సబర్మతి నదిలో కరోనా కలకలం!

ABN , First Publish Date - 2021-06-19T02:06:13+05:30 IST

అహ్మదాబాద్‌లోని సబర్మతి నదితోపాటు మరో రెండు చెరువుల్లో కరోనా వైరస్ ఆనవాళ్లు ఉన్నట్టు గుజరాత్‌లోని

సబర్మతి నదిలో కరోనా కలకలం!

అహ్మదాబాద్: అహ్మదాబాద్‌లోని సబర్మతి నదితోపాటు మరో రెండు చెరువుల్లో కరోనా వైరస్ ఆనవాళ్లు ఉన్నట్టు గుజరాత్‌లోని ఐఐటీ గాంధీనగర్ పరిశోధకులు గుర్తించారు. యూనిసెఫ్ నిధులతో ఈ అధ్యయనం నిర్వహించారు. అయితే, ఈ నీటిలో గుర్తించిన వైరస్ సజీవంగా ఉందా? చనిపోయి ఉందా? అన్న విషయాన్ని వెల్లడించలేదు. భవిష్యత్తులో ఇలాంటివి మరోసారి జరగకుండా ఉండాలంటే ఈ నీటిలోకి వైరస్ ఎలా వచ్చి చేరిందన్నదానిపై విచారణ జరిపించాలని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ మనీష్ కుమార్ పేర్కొన్నారు. 


సబర్మతి నదితోపాటు మరో రెండు చెరువుల్లో వైరస్ వెలుగు చూడడంతో అప్రమత్తమైన అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) ఈ నమూనాలను గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ (జీబీఆర్‌సీ)కి పంపాలని నిర్ణయించింది. గతేడాది సెప్టెంబర్, డిసెంబర్ మధ్య ఐఐటీ గాంధీనగర్ ఈ అధ్యయనాన్ని చేపట్టింది. సబర్మతి నదితోపాటు చందోల, కంకారియా చెరువుల్లోని నీటి నమూనాలను సేకరించి పరిశోధనలు జరిపింది. 


ఆర్ఎన్ఏ ఐసోలేషన్ ద్వారా సార్స్-కోవ్-2లోని ఎన్, ఎస్, ఓఆర్ఎఫ్ ల్యాబ్ జీన్స్‌ను గుర్తించడమే లక్ష్యంగా తమ పరిశోధన సాగినట్టు ఐఐటీ ప్రొఫెసర్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాము ఎన్ జీన్ కాపీలను కనుగొన్నట్టు చెప్పారు. అయితే, చందోల చెరువు శాంపిళ్లలో ఓఆర్ఎఫ్ ల్యాబ్ జీన్ కనిపించలేదన్నారు. ఎస్ జీన్ కాపీలు మాత్రం మూడింటిలోనూ గుర్తించినట్టుప వివరించారు. కరోనా వైరస్ జీన్స్‌ను తాము గుర్తించినప్పటికీ తమ విధానం మాత్రం అది బతికి ఉన్నదా, లేక చనిపోయిందా? అన్న విషయాన్ని చెప్పలేదని పేర్కొన్నారు.


తాము గుర్తించిన కరోనా వైరస్ జీన్స్ మొత్తం చనిపోయిందని చెప్పలేమని, అలాగే, నీటి ద్వారా వైరస్ సంక్రమిస్తుందని కానీ నిర్ధారణ కాలేదన్నారు. దీనిపై మరింత పరిశోధన చేసేందుకు సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ పేర్కొన్నారు.

Updated Date - 2021-06-19T02:06:13+05:30 IST