ప్రపంచంలోనే సెల్ఫ్ ఐసోలేషన్ విధించుకున్న చిన్న ద్వీపం...పంజూ గ్రామం

ABN , First Publish Date - 2020-03-26T12:41:14+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న కరోనా వైరస్ కట్టడికి స్వచ్ఛందంగా కదిలి సెల్ఫ్ ఐసోలేషన్ విధించుకొని ప్రపంచంలోనే ఆదర్శ గ్రామంగా నిలచింది....

ప్రపంచంలోనే సెల్ఫ్ ఐసోలేషన్ విధించుకున్న చిన్న ద్వీపం...పంజూ గ్రామం

ముంబై (మహారాష్ట్ర) : ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న కరోనా వైరస్ కట్టడికి స్వచ్ఛందంగా కదిలి సెల్ఫ్ ఐసోలేషన్ విధించుకొని ప్రపంచంలోనే ఆదర్శ గ్రామంగా నిలచింది మహారాష్ట్రలోని ముంబై నగరం సమీపంలోని చిన్న ద్వీపమైన పంజూ గ్రామం. థానే జిల్లాలోని వాసాయి తహసీల్ పరిధిలోని పంజూ గ్రామం ఓ చిన్న దీవి. 1400 మంది జనాభా ఉన్న ఈ చిన్న గ్రామం పచ్చని పంట పొలాలతో విస్తరించింది. వ్యవసాయం ప్రధాన వృత్తి అయిన పంజూ గ్రామంలో రోజువారీ కూలీలు ఎక్కువగా ఉన్నా, కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో వారంతా కూలీ పనులు సైతం మానుకొని సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు.


పంజూ గ్రామస్థులు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండటమే కాకుండా తమ గ్రామంలోకి పర్యాటకులతోపాటు ఎవరినీ ప్రవేశించకుండా నిషేధం విధించామని గ్రామసర్పంచ్ చెప్పారు. ఈ ద్వీప గ్రామమైన పంజూ నుంచి నైగావ్ సబర్బన్ కు వెళ్లాలన్నా పడవపై వెళ్లాల్సిందే. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా తమ గ్రామంలో వైరస్ రాకుండా పడవల రాకపోకలను కూడా నిలిపివేశారు. పంజా గ్రామస్థులెవరూ ముంబై నగరంలోకి వెళ్లకుండా నిషేధించారు. మహారాష్ట్రలోని ముంబై, థానే నగరాలతో పాటు మొత్తం మీద కరోనా వైరస్ కేసుల సంఖ్య 122కు పెరిగిన నేపథ్యంలో పంజా గ్రామస్థులు స్వచ్ఛందంగా ఐసోలేషన్ విధించుకోవడం విశేషం. 

Updated Date - 2020-03-26T12:41:14+05:30 IST