ఒంటరిగా చనిపోతున్నారు.. మీకూ అలాంటి చావు అవసరమా?

ABN , First Publish Date - 2020-03-28T13:51:44+05:30 IST

ఎందరో కరోనా సోకి ఆస్పత్రుల ఐసోలేషన్‌ వార్డుల్లో ఒంటరిగా గడుపుతున్నారు. తమవారికి ఫోన్‌ చేసి, కన్నీటి పర్యంతమవుతున్నారు. అయినవాళ్ల కడసారి చూపునకు కూడా నోచుకోకుండా చనిపోతున్నారు.

ఒంటరిగా చనిపోతున్నారు.. మీకూ అలాంటి చావు అవసరమా?

అయిన వారు దగ్గరుండరు

భారతీయ సంతతి డాక్టర్‌ కామిని ఆవేదన

న్యూయార్క్‌, మార్చి 27: ‘‘ఎందరో కరోనా సోకి ఆస్పత్రుల ఐసోలేషన్‌ వార్డుల్లో ఒంటరిగా గడుపుతున్నారు. తమవారికి ఫోన్‌ చేసి, కన్నీటి పర్యంతమవుతున్నారు. అయినవాళ్ల కడసారి చూపునకు కూడా నోచుకోకుండా చనిపోతున్నారు. వారి పరిస్థితిని ప్రత్యక్షంగా  చూస్తే ఎంత బాధ ఉంటుందో ఒక డాక్టర్‌గా నాకు తెలుసు. మీకు అలాంటి చావు అవసరమా? సామాజిక దూరం పాటించండి. వైరస్‌ వ్యాప్తిని నియంత్రించండి’’ అని న్యూయార్క్‌ నగరానికి చెందిన భారతీయ సంతతి వైద్యురాలు డాక్టర్‌ కామినీ దూబే విజ్ఞప్తి చేస్తున్నారు. న్యూయార్క్‌ వర్సిటీ లాంగోన్‌ మెడికల్‌ సెంటర్‌, బెలెవ్యూ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆమె.. కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్నారు.


ఒక వ్యాధితో ఇంత మంది చనిపోవడం తానెప్పుడూ చూడలేదంటున్నారు. ‘‘కరోనా సోకిన వాళ్లకు చికిత్స అందించే సమయంలో మాకు కూడా ముప్పు ఉందని తెలుసు. ఇలా అమరులు అవ్వడానికి మేం వైద్య వృత్తిలోకి అడుగు పెట్టలేదు. మేం ఉన్నది యుద్ధభూమిలో కాదు. కానీ, తప్పదు. ఇదో పెద్ద విపత్తు. చికిత్స అందించే పరికరాలు, వెంటిలేటర్లు వంటివి పరిమితంగా ఉన్నప్పుడు.. రోగుల సంఖ్య పెరిగితే ఎలా? ఉన్న వెంటిలేటర్లను ఎవరికి సర్దాలి? ఇంటికి వెళ్లినా ఇవే ఆలోచనలు. అయినా.. మేము చికిత్సను అందించేందుకు సిద్ధం. ప్రజలు కూడా పరిస్థితిని అర్థం చేసుకుని, వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో భాగమవ్వాలి. స్వీయ నిర్బంధాన్ని, సామాజిక దూరాన్ని పాటించాలి’’ అని ఆమె కోరారు.

Updated Date - 2020-03-28T13:51:44+05:30 IST