పశ్చిమ గోదావరి జిల్లాకు.. నాలుగు బీసీ కార్పొరేషన్ల చైర్మన్‌ పదవులు

ABN , First Publish Date - 2020-10-01T18:04:20+05:30 IST

కొంత కాలంగా ఊరిస్తున్న బీసీ కార్పొరేషన్‌ పదవులు జిల్లాకు నాలుగు..

పశ్చిమ గోదావరి జిల్లాకు.. నాలుగు బీసీ కార్పొరేషన్ల చైర్మన్‌ పదవులు

అధికారికంగా వెల్లడించని ప్రభుత్వం


ఏలూరు(ఆంధ్రజ్యోతి): కొంత కాలంగా ఊరిస్తున్న బీసీ కార్పొరేషన్‌ పదవులు జిల్లాకు నాలుగు దక్కనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 56 కార్పొరేషన్లకు చైర్మన్‌ పదవుల నియామకానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో జిల్లాకు నాలుగు కేటాయించింది. ఒక్కటిగా వున్న బీసీ కార్పొరేషన్‌ను బీసీ కులాల్లోని జనాభా దామాషా మేరకు పలు కార్పొరేషన్‌లుగా విభజించింది. ఇందులో జిల్లాకు సూర్యబలిజ, శెట్టిబలిజ, అత్యంత వెనుకబడిన తరగతులు, అత్తిరాశ కార్పొరేషన్ల చైర్మన్‌ పదవులు జిల్లాకు లభించే అవకాశం ఉంది. వీటికి సంబంధించిన పేర్లను మాత్రం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 


వీరికి దక్కే అవకాశం

జిల్లాలో ప్రధానంగా కీలక సామాజిక వర్గం శెట్టిబలిజ. ఈ కార్పొరేషన్‌కు విద్యావేత్త, పెనుగొండకు చెందిన గుబ్బల తమ్మయ్య పేరు పరిశీలించారు. ఆయన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ బావ. గతంలో జనసేనలో ఉండేవారు. తదుపరి వైసీపీలో చేరారు. సామాజికపరంగా మొన్నటి ఎన్నికలలో ఈ కులస్తులు వైసీపీ వైపు మొగ్గు చూపారు. జిల్లాలో బలమైన ఈ బీసీ వర్గాన్ని తన వైపు బలపరుచుకోవాలని అధికార పక్షం చూస్తోంది. పైగా పితానికి మద్దతుగా వున్న వారిని ఆచంట అసెంబ్లీలో తమ వైపు తిప్పుకునే వ్యూహం కావచ్చు.


సంచార జాతుల సంఘాన్ని స్థాపించిన యువకుడు పెండ్ర వీరన్నకు అత్యంత వెనుకబడిన తరగతుల కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవికి పరిశీలనలో ఉంది. ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన వీరన్న ముఖ్యమంత్రి దృష్టిలో ఉన్నారు. సంచారజాతుల సమస్యలపై పోరాడుతున్న వీరన్న నరసాపురం నియోజక వర్గానికి చెందిన వారు. ఎమ్మెల్యే ప్రసాదరాజు ఆశీస్సులున్నాయి.  మరో వెనుకబడిన తరగతుల కులం సూర్యబలిజ. ఈ కులానికి చెందిన ఉంగుటూరు అసెంబ్లీకి చెందిన సత్తి అనంతలక్ష్మి పేరు పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్యే వాసుబాబు ఈ పేరును ప్రతి పాదించారు. యాభై శాతం మహిళల రిజర్వేషన్‌లో ఆమెకు ఈ పదవి లభించింది. అత్తిరాశ సంఘం కార్పొరేషన్‌కు కొయ్యలగూడెంకు చెందిన యల్లా భాస్కరరావు పేరు ప్రతిపాదనలో ఉంది. ఈయన 2011 నుంచి పార్టీలో ఉన్నారు. 



Updated Date - 2020-10-01T18:04:20+05:30 IST