నామినేటెడ్‌ పదవుల్లో కడప జిల్లాకు పెద్ద పీట

ABN , First Publish Date - 2020-10-01T18:34:00+05:30 IST

బలహీన వర్గాల కులాల కార్పొరేషన్‌, పాలకవర్గం సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక..

నామినేటెడ్‌ పదవుల్లో కడప జిల్లాకు పెద్ద పీట

నలుగురికి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు

పద్మశాలీ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా జింకా విజయలక్ష్మి

నూర్‌బాష/దూదేకుల కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా పకూర్‌బీ

నాయీబ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా యానాదయ్య

యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నన్యంపల్లి హరీష్‌కుమార్‌

నేడు అధికారికంగా ప్రకటించే అవకాశం


కడప(ఆంధ్రజ్యోతి): బలహీన వర్గాల కులాల కార్పొరేషన్‌, పాలకవర్గం సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. నామినేటెడ్‌ పదవుల కేటాయింపులో జిల్లాకు పెద్దపీట వేశారు. స్థానిక ఎమ్మెల్యేల సిఫారసుల మేరకే జిల్లా వాసులకు నలుగురికి నామినేటెడ్‌ పదవులు కేటాయించినా, వైఎస్‌ కుటుంబ సన్నిహితులకే అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. నేడో, రేపో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.


విధేయతకు పట్టం

ప్రొద్దుటూరు పట్టణం చేనేత వర్గానికి చెందిన న్యాయవాది జింకా విజయలక్ష్మికి పద్మశాలీ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పదవి వరించింది. అదే సామాజిక వర్గానికి చెందిన ఆమె జగన్‌ వీరాభిమాని. వైసీపీ ఆవిర్భావం సమయంలోనే ఆ పార్టీలో చేరింది. 2014 వరకు ప్రొద్దుటూరు పట్టణ వైసీపీ అధ్యక్షురాలిగా పనిచేసింది. ఆ తర్వాత వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం కడప పార్లమెంట్‌ జిల్లా వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. పద్మశాలీయుల అభ్యన్నతి కోసం కృషి చేస్తానని ఆమె ఆంధ్రజ్యోతికి వివరించారు. 


జగన్‌ విధేయుడికి చైర్మన్‌ పదవి

కడప నగరం చిన్నచౌక్‌కు చెందిన సిద్దవటం యానాదయ్యకు నాయీబ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఖరారు చేశారు. సీఎం జగన్‌ పట్ల ఉన్న విధేయతే ఆయనకు పదవి వచ్చేలా చేసింది. 1996 నుంచి నాయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షునిగా ఉన్నారు. బీసీ సంఘాల రాష్ట్ర జేఏసీ కన్వీనర్‌గా పనిచేశారు. వైసీసీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి, జిల్లా అధికార ప్రతినిధిగా, రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా పనిచేశారు. 2009 నుంచి వైఎస్‌ జగన్‌తో కలిసి నడిచారు.  నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి ప్రత్యేకంగా కృషి చేస్తానని ఆయన వివరించారు. 


పులివెందులకు రెండు పదవులు

సీఎం వైఎస్‌ జగన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గానికి రెండు కార్పొరేషన్‌ పదవులు దక్కాయి. వైఎస్‌ కుటుంబంతో 1978 నుంచి విధేయత కొనసాగిస్తున్న హస్పరి మహమ్మద్‌ రఫీ సతీమణి హస్పరి పకూర్‌బీకి నూర్‌బాష/దూదేకుల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పదవి ఇచ్చారు. వైఎస్‌ కుటుంబంతో విధేయతగా ఉండడంతో పాటు వైసీపీ అవిర్భావం నుంచి ఆ పార్టీలోనే పకూర్‌బీ కుటుంబం కొనసాగుతోంది. ఆమె భర్త మహమ్మద్‌ రఫీ వైసీపీ రాష్ట్ర మైనార్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అలాగే జగన్‌ పాదయాత్రలో ఆయనతో కలిసి చివరిదాకా నడిచిన పులివెందులకు చెందిన నన్యంపల్లి హరీష్‌కుమార్‌ను యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి వరించింది. ఈయన సీఎం జగన్‌కు సన్నిహితుడు కావడం గమనార్హం.





Updated Date - 2020-10-01T18:34:00+05:30 IST