మోగిన నగారా.. ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

ABN , First Publish Date - 2021-04-16T06:06:58+05:30 IST

మోగిన నగారా.. ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

మోగిన నగారా.. ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

60డివిజన్లకు రిజర్వేషన్లూ ఖరారు

50శాతం మహిళలకు కేటాయింపు

మొత్తం ఓటర్లు 2,81,387, పోలింగ్‌ కేంద్రాలు 376

ఎన్నికలకు యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు

నేటినుంచి 18వరకు నామినేషన్ల స్వీకరణ 

19న పరిశీలన ఫ 22న ఉపసంహరణ

30న ఎన్నికలు ఫ మే 3న కౌంటింగ్‌

ఖమ్మం, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :  నగర నగారా మోగింది. ఊహించిన విధంగానే  ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. 50నుంచి 60కు పెరిగిన డివిజన్లకు గురువారం ఉదయం రిజర్వేషన్లను ఖరారు చేసిన అనంతరం మధ్యాహ్నానికి నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీంతో అటు అధికారులు, ఇటు రాజకీయపక్షాలు ఒక్కసారిగా ఎన్నికల సందడిలో బిజీ అయిపోయారు. శుక్రవారం నుంచి 18వరకు మూడు రోజులపాటు ఉదయం 10:30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 19న నామినేషన్ల పరిశీలన, 20న తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీలు, 21న అప్పీళ్ల పరిశీలన, 22న మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, ఆతర్వాత అదే రోజు అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. ఇప్పటికే 60డివిజన్లకు 60మంది రిటర్నింగ్‌, 60మంది అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమించారు. నామినేషన్లు వేసేందుకు వచ్చేవారు కొవిడ్‌ నిబంధనలు దృష్టిలో పెట్టుకోవాలని, ప్రతీ ఒక్కరు మాస్కు ధరించి రావాలని, ప్రతిపాదితులు, బలపరిచేవారితో మాత్రమే హాజరుకావాల్సి ఉంటుందని సూచించారు. ఖమ్మం కార్పొరేషన్‌కు సంబంధించి మొత్తం 2,81,387మంది ఓటర్లుండగా అందులో పురుషులు 1,35,734, స్ర్తీలు 1,45,608 మంది, ఇతరులు 45మంది ఉన్నారు. మొత్తం 387 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. నామినేషన్‌ డిపాజిట్‌ కింద జనరల్‌ అబ్యర్థులకు రూ.5వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.2500గా నిర్ణయించారు. ఈనెల 30న ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటలకు పోలింగ్‌ జరుగనుంది. ఎక్కడైనా ఉప ఎన్నికలు అవసరమైతే మే 2న నిర్వహించే అవకాశం ఉంటుంది. 3న ఉదయం 8గంటలకు కౌంటింగ్‌ మొదలవుతుంది. 

బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నిక..

గత కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగించగా.. ఈసారి ఎన్నికలను బ్యాలెట్‌ పద్ధతిలో నిర్వహించనున్నారు. తెలుపురంగులో ఉండే ఈ బ్యాలెట్‌పై అభ్యర్థుల పేర్లు, గుర్తులు ఉండనున్నాయి. 

కరోనా బాధితులకు పోస్టల్‌ బ్యాలెట్లు.. 

ఈసారి కరోనా బాధితులకు బాధితులకు, 80ఏళ్లుదాటిన వృద్ధులు, దివ్యాంగులకు, సైనికులకు, ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్లు అందించనున్నారు. అయితే వీరు ఓటువేసేటప్పుడు కూడా వీడియో చిత్రీకరణలోనే ఓటు వేయాల్సి ఉంటుంది. దీనికోసం ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల నిర్వహణకు 2,500మంది సిబ్బందిని వినియోగించనున్నారు. 

