మేం బతుకుతామో లేదో తెలియదు...డైమండ్ ప్రిన్సెస్‌ విహార నౌక నుంచి భారతీయుడి ఆవేదన

ABN , First Publish Date - 2020-02-13T13:45:02+05:30 IST

‘‘డైమండ్ ప్రిన్సెస్‌ విహార నౌకలో కరోనా వైరస్ రోగుల మధ్య మేం బతకుతామో లేదో తెలియదు...మాకు కూడా కరోనా వైరస్ సంక్రమించే ప్రమాదం ఉంది, క్రూయిజ్ షిప్ నుంచి మమ్మల్ని రక్షించండి’’ అంటూ....

మేం బతుకుతామో లేదో తెలియదు...డైమండ్ ప్రిన్సెస్‌ విహార నౌక నుంచి భారతీయుడి ఆవేదన

 డైమండ్ ప్రిన్సెస్‌ షిప్, టోక్యో (జపాన్) : డైమండ్ ప్రిన్సెస్‌ విహార నౌకలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న భారతీయుడొకరు తాజాగా పంపిన వీడియోలో తన ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘డైమండ్ ప్రిన్సెస్‌ విహార నౌకలో కరోనా వైరస్ రోగుల మధ్య మేం బతకుతామో లేదో తెలియదు...మాకు కూడా కరోనా వైరస్ సంక్రమించే ప్రమాదం ఉంది, క్రూయిజ్ షిప్ నుంచి మమ్మల్ని రక్షించండి’’ అంటూ తమిళనాడు రాష్ట్రంలోని మధురైకి చెందిన అన్బలగన్ పంపిన వీడియోలో విజ్ఞప్తి చేశారు.

విహార నౌకలో ప్రయాణికులను ఆరు అడుగుల దూరంలో నడవమని కోరుతున్నామని, షిప్‌‌లోని గదుల్లో తాము ఉన్నామని వీడియోలో అన్బలగన్ చూపించారు. తాము నౌకలోని టాప్ డెక్స్‌లో ఉన్నామని, కరోనా వైరస్ సోకిన రోగులకు ఆహారాన్ని వారి గదులకు పంపుతున్నారని ఆయన పేర్కొన్నారు. జపాన్ తీరంలోని సముద్రంలో నిర్బంధించిన ఓడలో ప్రయాణికుల కదలికలపై ఆంక్షలు విధించారని, నౌకలో పనిచేస్తున్న తాము ప్రమాదంలో ఉన్నామని, భారత ప్రభుత్వం తమను రక్షించాలని అన్బలగన్ విజ్ఞప్తి చేశారు.


‘‘మేం నౌకలోని ప్లేట్లను షేర్ చేసుకొని మెస్ లో భోజనం చేస్తున్నాం, అందువల్ల ఈ కరోనా వైరస్ మాకు సులభంగా సోకే ప్రమాదముంది. అందుకే మమ్మల్ని ఈ నౌక నిర్బంధం నుంచి బయటకు తీసుకురావాలని కోరుతున్నాం’’అని ఆయన పేర్కొన్నారు.‘‘మోదీజీ ఐఏఎఫ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ను పాకిస్థాన్ నుంచి ఎలా కాపాడారో అలా మమ్మల్ని కూడా రక్షిస్తారని మేం ఆశిస్తున్నాం’’ అంటూ అన్బలగన్ కోరారు.


తమిళ భాషలో మాట్లాడిన అన్బలగన్, తమిళనాడు ముఖ్యమంత్రి కె పళనిస్వామి, డీఎంకే అధినేత స్టాలిన్, సూపర్‌స్టార్స్ రజనీకాంత్, కమల్‌హాసన్, నటులు విజయ్,అజిత్ కుమార్‌లకు విజ్ఞప్తి చేశారు. డైమండ్ ప్రిన్సెస్ విహార నౌకలో 2500 మంది ప్రయాణికులు, వెయ్యిమంది సిబ్బంది ఈ నెల 4వతేదీ నుంచి నిర్బంధంలో ఉన్నారు. రోజురోజుకు నౌకలో కరోనా వైరస్ రోగుల సంఖ్య పెరుగుతుండటంతో నౌకలోని వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


Updated Date - 2020-02-13T13:45:02+05:30 IST