ప్రైవేట్‌ ప్లాట్ల రక్షణకు కార్పొరేషన్‌ ఇనుప జాలీ

ABN , First Publish Date - 2020-07-09T10:22:37+05:30 IST

బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లోని ఓ ఉద్యోగి ప్రభుత్వ ఆస్తిని తన సొంత ప్లాట్ల కోసం వాడుకున్నాడు.

ప్రైవేట్‌ ప్లాట్ల రక్షణకు కార్పొరేషన్‌ ఇనుప జాలీ

బడంగ్‌పేట్‌లో ఓ ఉద్యోగి నిర్వాకం


సరూర్‌నగర్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లోని ఓ ఉద్యోగి ప్రభుత్వ ఆస్తిని తన సొంత ప్లాట్ల కోసం వాడుకున్నాడు. బడంగ్‌పేట్‌ మునిసిపాలిటీగా ఉన్నప్పుడు రెండేళ్ల క్రితం దావూద్‌ఖాన్‌గూడలోగల ప్రభుత్వ స్థలంలో ఉన్న డంపింగ్‌ యార్డు చుట్టూ రక్షణగా (చెత్త గాలికి ఎగిరిపోకుండా ఉండేందుకు) ఇనుప జాలీ ఏర్పాటు చేశారు. దీనికి అప్పట్లో దాదాపు రూ. 4 లక్షలు వెచ్చించారు. అనంతరం బడంగ్‌పేట్‌లోని చెత్తను జీహెచ్‌ఎంసీ పరిధిలోకి తరలించడంతో సదరు డంపింగ్‌ యార్డు ఖాళీ అయింది. ప్రస్తుతం అక్కడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ భవనంతోపాటు జిల్లా స్థాయిలో అధునాతన లైబ్రరీ నిర్మించడానికి ఇటీవల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థలం చుట్టూ వేసిన ఇనుప జాలీ తొలగించారు.


దాని రక్షణ బాధ్యతను కార్పొరేషన్‌ అధికారులు ఓ ఉద్యోగికి అప్పగించారు. ఆ ఉద్యోగి సగం జాలీ, పైపులను బడంగ్‌పేట్‌ 31వ వార్డు పరిధిలోని శ్మశానవాటికలో పడేసి, మిగతా సగం జాలీ, పైపులను గుర్రంగూడలోని తన సొంత ప్లాట్ల వద్దకు తరలించాడు. తన మూడు ప్లాట్లకు రక్షణగా వాటి చుట్టూ జాలీ, పైపులను ఏర్పాటు చేసుకున్నాడు. ఇనుప జాలీ విషయమై కార్పొరేషన్‌ అధికారులను ప్రశ్నించగా.. శ్మశానవాటికలో ఉందని చెప్పారు. గుర్రంగూడలో ఉద్యోగి ప్లాట్ల చుట్టూ ఏర్పాటు చేసిన జాలీ గురించి తెలియదంటున్నారు. ప్రభుత్వ ఆస్తిని తన స్థలాల రక్షణకు ఉపయోగించుకుంటున్న సదరు ఉద్యోగిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2020-07-09T10:22:37+05:30 IST