవద్దని ప్రజలు మొత్తుకుంటున్నారు. చెత్తసేకరణ సక్రమంగా జరగలేదు. ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పకుప్పలుగా దర్శనమిస్తోంది. కీలకమైన ఎంహెచ్‌వో పోస్టు ఖాళీగా ఉంది. శానిటేషన్‌ పెత్తనమంతా సెక్రటరీలకు అప్పజెప్పడంతో అక్కడున్న ఐదుగురు ఇన్‌స్పెక్టర్లు ఉత్సవ విగ్రహాల్లా ఉన్నారు. దీంతో చెత్త సేకరణ సక్రమంగా జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. 


ఇంజనీరింగ్‌లో ఎవరి దారి వారిదే..

ఇంజనీరింగ్‌ సెక్షన్‌లో అధికారుల మధ్య సమన్వయం లేదని అంటుంటారు. ఎస్సీతోపాటు ఈఈ పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడ సరైన డ్రాఫ్టింగ్‌ చేసే ఇంజనీరింగ్‌ కూడా లేడని విమర్శలు ఉన్నాయి. నగరం చుట్టూ నీరున్నా రోజూ తాగునీరు ఇవ్వలేని పరిస్థితి. ఎప్పుడు నీళ్లు వస్తాయో.. రావో తెలియదు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులకు, నాలుగు రోజులకు తాగునీరు అందిస్తున్నారు. వర్షాకాలంలో కూడా తాగునీటి కోసం ఇబ్బంది పడ్డారు. కడప రహదారులన్నీ అధ్వాన్నంగా ఉన్నాయి. వివిధ పనుల కోసం టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు పనులు మొదలు పెట్టలేదు. ఆ కాంట్రాక్టర్లతో పనులు చేయించడంలో ఇంజనీరింగ్‌ అధికారులు విఫలమయ్యారని విమర ్శలు ఉన్నాయి.


రెవెన్యూలో ఒత్తిళ్లకే పరిమితం

కార్పొరేషన్‌కు రెవెన్యూ సెక్షన్‌ కేవలం పన్నుల రాబడికే పరిమితమైపోయింది. కార్పొరేషన్‌ ఖజానాకు సొంతంగా ఆదాయం సమకూర్చడంలో విఫలమయిందన్న విమర్శలు ఉన్నాయి. కార్పొరేషన్‌కు సంబంధించిన 68 భూముల, వాణిజ్య భవనాల లీజు గడువు పూర్తి అయింది. వాటిని తిరిగి వేలం నిర్వహిస్తే కార్పొరేషన్‌కు కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి.


అనధికారిక లేఔట్లు

కడప నగరం చుట్టూ ఎటు చూసినా లేఔట్లు వెలుస్తున్నాయి. ఇప్పటికే టౌన్‌ప్లానింగ్‌ అధికారులు 183 అనధికార లేఔట్లను గుర్తించారు. వార్డు సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రతి డివిజన్‌లో రెండు సచివాలయాలు ఉన్నాయి. దీంతో మొత్తం 100 మంది వార్డు ప్లానింగ్‌ సెక్రటరీలు ఉన్నారు. అయినప్పటికీ లేఔట్లు వెలుస్తున్నాయి. ఆ లేఔట్ల వెనుక ఎవరున్నారన్నది అందరికీ తెలిసిందే. అనధికారిక లేఔట్లపై తొలుత ఉక్కుపాదం మోపితే అవి కొని జనం మోసపోకుండా ఉంటారు. 


మితిమీరిన రాజకీయ జోక్యం

కార్పొరేషన్‌ యంత్రాగంపై మితిమీరిన రాజకీయ జోక్యం ఉందనే విమర్శలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం జరగాల్సిన పనులు కూడా తనకు తెలిసే జరగాలంటూ ఓ నేత హుకుం జారీ చేస్తున్నారని అంటున్నారు. సిబ్బందితో కూడా అమర్యాదగా ప్రవర్తించడంతో పాటు, బూతులు మాట్లాడుతుంటాడని అంటుంటారు. ఆయన అనుచరులు కూడా ఆయననే అనుసరిస్తూ దూషణలకు దిగుతున్నట్లు అధికార వర్గాలు వాపోతున్నాయి. మితిమీరిన రాజకీయ జోక్యంతో పాటు కార్పొరేషన్‌ను వైసీపీ కార్యాలయంగా మార్చారనే విమర్శ తీవ్రంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కమిషనర్‌గా సూర్యసాయిప్రవీణచంద్‌ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఆయనపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. గాడి తప్పిన కార్పొరేషన్‌ను దారిలో పెడతారన్న ఆశ నగరవాసుల్లో, కొంతమంది అధికారులు, కార్పొరేటర్లలో ఉంది. ఏదైనా సమస్యపై కార్పొరేటర్లు అధికారులకు వినతిపత్రం ఇచ్చినా వాటికి మోక్షం లేదని అయితే ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉండకపోవచ్చని ఓ కార్పొరేటర్‌ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-05-26T07:20:31+05:30 IST