‘టీకా అంతర్జాతీయం’తోనే మానవ మనుగడ!

ABN , First Publish Date - 2021-07-24T06:07:43+05:30 IST

కరోనా వైరస్‌ బయటపడినప్పటి నుంచి ధనిక దేశాల్లోని బహుళజాతి ఫార్మా సంస్థల మధ్య టీకా తయారీ పోటీ మొదలైంది. అమెరికా, బ్రిటన్‌, రష్యా, చైనా టీకాలను మూడో విడత ప్రయోగాలు పూర్తి కాకముందే అత్యవసరం...

‘టీకా అంతర్జాతీయం’తోనే మానవ మనుగడ!

కరోనా వైరస్‌ బయటపడినప్పటి నుంచి ధనిక దేశాల్లోని బహుళజాతి ఫార్మా సంస్థల మధ్య టీకా తయారీ పోటీ మొదలైంది. అమెరికా, బ్రిటన్‌, రష్యా, చైనా టీకాలను మూడో విడత ప్రయోగాలు పూర్తి కాకముందే అత్యవసరం కింద కొన్ని దేశాలు అనుమతించాయి. టీకా కొనుగోలులో ధనిక దేశాలు ముందంజలో ఉంటూ తయారీ సంస్థలకు లక్షల కోట్ల డాలర్లు అడ్వాన్సుగా ఇచ్చి ముందుగానే టీకాను వశం చేసుకున్నాయి. 45 కోట్ల జనాభా కోసం ఐరోపా దేశాలు 260 కోట్ల డోసుల వ్యాక్సిన్లను– అంటే ఐరోపా జనాభా కంటే మూడు రెట్లు ఎక్కువగా కొన్నాయి.


అమెరికా, జపాన్‌, కెనడా లాంటివి తమ జనాభా కంటే మూడు నాలుగు రెట్లు అధికంగా కరోనా టీకాను ముందుగా పొందగలిగాయి. ధనిక దేశాలు ఆర్థిక బలంతో అవసరానికి మించి టీకాలను స్వాధీనం చేసుకొని పంపిణీ చేస్తుంటే, అదే సమయంలో పేదదేశాలు, ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలోని దేశాల్లో రెండు డోసులు పొందిన జనాభా అరశాతం కూడా లేకపోయింది. ఒక డోసు తీసుకున్న జనాభాయే అక్కడ 2.1 శాతం. 


ప్రపంచ ఆరోగ్యసంస్థ, ప్రపంచబ్యాంకు, గేట్స్‌ ఫౌండేషన్‌ మొదలైన సంస్థలు ధనిక దేశాల్లో అవసరానికి మించి ఉన్న టీకాను పేద దేశాలకు విరాళంగా గాని, నామమాత్రపు ధరకు గానీ సరఫరా చేయాలని అంటున్నాయి. ప్రపంచ బ్యాంకు కూడా 40 శాతం పేదదేశాల్లో జనాభాకు టీకా అందించేందుకు సన్నాహాలు చేసింది. జీ7 దేశాలు సైతం 100 కోట్ల టీకాలు పేదదేశాలకు ఉచితంగా అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. మనదేశం కూడా ‘టీకా మైత్రి’ పేరుతో 74 దేశాలకు వ్యాక్సిన్‌ను సరఫరా చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. కానీ ఈ ప్రయత్నాలేవీ పేదదేశాల అవసరాలకు తగ్గ స్థాయిలో లేవు. 790 కోట్ల ప్రపంచ జనాభాలో 530 కోట్ల మంది అల్పాదాయ లేదా పేదదేశాల్లో ఉంటూ, ఉచిత టీకా కోసం ఎదురుచూస్తున్నారు. టీకా విరాళంతో పాటు ఆఫ్రికా, ఆసియాలలోని పేద దేశాలు స్వయంగా టీకా తయారు చేసుకోవడానికి ధనికదేశాలు ప్రోత్సాహం అందించాలి. మేధోసంపత్తి అడ్డంకులు తొలగించి, తగిన సాంకేతికతను సమకూర్చి, ముడిసరుకులు అందించి టీకా తయారీకి సహకరించాలి. ఇందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ దన్నుగా నిలవాలి. ప్రపంచ జనాభా మొత్తానికి వ్యాక్సిన్‌ వేసేందుకు 2023 సంవత్సరం చివరిదాకా పడుతుంది. అంత మొత్తంలో టీకాలు కావాలంటే సమష్టి కృషి అవసరం. భవిష్యత్తులో కరోనా ఎన్ని ప్రమాదకరమైన రూపాంతరాలు చెందుతుందో శాస్త్రజ్ఞులకు అంతుపట్టడం లేదు. ఈ నేపథ్యంలో యావత్‌ మానవజాతి మనుగడకు ధనిక దేశాలు, మధ్య ఆదాయదేశాలు సంయుక్తంగా పేదదేశాలకు టీకాను విరాళంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది.


మే నెలలో రోమ్‌లో జరిగిన ‘గ్లోబల్‌ హెల్త్‌ సమ్మిట్‌’ లో కరోనా వైరస్‌ వల్ల కలిగే సామాజిక, ఆర్థిక సంక్షోభాల నుంచి ప్రపంచాన్ని రక్షించుకోవాలంటే వెనుకబడిన దేశాలకు కూడా టీకా సక్రమంగా అందాల్సిందేనని ప్రముఖులు నొక్కి వక్కాణించారు. ప్రపంచ మానవాళి సురక్షితంగా ఉండాలంటే ప్రతి దేశం కరోనాను జయించి తీరాలి. ప్రతి దేశం వసుధైక కుటుంబ భావనను మనసులో ఉంచుకొని టీకా ప్రక్రియ పూర్తయ్యేందుకు ఇతర దేశాలకు సహాయ సహకారాలు అందిస్తూ మానవజాతి మనుగడకు బాటలు వేయాల్సి ఉంది. ఈ కష్టకాలంలో ‘టీకా అంతర్జాతీయం’ కావాలి. 


డా. చుక్కా కొండయ్య

మాజీ డైరెక్టర్‌ జనరల్‌, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ఎంఎస్‌ఎంఈ

Updated Date - 2021-07-24T06:07:43+05:30 IST