గుడ్ న్యూస్: కరోనా వైరస్ ఉత్పరివర్తనాలతో టీకాకు ఇబ్బంది లేదు: నిపుణులు

ABN , First Publish Date - 2020-10-09T01:37:13+05:30 IST

కరోనా వైరస్‌లోని జి-స్ట్రెయిన్ ఉత్పరివర్తనాలతో రాబోయే టీకాలకు ఇబ్బంది లేదని తాజా అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. యార్క్ యూనివర్సిటీ

గుడ్ న్యూస్: కరోనా వైరస్ ఉత్పరివర్తనాలతో టీకాకు ఇబ్బంది లేదు: నిపుణులు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌లోని జి-స్ట్రెయిన్ ఉత్పరివర్తనాలతో రాబోయే టీకాలకు ఇబ్బంది లేదని తాజా అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. యార్క్ యూనివర్సిటీ నిపుణులు నిర్వహించిన ఈ అధ్యయానికి సంబంధించిన వివరాలు సైంటిఫిక్ జర్నల్ నేచర్‌లో ప్రచురితమయ్యాయి.


కరోనా వైరస్‌పై పోరు కోసం ప్రస్తుతం వివిధ దేశాలు అభివృద్ధి చేస్తున్న టీకాలు వైరస్‌ ‘డి-స్ట్రెయిన్’ పై రూపొందిస్తున్నట్టు నిపుణులు పేర్కొన్నారు. డి-స్ట్రెయిన్ అనేది ప్రారంభంలో సాధారణ క్రమంగా ఉండేదని, ఆ తర్వాతి నుంచి వైరస్ ప్రస్తుతం పేర్కొంటున్న జి-స్ట్రెయిన్‌గా ఉత్పరివర్తనం చెందిందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దీని ఆధిపత్యం కొనసాగుతోందని వివరించారు.


సార్స్‌-కోవ్-2లో జి-స్ట్రెయిన్ దాదాపు 85 శాతం వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వైరస్ ఉపరితలంపై ప్రధాన ప్రొటీన్ లోపల ఉండే జి-స్ట్రెయిన్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్న భయాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఆ భయాలు అవసరం లేదని, వ్యాక్సిన్‌పై ప్రతికూల ప్రభావానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని ఆస్ట్రేలియాకు చెందిన నేషనల్ సైన్స్ ఏజెన్సీ కామన్‌వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐఆర్ఓ) అధ్యయనంలో వెల్లడైంది.


ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేస్తున్న వందలాది కరోనా టీకాలకు ఇది మంచి వార్త కాగలదని యార్క్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఎస్ఎస్ వాసన్ పేర్కొన్నారు. వైరస్ జి-స్ట్రెయిన్‌గా ఉత్పరివర్తనం చెందినా వ్యాక్సిన్ మాత్రం ప్రభావవంతంగా పనిచేస్తుందని వివరించారు.   


Updated Date - 2020-10-09T01:37:13+05:30 IST