కలెక్టరేట్‌లో సాగిన డివిజన్ల రిజర్వేషన్ల ప్రక్రియ

కార్పొరేషన్‌ డివిజన్ల రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ గురువారం ఉదయం ఖమ్మం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ పర్యవేక్షణలో జరిగింది. రాజకీయపార్టీల నాయకుల సమక్షంలో ఈ రిజర్వేషన్ల ప్రక్రియను నిర్వహించగా మహిళా రిజర్వేషన్ల కేటాయింపును మాత్రం లాటరీ విధానంలో నిర్వహించారు. మొత్తం 60డివిజన్లకుగాను 30డివిజన్లు మహిళలకు రిజర్వు అయ్యాయి. ఎస్టీ, ఎస్సీలో మహిళలకు కేటాయింపు స్వల్పంగా తగ్గినందున జనరల్‌తి కేటగిరీలో మహిళలకు కేటాయింపు పెంచారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, బీజేపీ తరపున జి.విద్యాసాగర్‌, సీపీఐ నుంచి ఎస్‌.నర్సింహారావు, సీపీఎం తరపున వై.శ్రీనివాసరావు, కాంగ్రెస్‌ నుంచి ఎ.రాధాకృష్ణ, టీడీపీ తరపున గుత్తా సీతయ్య, టీఆర్‌ఎస్‌ నుంచి బచ్చు విజయ్‌కుమార్‌ తదితరులు హాజరయ్యారు.


ఎవరెవరికి ఎన్ని, ఏయే డివిజన్లు

ఎస్టీలకు మూడు డివిజన్లు వీటిలో రెండు ఎస్టీ జనరల్‌, ఒకటి ఎస్టీ మహిళ

32వ డివిజన్‌ ఎస్టీ మహిళకు, 1, 8 డివిజన్లు ఎస్టీ జనరల్‌కు కేటాయించారు.

ఎస్సీలకు ఏడు డివిజన్లు కేటాయించగా వీటిలో నాలుగు ఎస్సీజనరల్‌, మూడు ఎస్సీ మహిళ

22, 42, 59 డివిజన్లు ఎస్సీ మహిళకు, 40, 43, 52, 60 డివిజన్లు ఎస్సీ జనరల్‌కు రిజర్వు అయ్యాయి.

బీసీలకు 20డివిజన్లకు కేటాయించగా అందులో పది బీసీ జనరల్‌, పది బీసీ మహిళ. 

28, 29, 30, 33, 34, 38, 46, 47, 48, 57 డివిజన్లు బీసీ మహిళకు, 2, 7, 14, 16, 19, 24, 25, 31, 44, 51  బీసీ జనరల్‌కు కేటాయించారు. 

జనరల్‌ కేటగిరీ కింద 30డివిజన్లు రిజర్వుకాగా వాటిలో ఓసీ జనరల్‌కు 14, ఓసీ మహిళకు 16 రిజర్వు అయ్యాయి. 

జనరల్‌ మహిళలకు 5, 9, 10, 11, 12, 15, 17, 18, 20, 21, 37, 53, 54, 55, 56, 58, జనరల్‌కు 3, 4, 6, 13, 23, 26, 27, 35, 36, 39, 41, 45, 49, 50 డివిజన్లు కేటాయించారు. 

ఆరు కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ..

కొవిడ్‌ వ్యాప్తి, నిబంధనల నేపథ్యంలో అధికారులు నామినేషన్ల స్వీకరణకు ఆరు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో ఆయా డివిజన్లకు చెందిన రిటర్నింగ్‌ అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. జిల్లాపరిషత్‌ కార్యాలయంలో 16డివిజన్లు, కార్పొరేషన్‌ కార్యాలయంలో 12డివిజన్లు, ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో ఆరు డివిజన్లు, డీఆర్‌డీఏలో 17డివిజన్లు, జిల్లా కో ఆపరేటివ్‌ కార్యాలయంలో ఐదు డివిజన్లు, జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో నాలుగు డివిజన్లకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ జరగనుంది. 

1. జిల్లాపరిషత్‌ కార్యాలయంలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 14, 15, 16, 21, 38, 40, 41, 42 డివిజన్ల నామినేషన్లు స్వీకరిస్తారు.

2. ఖమ్మం కార్పొరేషన్‌ కార్యాలయంలో 17, 27, 28, 29, 30, 31, 33, 34, 35, 36, 37, 39 డివిజన్ల అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.

3. ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో 9, 10, 11, 12, 13, 18 ఆరు డివిజన్లకు సంబంధించిన వారి నుంచి నామపత్రాల స్వీకరణ ఉంటుంది.

4. డీఆర్‌డీఏ కార్యాలయంలో 43, 44, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 డివిజన్ల అభ్యర్థుల నామినేషన్లు స్వీకరిస్తారు.

5. జిల్లా కో ఆపరేటివ్‌ కార్యాలయంలో 19, 22, 23, 25, 26 డివిజన్ల వారి నామినేషన్లు స్వీకరిస్తారు. 

6. జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో 20, 24, 32, 45 డివిజన్ల నామినేషన్లు స్వీకరిస్తారు. 

Updated Date - 2021-04-16T06:06:58+05:30 IST