రచ్చ.. రచ్చ

ABN , First Publish Date - 2022-08-09T06:25:12+05:30 IST

కౌన్సిల్‌ సమావేశం రచ్చ రచ్చగా జరిగింది.

రచ్చ.. రచ్చ

వాడివేడిగా నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశం

తీర్మానాలు అమలు కావడం లేదంటూ ఆవేదన

టీ, బిస్కెట్ల కోసం వస్తున్నామా అంటూ ఆగ్రహం 

ఎమ్మెల్యే ముస్తఫా.. కార్పొరేటర్‌ రోషన్‌ మధ్య వాగ్వాదం

పలు అంశాలపై ప్రశ్నించిన డిప్యూటీ మేయర్‌ 

టిడ్కో ఇళ్లు, అనధికార హోర్డింగ్‌లపై చర్చ

మొత్తం 204 అంశాలకు ఆమోదం


గుంటూరు(కార్పొరేషన్‌), ఆగస్టు 8: కౌన్సిల్‌ సమావేశం రచ్చ రచ్చగా జరిగింది. గతంలో తాను చేసిన తీర్మానాలు ఎక్కడా అమలు కావడం లేదంటూ.. తాము సమావేశాలకు కేవలం టీ, బిస్కట్ల కోసమే వస్తున్నామా అంటూ పలువురు కార్పొరేటర్లు ఆవేదన చెందగా.. సాక్షాత్తు అఽధికారపార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ముస్తఫా కూడా కౌన్సిల్‌లో ఆమోదం పొందిన తీర్మానాలు ఎక్కడా అమలు కావడం లేదంటూ ప్రశ్నించారు. గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశం సోమవారం జరిగింది. ఎమ్మెల్యే ముస్తఫా వాణిజ్య భవనాల సెల్లార్ల ఆక్రమణల గురించి మాట్లాడుతున్నప్పుడు అదే పార్టీకి చెందిన కార్పొరేటర్‌ రోషన్‌ అడ్డు తగిలారు. మీరు మాట్లాడేది కరెక్ట్‌ కాదని కేవలం గుంటూరు వన్‌టైన్‌లోని సెల్లార్లు కాదని, నగరం అంతా ఉన్నాయని, వాటన్నింటిని తొలగించాలని పట్టుబట్టారు. టిడ్కో ఇల్లు, అనఽధికార హోర్డింగ్స్‌, ఉచిత కుళాయిలు, ఈ బస్‌బేలపై వాడి వేడిగా చర్చ జరిగింది. వాహనాల షెడ్‌, హోర్డింగ్‌లు, ఇంజనీరింగ్‌ విభాగంలో కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందంటూ డిప్యూటీ మేయర్‌ డైమండ్‌బాబు ఇంజనీరింగ్‌ అధికారులను ప్రశ్నించారు. అధికారులు నేరుగా సమాధానలు చెప్పలేక నీళ్లు నమిలారు. అభివృద్ధిపై టీడీపీ కార్పోరేటర్లు ప్రశ్నించారు.


కౌన్సిల్‌లో చర్చించిన అంశాలు..

నగరంలో కుక్కలు, పందుల బెడద అధికంగా ఉందంటూ పలువురు కార్పొరేటర్లు ఆవేదన చెందారు.  ఒక కమిటీ వేసి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటర్‌ప్లాంట్లను సీజ్‌ చేయాలని సభ్యులు సూచించారు.  రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని అనేకమంది కార్పొరేటర్లు అసహనం వ్యక్తం చేశారు. కార్పొరేటర్‌ గ్రాంట్‌ను రూ.50 లక్షల నుంచి రూ.కోటికి పెంచాలని పలువురు విజ్ఞప్తి చేశారు. గుంటూరు కొత్తపేట, ఓల్డ్‌క్లబ్‌రోడ్డుతో పాటు నగరం మొత్తంలోని హాస్పటల్స్‌ వద్ద ఉన్న సెల్లార్ల ఆక్రమణలను తొలగించాలని తీర్మానించారు. అదేవిధంగా నగరంలో పురాతనకాలంలో కట్టిన భవనాలు కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయని, వాటిపై కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్‌వీఎన్‌ కాలనీలోని చిన్మయ విద్యామిషన్‌లో అక్రమాలు జరుగుతున్నాయని, ప్రత్యేక న్యాయవాదిని ఏర్పాటు చేసి ఆ స్థలాన్ని స్వాధీనపర్చుకోవాలని డిప్యూటీ మేయర్‌ డైమండ్‌బాబు కోరారు. వాహనాల షెడ్‌లో రూ.19 కోట్ల కుంభకోణం జరిగిందని, మరమత్తులకు రూ.4 కోట్లు ఖర్చుపెట్టారని ఆరోపించారు. నగరంలో అనధికారిక హోర్డింగ్‌లకు టౌన్‌ ప్లానింగ్‌ అధికారి ఒకరు కొమ్ము కాస్తున్నారని ఓ ప్రైవేటు సంస్థ చెప్పినట్లుగా ఆయన నడుచుకుంటున్నారన్నారు. రెండోసారి గుంటూరు వచ్చి భారీగా అక్రమాలు చేస్తున్నారని డిప్యూటీ మేయర్‌  ఆరోపించారు. రోడ్ల ప్యాచ్‌వర్కుల పేరిట రూ.7 కోట్లు ఆరోపణలు జరిగాయని ఆరోపించారు.  అనుమతులు లేకుండా ఇంజనీరింగ్‌ అధికారులు ఇష్టారాజ్యంగా నిధులు ఖర్చు చేస్తున్నారని, బడ్జెట్‌ ఆమోదం లేకుండానే రూ.22 కోట్లు ఖర్చు చేశారన్నారు. కౌన్సిల్‌ సమావేశంలో మొత్తం 204 అంశాలకు ఆమోదం తెలిపారు.

ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ మాట్లాడుతూ మహాత్మాగాంధీ గురించి విద్యార్థులందరికీ తెలియజేయాలని సూచించారు. గోరంట్ల కొండపై నిర్మిస్తున్న వాటర్‌ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందని ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు ప్రశ్నించారు. నగరాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పాటుపడదామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ తెలిపారు.  


Updated Date - 2022-08-09T06:25:12+05:30 IST