గంపెడాశలు!

ABN , First Publish Date - 2021-03-01T05:37:46+05:30 IST

ఎన్నికల ఫండ్‌ కోసం పలువురు అభ్యర్థులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు. మునిసిపల్‌ ఎన్నికల పోలింగ్‌ తేదీ సమీపిస్తుండటంతో పార్టీ నాయకుల నుంచి డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయా అని కొంతమంది నిరీక్షిస్తున్నారు.

గంపెడాశలు!

ఎన్నికల డబ్బు కోసం అభ్యర్థుల ఎదురుచూపులు

మేయర్‌, చైర్మన్‌గా ఎంపికైన వారి పైనే భారం మోపిన పార్టీలు

నగరపాలకసంస్థ పరిధిలో రూ.5 లక్షలు ఆశిస్తున్న కార్పొరేటర్‌ అభ్యర్థులు

మునిసిపాలిటీల్లో రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు..


గుంటూరు, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ఫండ్‌ కోసం పలువురు అభ్యర్థులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు. మునిసిపల్‌ ఎన్నికల పోలింగ్‌ తేదీ సమీపిస్తుండటంతో పార్టీ నాయకుల నుంచి డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయా అని కొంతమంది నిరీక్షిస్తున్నారు. ఈ దఫా భారీ మొత్తంలోనే అభ్యర్థులు ఆశలు పెట్టుకొంటున్నారు. ఎన్నికల ప్రచారాలు, ఓటర్లకు డబ్బు పంపిణీ చేసేందుకు తమ డివిజన్‌, వార్డులో ఇంత నగదు అవసరమని ఇప్పటికే నాయకుల ముందు తమ ఇండెంట్‌లను ఉంచారు. ఎవరైతే మేయర్‌, చైర్‌పర్సన్‌ పదవులను ఆశిస్తున్నారో వారే పార్టీ అభ్యర్థులకు ఎంతో కొంత సర్దుబాటు చేయాలని ఇప్పటికే హైకమాండ్‌ల నుంచి ఆదేశాలు కూడా జారీ అయినట్లు సమాచారం. 

గుంటూరు నగరంలో 2005లో ఎన్నికలు జరిగినప్పుడు ఏ డివిజన్‌ చూసుకొన్నా ఓటర్ల సంఖ్య 6వేల నుంచి 8 వేల మధ్యనే ఉండేది. అయితే ఓటర్ల పెరుగుదల కారణంగా ఇప్పుడు 10 వేల నుంచి 13 వేల మధ్యన ఓటర్ల సంఖ్య ఉంది. అలానే డివిజన్ల హద్దులు కూడా మారిపోయాయి. దీంతో ఈ దఫా ఎన్నికల్లో ఖర్చు భారీగానే పెరిగింది. ఇప్పటికే అభ్యర్థులు నిత్యం ఇంటింటి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ప్రచారం సందర్భంగా తమ వెంట నిత్యం 50 మందిని తిప్పుకొంటున్నారు. వారికి అయ్యే ఖర్చులన్ని అభ్యర్థులే చూసుకొంటున్నారు. కొన్ని డివిజన్లలో బాగా ఆర్థిక స్తోమత కలిగిన అభ్యర్థులే బరిలోకి దిగారు. కాగా కొన్ని చోట్ల పెద్దగా ఖర్చు చేయలేని వారిని ఎంపిక చేశారు. దీంతో వారంతా మేయర్‌, చైర్మన్‌ అభ్యర్థుల వైపు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే మేయర్‌ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్రని ఖరారు చేసింది. వైసీపీ ఇంకా ప్రకటించలేదు. కావటి మనోహర్‌ నాయకుడు, పాదర్తి రమేష్‌గాంధీ పేర్లు ఆ పార్టీ వర్గాల నోళ్లలో నానుతున్నాయి. రెండు, మూడు రోజుల్లో మేయర్‌ అభ్యర్థి ఎవరనేది వైసీపీ చెప్పే అవకాశం ఉంది పార్టీ నిర్ణయం వెలువడగానే మేయర్‌ అభ్యర్థి వద్దకు వెళ్లి ఇండెంట్‌లు చెప్పేందుకు సిద్ధమయ్యారు. డివిజన్‌కి రూ.5 లక్షల వరకు ఆశిస్తున్నారు.

ఎన్నికలు జరుగుతున్న తెనాలి, చిలకలూరిపేట, రేపల్లె, మాచర్ల, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్లలోనూ చైర్మన్‌ అభ్యర్థుల నుంచి కౌన్సిలర్‌ అభ్యర్థులు పోటీ చేస్తున్న వారు గంపెడాశలు పెట్టుకొన్నారు. ఒక్కో కౌన్సిలర్‌ అభ్యర్థి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పార్టీ ఫండ్‌ వస్తుందని ఆశతో ఉన్నారు. పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో అవసరమైతే ఓటుకు రూ.వెయ్యి వరకు పంపిణీ చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు ఎంతమంది ఓటర్లు ఉన్నారనే సంఖ్యని తెలుసుకొంటున్నారు. ఇదిలావుంటే 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నాయకుల వద్ద నుంచి వచ్చిన నగదుని ఓటర్లకు పంపిణీ చేయకుండా కొంతమంది డివిజన్‌, వార్డు స్థాయి నాయకులు వెనకేసుకొన్నారు. అప్పట్లో వివాదాలు కూడా చోటు చేసుకొన్నాయి. దీంతో అభ్యర్థులకు నేరుగా కాకుండా తమ మనుషులను ఏర్పాటు చేసి ఖర్చు పెట్టించాలని నేతలు భావిస్తున్నట్లు తెలిసింది. 


Updated Date - 2021-03-01T05:37:46+05:30 IST