కట్టడాలకు.. కాసుల బేరం!

ABN , First Publish Date - 2021-09-03T06:11:59+05:30 IST

గుంటూరు నగరంలో అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట లేకుండా పోతోంది.

కట్టడాలకు.. కాసుల బేరం!
బ్రాడీపేట 2/14లోని రెండు అంతస్తుల అక్రమ కట్టడాలు

గుంటూరు నగరంలో యథేచ్ఛగా అక్రమ కట్టడాలు

రేటు ఫిక్స్‌ చేస్తున్న కొందరు కార్పొరేటర్లు

వారిని ప్రసన్నం చేసుకుంటేనే నిర్మాణాలు

పెద్దలకు ఓ అధికారి అండాదండ

తన మనుషులచే వసూళ్ల పర్వం

నోటీసులివ్వడంలోనూ వ్యత్యాసం

  

గుంటూరు(కార్పొరేషన్‌), సెప్టెంబరు2: గుంటూరు నగరంలో అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట లేకుండా పోతోంది. కొంతమంది కార్పొరేటర్లు, ఓ అధికారి చెప్పిందే వేదం అన్నట్లు నడుస్తోంది. ప్రతి అక్రమ కట్టడానికి ఓ రేటు ఫిక్స్‌ చేసి దండుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరు నగరంలో ప్రధాన ప్రాంతాలైన లక్ష్మీపురం, బృందావన్‌ గార్డెన్స్‌, కొత్తపేట, అరండల్‌పేట ఇలా అనేక ప్రాంతాల్లో అక్రమ కట్డడాల తంతు యథేచ్ఛగా సాగుతోంది. నిత్యం అధికారులు నగర పర్యటనలు చేస్తూనే ఉన్నా కనీసం అటువైపు కన్నెత్తి అయినా చూడడం లేదు.

  

కార్పొరేటర్లదే హవా!

నగరానికి చెందిన ఓ కార్పొరేటర్‌ నేరుగా నియోజకవర్గ ప్రజాప్రతినిధుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఆ కార్పొరేటర్‌రే తన పరిధిలో ఉన్న అనేక ప్రాంతాల్లో పెద్దఎత్తున అక్రమ కట్టడాలను నిర్మించాడు. నగరంలోని లక్ష్మీపురం మెయిన్‌రోడ్డులో ఒకటి, బృందావన్‌ గార్డెన్స్‌ రోడ్డులోని స్పెన్సర్‌ ఎదురుగా మరొకటి, బ్రాడీపేట 2/14లో రెండు అంతస్తుల బిల్డింగ్‌.. ఇలా అక్రమ కట్టడాలకు అంతే లేదు.  లక్ష్మీపురం, బ్రాడీపేటలో రెండు బజారుల్లోనే 20కి పైగా అక్రమ కట్టడాలు చేపట్టడం గమనార్హం. ఆయా ప్రాంతాల్లో ఉన్న కార్పొరేటర్లు తాము చెప్పినట్లే నడవాలని టౌన్‌ప్లానింగ్‌ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆ అధికారులు కూడా స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిడిలకు తలొగ్గి అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్నారు. అమరావతి రోడ్డులోని నగరాలు, గోరంట్ల, హిమనీనగర్‌, ద్వారకానగర్‌, శ్రీనగర్‌, భారత్‌పేట తదితర ప్రాంతాల్లో  అక్రమ కట్టడాలు సాగుతున్నాయి. నగరానికి చెందిన ఓ కార్పొరేటర్‌ తన పరిధిని దాటి టీడీపీ కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో కూడా తాము చెప్పినట్లే వినాలని ఆదేశిస్తున్నారు. ఆ ప్రాంతంలో అక్రమ కట్టడాలను తామే చూసుకుంటామని చెప్పడంతో అధికారులు విస్తుపోతున్నారు. 


భారీగా చేతులు మారుతున్న డబ్బు

ఈ అక్రమ కట్టడాల్లో భారీగా డబ్బు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.  ప్రతి చోట అక్రమ కట్టడానికి లక్షలాది రూపాయలు తీసుకుని వాటిని ప్రోత్సహిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. నగరంలో ఓ అక్రమ భవన నిర్మాణానికి రూ.6 లక్షలు, మరో భవనం కోసం రూ.5 లక్షలు చేతులు మారినట్లు పలువురు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. ఎక్కడైనా నిర్మాణం కోసం ఇసుక తోలగానే సంబంధిత యజమానికి అధికార పార్టీకి చెదిన పలువురు కార్పొరేటర్ల నుంచి పిలుపు అందుతోంది. ముందు సార్‌ని కలిసిరావాలి.. ఆ తర్వాతే మీరు ఇళ్లు మొదలుపెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.  

  

ఆ అధికారి చెప్పినవారికే నోటీసు

టౌన్‌ప్లానింగ్‌కు చెందిన ఓ అధికారి ఈ అక్రమ కట్టడాల వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  ఆ అధికారి చెప్పిన వాటికే నోటీసులు ఇస్తూ.. మిగిలిన వాటిని వదిలేస్తున్నారు. తన ప్రతినిధుల ద్వారా భారీగా ముడుపులు తీసుకుని అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్నారని సమాచారం. ఇటీవల టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది ఒక భవనానికి నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా వెంటనే సదరు అధికారి ఫోన్‌ చేసి వెనక్కి రండంటూ ఆదేశించారు. దీంతో నోటీసులు ఇవ్వకుండానే వెనక్కు వచ్చారు.  ఆ అధికారికి సంబంధించిన ఓ వ్యక్తికి డబ్బు ముట్టచెప్పితే ఆ భవనాలకు ఎటువంటి ఢోకా ఉండదని పలువురు భావిస్తున్నారు. 


అడ్డగోలుగా శారదాకాలనీ రోడ్డు విసర్తణ 

నగరంలోని శారదాకాలనీ రోడ్డు విస్తరణ పనులు అడ్డగోలుగా సాగుతున్నాయి. ఇక్కడ కొందరు టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది రోడ్డు విస్తరణ పనుల్లో భారీగా ముడుపులు తీసుకుంటున్నారు. నగరపాలక సంస్థకు చెందిన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ఇల్లు రోడ్డు విస్తరణలో పోతున్నప్పటికీ ఏకంగా అక్కడ రోడ్డు కుదించారు.  మాస్టర్‌ప్లాన్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారానికి  ఆ ప్రాంత ప్రజల ముక్కున వేలేసుకుంటున్నారు. 

Updated Date - 2021-09-03T06:11:59+05:30 IST